ఏపీలో జల క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి: రామ్మోహన్‌ నాయుడు

తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జల క్రీడల కోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తెదేపా లోక్‌సభ పక్షనేత రామ్మోహన్‌ నాయుడు కోరారు.

Updated : 09 Dec 2022 05:44 IST

ఈనాడు, దిల్లీ: తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జల క్రీడల కోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తెదేపా లోక్‌సభ పక్షనేత రామ్మోహన్‌ నాయుడు కోరారు. క్రీడాభివృద్ధిపై లోక్‌సభలో చేపట్టిన చర్చలో గురువారం ఆయన మాట్లాడుతూ... ‘దేశంలో భారీ స్టేడియాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న మనం క్షేత్రస్థాయిలో ప్రతిభను పట్టించుకోకపోవడంతో ఎందరో క్రీడాకారులు పశువుల కాపర్లుగానే మిగిలిపోతున్నారు. ఖేలో ఇండియా కింద జిల్లా స్థాయిలోనే వసతులు కల్పిస్తున్నారు. దాన్ని పాఠశాలల స్థాయికి తీసుకెళ్లాలి. మా నియోజకవర్గానికి చెందిన పట్టి భాగ్యచంద్ర యాదవ్‌ నేపాల్‌లో కర్రసాము పోటీలకు వెళ్లి, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలి’ అని సూచించారు.

బంధుప్రీతితోనే క్రీడారంగం పతనం: మార్గాని భరత్‌

బంధుప్రీతి, ముఠా రాజకీయాలతోనే దేశంలో క్రీడా రంగం పతనమైందని వైకాపా ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ఆరోపించారు. క్రీడాభివృద్ధిపై లోక్‌సభలో చేపట్టిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘బెంగాల్‌లో ఫుట్‌బాల్‌, పంజాబ్‌లో హాకీ, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాడ్మింటన్‌ ప్రసిద్ధి చెందాయి. ఆయా రాష్ట్రాల్లో వీటిని కేంద్రం ప్రోత్సహిస్తే అక్కడకు క్రీడా పర్యాటకులు పెరుగుతారు. అంతర్జాతీయ స్థాయి శిక్షకులు, స్టేడియాలు లేకుండా మనం ఒలింపిక్స్‌ పతకాలను సాధించలేం. ఒలింపిక్స్‌లో స్విమ్మర్‌ మైఖేల్‌ ఫెల్ప్స్‌ ఒక్కడే 28 పతకాలు సాధించారు. మనం కలలోనైనా అలాంటి క్రీడాకారులను తయారు చేయగలమా?’ అని ప్రశ్నించారు.

* నరసరావుపేటకు ఇండోర్‌ స్టేడియం కేటాయించారని, అలానే దేశంలోని ప్రతి నియోజకవర్గాలకు కేటాయించాలని వైకాపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.

* పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్‌ ఇవ్వాలని తెదేపా లోక్‌సభ పక్షనేత రామ్మోహన్‌నాయుడు కోరారు. లోక్‌సభ జీరో అవర్‌లో గురువారం ఆయన మాట్లాడారు. జీఐ ట్యాగ్‌ ఇవ్వాలని తాను 2021లోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చానని, 2022లో ఆ ప్రక్రియ ప్రారంభమైందని సమాధానం ఇచ్చారన్నారు. జీఐ ట్యాగ్‌ ఇస్తే కార్మికులకు ఆదాయం పెరుగుతుందన్నారు.

* మహిళల భద్రత, సురక్షిత ప్రయాణం కోసం ప్రత్యేక స్లీపర్‌ క్లాస్‌ రైళ్లు ఏర్పాటు నడపాలని అమలాపురం ఎంపీ చింతా అనూరాధ కోరారు. లోక్‌సభ జీరో అవర్‌లో ఆమె మాట్లాడారు.

* కార్మికుల నియామకంలో లింగ వ్యత్యాసాన్ని తగ్గించాల్సి ఉందని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి సూచించారు. లోక్‌సభలో గురువారం ఆమె మాట్లాడారు. వివిధ విభాగాల్లో మహిళల నియామకాలకు కోటాలు ఇవ్వాలని, ప్రోత్సాహకాలు పెంచాలని కేంద్రానికి విన్నవించారు.

రూ.12 వేల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణానికి ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి 2022-23లో రూ.12 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. గురువారం లోక్‌సభలో వైకాపా ఎంపీ వంగా గీత అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.20,208 కోట్ల విలువైన హైవేల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలని లక్ష్యంగా ఉందన్నారు. ఈ ఏడాది రహదారుల నిర్వహణకు రూ.213 కోట్లు, సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ కింద రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.408 కోట్లు కేటాయించామన్నారు. ఇందులో రూ.345 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు