ఆక్వా ధరలపై అవగాహన లేకుండా విమర్శలు

ప్రపంచ వ్యాప్తంగా ఆక్వా ఎగుమతుల్లో వచ్చిన ఒడిదొడుకుల కారణంగానే ధరలు తగ్గాయని, ప్రతిపక్ష నాయకులు అవగాహన లేకుండా బురద చల్లుతున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

Updated : 09 Dec 2022 11:25 IST

ప్రతిపక్షాలపై మంత్రి  సీదిరి అప్పలరాజు మండిపాటు

ఈనాడు, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా ఆక్వా ఎగుమతుల్లో వచ్చిన ఒడిదొడుకుల కారణంగానే ధరలు తగ్గాయని, ప్రతిపక్ష నాయకులు అవగాహన లేకుండా బురద చల్లుతున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. కొవిడ్‌ను సీఎం జగన్‌ చక్కగా హ్యాండిల్‌ చేశారని, ఆయన ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఉన్న మత్స్యకళాశాలలోని బ్యాచిలర్‌ మత్స్య సైన్సు(బీఎఫ్‌ఎస్సీ) కోర్సులో ప్రవేశానికి ఎంపికైన అభ్యర్థుల జాబితాను సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆక్వాలో ఉత్పత్తి వ్యయం తగ్గించేందుకు చర్యలు మొదలు పెట్టాం. అమెరికా, యూరప్‌, గల్ఫ్‌ దేశాలకు ఎగుమతులు చేసేందుకు ప్రీ ట్రేడ్‌ ఒప్పందం కోసం కేంద్రానికి లేఖ రాశాం. ఆక్వా ధరలు తగ్గకుండా హైపవర్‌ కమిటీ పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలో క్రాప్‌ హాలిడే ప్రకటించే పరిస్థితి రాదు. చైనాకు ఎగుమతులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 10ఎకరాల లోపు వారికి విద్యుత్తు రాయితీ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఎమ్యూనరేషన్‌ జరుగుతోంది. అందరికి రాయితీ అందుతుంది. గత మూడేళ్లలో ఆక్వారంగానికి విద్యుత్తు రాయితీ కింద రూ.2,687కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఆక్వా రైతులకు విద్యుత్తు యూనిట్‌కు రూ.1.50 అందిస్తున్నాం. వైఎస్సార్‌ పశుబీమా క్లైయిమ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. 2019-20, 2020-21లో కంటే 2021-22లో క్లైయిమ్స్‌ రెండు వందల శాతం పెరిగాయి. దీనిపై పరిశీలన జరుగుతోంది’’ అని వెల్లడించారు.

40సీట్లు భర్తీ..: ‘‘బ్యాచిలర్‌ మత్య్స(ఫిషరీస్‌) సైన్సులో 40 సీట్లు ఉండగా.. ఏపీ వారికి 29, తెలంగాణ వారికి 11సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు 13లోపు కళాశాలలో ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది. మత్స్య విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే డిప్లొమా, బ్యాచిలర్‌, పీజీ కోర్సులను ఏర్పాటు చేయనున్నాం. విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పరిశోధనల కోసం పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోని నైపుణ్యం కలిగిన డిప్లొమా వారు 12వేలు, బ్యాచిలర్‌ డిగ్రీ వారు 6,118, పీజీ చేసినవారు 2,500మంది అవసరం ఉంది’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, వర్సిటీ ఓఎస్‌డీ ఓగిరాల సుధాకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని