Andhra News: వాలంటీర్లు కాదు.. వైకాపా వేగులు!

నిఘా.. నిఘా... నిఘా... అడుగు తీస్తే నిఘా... అడుగేస్తే నిఘా. అవును... రాష్ట్ర ప్రజలపై నిరంతరం అధికారిక నిఘా కొనసాగుతోంది. జగన్‌ ప్రభుత్వం నియమించిన సుమారు 2.61 లక్షల మంది ‘గూఢచారులు’.... ప్రజల కదలికల్ని నిరంతరం డేగకళ్లతో కనిపెడుతున్నారు.

Updated : 10 Dec 2022 08:21 IST

స్వచ్ఛంద సేవకుల ముసుగులో అధికార పార్టీకి సేవ
వారు చేసేది పూర్తిగా రాజకీయ కార్యకలాపాలే
ప్రజలపై నిరంతరం నిఘా... సమాచారం చేరవేత
సర్వేల పేరుతో ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం
రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకూ విఘాతం  
అధికారం అండతో కొందరు నేర కార్యకలాపాలు
ఈనాడు - అమరావతి

నిఘా.. నిఘా... నిఘా... అడుగు తీస్తే నిఘా... అడుగేస్తే నిఘా. అవును... రాష్ట్ర ప్రజలపై నిరంతరం అధికారిక నిఘా కొనసాగుతోంది. జగన్‌ ప్రభుత్వం నియమించిన సుమారు 2.61 లక్షల మంది ‘గూఢచారులు’.... ప్రజల కదలికల్ని నిరంతరం డేగకళ్లతో కనిపెడుతున్నారు. వారి ఆనుపానుల్ని ఎప్పటికప్పుడు అధికార పార్టీకి చేరవేస్తున్నారు. వాళ్లెవరో కాదు... వాలంటీర్లు..! పేరుకే వాళ్లు ప్రభుత్వం నియమించిన స్వచ్ఛంద సేవకులు. నిజానికి ఆ ముసుగులో పనిచేస్తున్న అధికార పార్టీ వేగులు..! వాళ్లంతా జీతాలుగా ప్రజల సొమ్మును స్వీకరిస్తూ... వారి వివరాల్ని అధికార పార్టీకి అందిస్తున్న అసలు సిసలు వైకాపా కార్యకర్తలు. జగన్‌ ప్రభుత్వం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నాటిన వాలంటీర్‌ వ్యవస్థ... పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా రాష్ట్రం మొత్తం వేళ్లూనుకుంది. వైకాపా కోసం పెంచి పోషిస్తున్న ఈ సమాంతర వ్యవస్థ... ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతోంది. ప్రజాస్వామ్యానికే పెను సవాల్‌గా మారింది. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన... స్వేచ్ఛగా జీవించే హక్కుకి, భావ ప్రకటన స్వేచ్ఛకు పెను విఘాతంగా మారింది. పింఛన్లు వంటి ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు సక్రమంగా అందేలా చూసేందుకే వాలంటీర్లను నియమించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే... వాలంటీర్ల నియామకం వెనుకున్న అసలు ఉద్దేశం వేరే..! వారు సేవ చేస్తోంది ప్రజలకు కాదు... అధికార పార్టీకే. వారు చేస్తోంది పూర్తిగా రాజకీయ కార్యకలాపాలే! ప్రజలపైనా, ప్రతిపక్షాలపైనా నిఘా పెట్టడం, వారి బలాల్ని, బలహీనతల్ని కూపీలాగి అధికార పార్టీకి చేరవేయడమే వారి ప్రధాన విధి.


అధికార పార్టీకి ప్రచారం.. ఓటర్లకు డబ్బు పంపిణీ

ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనరాదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చినా కొన్నిచోట్ల ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను వారే చేపట్టారు. ఎన్నికలు ఏవైనా వాలంటీర్లు వైకాపా అభ్యర్థుల తరపున ప్రచారం నుంచి, ఓటర్లకు డబ్బు పంపిణీ వరకు అన్నీ తామై చక్కబెడుతున్నారు.


వ్యక్తుల రాజకీయ ఆసక్తులపైనా.. ఆరా

ప్రభుత్వం ఇటీవల వాలంటీర్ల ద్వారా ఎంప్లాయిమెంట్‌ సర్వే చేయించింది. వారికి కేటాయించిన కుటుంబాల్లో... ఎందరు అక్షరాస్యులు? వృత్తిరీత్యా ఎక్కడ ఉంటున్నారు? ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్నారా? వారు ఏ రాజకీయ పార్టీ అంటే ఆసక్తి చూపిస్తున్నారనే వివరాలను సేకరించారు. ఎంప్లాయిమెంట్‌ సర్వేలో రాజకీయ ఆసక్తులను తెలుసుకోవాల్సిన అవసరమేంటి?


జగన్‌ మళ్లీ వస్తేనే పథకాలు కొనసాగుతాయని ప్రచారం

పథకాలన్నీ జగనే ఇస్తున్నారని ప్రతి లబ్ధిదారునికి పదేపదే చెబుతున్నారు. మళ్లీ జగన్‌ సీఎం అయితేనే పథకాలన్నీ కొనసాగుతాయని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మళ్లీ వైకాపా అధికారంలోకి రాకుంటే... వచ్చే ప్రభుత్వం ఇళ్ల స్థలాల్ని రద్దు చేస్తుందని లబ్ధిదారుల్ని బెదిరిస్తున్నారు.


అధికార పార్టీ నేతల్లో భయం

హైకోర్టు, ఎన్నికల సంఘం హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల్లో వాలంటీర్లు పార్టీ కోసం పనిచేయలేని పరిస్థితులు ఏర్పడితే.. తమ పాచిక పారదని అధికార పార్టీ నేతలు భయపడుతున్నారు. వాలంటీర్ల అరాచకాలు పెచ్చుమీరడంతో వస్తున్న విమర్శలను కప్పిపుచ్చేందుకు, ఎన్నికల్లో వాడుకోవడానికి కొత్తగా గృహ సారథులను నియమించాలని సీఎం జగన్‌ సిద్ధమయ్యారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని