అనుమతులు లేకుండానే ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం

కృష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు పొందకుండా ఆంధ్రప్రదేశ్‌ హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల కింద కొత్త నిర్మాణాలు, విస్తరణ పనులు చేపడుతోందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది.

Updated : 09 Dec 2022 06:31 IST

హంద్రీ-నీవా, గాలేరు-నగరిపై నిర్మాణాలకు టెండర్లు

కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు పొందకుండా ఆంధ్రప్రదేశ్‌ హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల కింద కొత్త నిర్మాణాలు, విస్తరణ పనులు చేపడుతోందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. వాటికి సంబంధించి టెండర్లు కూడా పిలిచిందని పేర్కొంది. ఈ మేరకు ఈఎన్సీ సి.మురళీధర్‌ బోర్డు ఛైర్మన్‌కు గురువారం లేఖ రాశారు. ఈ రెండు ప్రాజెక్టులు అనుమతి లేనివని, పైగా కృష్ణా బేసిన్‌ బయటి ప్రాంతాల ప్రయోజనాల కోసం నీటిని తరలించేవిగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టం-2014 ఉల్లంఘనలకు పాల్పడుతూ ఈ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆ రాష్ట్రం కొనసాగిస్తూనే ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉల్లంఘనల తీరును కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లాలని బోర్డును కోరారు.  

లేఖలో పేర్కొన్న అంశాలు...

హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాలువపై 203.5 కిలోమీటరు వద్ద రెండో దశ పనుల్లో భాగంగా 52వ ప్యాకేజీ కింద ఎత్తిపోతల పథకాన్ని ఏపీ నిర్మిస్తోంది. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మండలంలో అమిద్యాల, రాకెట్ల, పెద్దకౌకుంట్ల గ్రామాల పరిధిలోని ఎనిమిదివేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ఈ నిర్మాణాలు చేపడుతోంది.

హంద్రీనీవా రెండో దశలో మడకశిర కాలువ 41-125 కిలోమీటర్ల మధ్య బైపాస్‌ కాలువ నిర్మాణం చేస్తున్నారు. సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలోని చెరువులను నింపేందుకు దీన్ని చేపడుతున్నారు. 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలు కూడా గుత్తేదారులకు అప్పగించనున్నారు.

కొండాపురంలోని గండికోట డ్యాం వద్ద గాలేరు నగరి ప్రధాన కాలువకు క్రాస్‌ రెగ్యులేటర్‌ నిర్మాణం చేపడుతున్నారు.

అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం మండలం బెస్తపల్లి సమీపంలో బెస్తపల్లి ఎత్తిపోతల పథకం, కలిబండ చెరువు వద్ద హంద్రీనీవా కాలువపై ఎత్తిపోతల పథకాన్ని ఏపీ నిర్మిస్తోంది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని