ఎఫ్‌ఐఆర్‌ ‘రీ రిజిస్టర్‌’ ఎలా చేస్తారు?

దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుపై సీఆర్‌పీసీ సెక్షన్‌ 174 (అనుమానాస్పద మృతి) కింద మొదట నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఆల్టర్‌ (వెలుగులోకి వచ్చిన వివరాలతో కొత్త సెక్షన్లు చేర్చి సవరించడం) చేయకుండా.. ఐపీసీ సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్‌ ‘రీ రిజిస్టర్‌’ ఎలా చేస్తారని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది.

Updated : 09 Dec 2022 09:32 IST

ఆధారాలు మా ముందు పెట్టండి
ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుపై సీఆర్‌పీసీ సెక్షన్‌ 174 (అనుమానాస్పద మృతి) కింద మొదట నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఆల్టర్‌ (వెలుగులోకి వచ్చిన వివరాలతో కొత్త సెక్షన్లు చేర్చి సవరించడం) చేయకుండా.. ఐపీసీ సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్‌ ‘రీ రిజిస్టర్‌’ ఎలా చేస్తారని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు ఏ ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఆ వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను డిసెంబరు 12కు వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు అనంతబాబుపై కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మృతుడు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు... ‘‘ఈ హత్య అనంతబాబు భార్య, మరికొందరి సమక్షంలో జరిగింది. సీసీటీవీ ఫుటేజ్‌లో వారు కనిపిస్తున్నారు. వారిపై కేసు నమోదు చేయకుండా ల్యాబ్‌ నివేదిక కోసం చూస్తున్నామంటూ పోలీసులు కాలక్షేపం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అధికార పార్టీకి చెందిన వారు కావడంతో వారు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడం లేదు. మృతుడి శరీరంపై 32 తీవ్ర గాయాలున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఘటనలో మరికొందరు పాల్గొన్నారని అర్థమవుతోంది. ఎమ్మెల్సీపై బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా మొదట అనుమానాస్పద మృతి కిందనే కేసు కట్టారు. నిరసనలు, ఉద్యమాలు చేశాక ఎమ్మెల్సీని నిందితుడిగా చేర్చారు. ఆయనకు సహకరించే ఉద్దేశంతో.. రిమాండ్‌ విధించిన 14 రోజుల్లో కస్టడీ కోసం పోలీసులు పిటిషన్‌ వేయకుండా ఆ గడువు దాటాక దాఖలు చేశారు. దీంతో మెజిస్ట్రేట్‌ కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ఎమ్మెల్సీపై రౌడీషీట్‌ నమోదై ఉన్నప్పటికీ ఎలాంటి నేర చరిత్ర లేదని దిగువ కోర్టుకు పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారు. నేరస్థలంలోని రక్తపు మరకలను, ఇతర ఆధారాలను సీజ్‌ చేయలేదు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించండి’’ అని కోరారు. 

ల్యాబ్‌ నుంచి నివేదిక రావాలి

హోంశాఖ తరఫు న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘శవపంచనామా ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ రీ రిజిస్టర్‌ చేశాం. దర్యాప్తు నిష్పాక్షికంగా చేస్తున్నాం. ప్రత్యేక పరిస్థితులు, ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు భావించినప్పుడే సీబీఐకి అప్పగించాలి. దర్యాప్తును ఎవరైనా ప్రభావితం చేస్తున్నారనేందుకు ఆధారాలు లేవు. సీసీటీవీ ఫుటేజ్‌ను ల్యాబ్‌కు పంపించాం. నివేదిక రావాల్సి ఉంది. వీడియోలో ఉన్నవాళ్లు ఎవరనేది తేలితే వారిని నిందితులుగా చేరుస్తాం. ఇది సీబీఐకి బదిలీ చేసే కేసు కాదు’ అన్నారు.

ప్రతివాదిగా చేరేందుకు భార్య అభ్యర్థన

అనంతబాబు భార్య అనంత లక్ష్మీదుర్గ ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేరి వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలని కోరగా అనుమతి ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

‘చింతామణి’పై 29న తుది విచారణ

ఓ సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉంటే చింతామణి నాటక ప్రదర్శనకు ఎందుకు అనుమతించాలని హైకోర్టు ప్రశ్నించింది. ఒక వర్గం వారిని వ్యసనపరులుగా ముద్ర వేయడం సరికాదంది. కళలు, సంస్కృతుల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడానికి వీల్లేదని చింతామణి నాటక ప్రదర్శన నిషేధంపై విచారణ సందర్భంగా హితవు పలికింది. ప్రభుత్వం జారీచేసిన నిషేధం ఉత్తర్వులపై తుది విచారణ చేస్తామని స్పష్టంచేస్తూ విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులులతో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. ‘చింతామణి’ ప్రదర్శనపై నిషేధం విధించడాన్ని సవాలు చేస్తూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిల్‌ వేసిన విషయం తెలిసిందే. కళాకారుడు ఎ.త్రినాథ్‌ దీనిపైనే మరో వ్యాజ్యం దాఖలు చేశారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పీవీజీ ఉమేశ్‌చంద్ర, జడ శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. సుబ్బిశెట్టి పాత్రపై అభ్యంతరం ఉందని మొత్తం నాటక ప్రదర్శనను నిలిపివేయడం సరికాదన్నారు. కావాలంటే ఆ పాత్ర పేరు మార్చి అనుమతి ఇవ్వొచ్చన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని