నిరక్షరాస్యులూ.. పట్టభద్ర ఓటర్లే!

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు వెలుగుచూస్తున్నాయి.

Published : 10 Dec 2022 04:39 IST

3, 5, 10 చదివినవారికీ ఓటు
ఒకే వ్యక్తి పేరు రెండు, మూడుసార్లు
శాసనమండలి పట్టభద్రుల ఓటర్ల జాబితాలో భారీగా అవతవకలు
వాలంటీర్లే సూత్రధారులు
నిమ్మకు నీరెత్తినట్లు ఎన్నికల సంఘం
ఈనాడు - అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు వెలుగుచూస్తున్నాయి. వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు లక్ష్యాలు విధించటంతో.. వాలంటీర్లు చెలరేగిపోయారు. నిరక్షరాస్యులు, 3, 5, 10, ఇంటర్‌ విద్యార్హతలున్నవారినీ పట్టభద్రులేనంటూ దరఖాస్తులు చేసేశారు. ఒకరి పేరుతోనే నాలుగైదు అర్జీలు పెట్టేశారు. ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే వారందరికీ జాబితాలో చోటు కల్పించేసింది. ఫలితంగా ముసాయిదా జాబితాలో పెద్ద సంఖ్యలో బోగస్‌ ఓట్లు బయటపడుతున్నాయి. ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువసార్లు జాబితాలో కనిపిస్తున్నాయి.

విశాఖ జిల్లాలోనే 10 వేల మందికి పైగా

శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం నియోజకవర్గ పరిధిలో ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే డిగ్రీ విద్యార్హత లేని 2,163 మంది అనర్హులను ఓటరుగా నమోదు చేశారని, 8,486 మంది పేర్లు జాబితాలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఉన్నాయంటూ ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తాజాగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కడప- అనంతపురం- కర్నూలు, ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోనూ ఇదే పరిస్థితి. ఈ మూడు నియోజకవర్గాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార వైకాపా తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు గ్రామ, వార్డు వాలంటీర్లకు లక్ష్యాలు విధించి భారీ ఎత్తున ఓటర్లను చేర్పించింది. వాలంటీర్లు గంపగుత్తగా ఎన్ని దరఖాస్తులిచ్చినా సరిగ్గా క్షేత్ర పరిశీలన కూడా చేయకుండానే ఆమోదించేశారని, అందువల్లే ముసాయిదా జాబితాలో పెద్ద ఎత్తున బోగస్‌ ఓటర్లున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

వాలంటీర్లపై ఫిర్యాదులందినా చర్యలేవి?

ఓటరు నమోదు సహా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి పనులూ వాలంటీర్లకు అప్పగించొద్దంటూ ఎన్నికల సంఘం నాలుగైదుసార్లు ఆదేశాలిచ్చింది. కానీ అమలయ్యేలా చూడలేదు. వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలమైన వారి ఓట్లే చేర్పిస్తున్నారని, ప్రతిపక్షాల సానుభూతిపరులు, మద్దతుదారుల దరఖాస్తులను పరిగణనలోకి కూడా తీసుకోనివ్వడం లేదంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులందినా చర్యల్లేవు. ‘వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలి. వైకాపా అభ్యర్థులను గెలిపించి జగనన్న రుణం తీర్చుకోవాలి’ అంటూ స్వయంగా మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలే సమావేశాలు పెట్టి మరీ ప్రకటించినా ఎన్నికల సంఘం వారి నుంచి కనీసం సంజాయిషీ కూడా కోరలేదు. ఇదే అలుసుగా వాలంటీర్లు పెద్ద ఎత్తున బోగస్‌ ఓట్లు చేర్పించారన్న విమర్శలున్నాయి.

ఆన్‌లైన్‌లో ఇష్టారాజ్యంగా..

పట్టభద్రుల ఓటు ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకోవాలంటే దరఖాస్తుతో పాటు విద్యార్హతకు సంబంధించి డిగ్రీ పట్టాను అప్‌లోడ్‌ చేయాలి. చాలా మంది డిగ్రీ పట్టాకు బదులుగా ఏదో ఒక పత్రాన్ని లేదంటే వేరేవారి డిగ్రీ పట్టాను అప్‌లోడ్‌ చేసేశారు. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ధ్రువపత్రాలన్నీ చూసి అర్హులైతేనే ఓటర్లుగా అవకాశం కల్పించాలి. ఆ ప్రక్రియ సరిగ్గా జరగలేదు. చాలా చోట్ల బీఎల్వోలు ఈ పనిని వాలంటీర్లకు వదిలేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఓటు కోసం చివరి రోజున భారీగా వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ శాతం అనర్హులేవనన్న ఆరోపణలున్నాయి.

ఒకే వ్యక్తి పేరు.. ఒకటికి మించి పలుమార్లు

* విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని 220వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రం ఓటర్ల జాబితాలోని సీరియల్‌ నంబర్‌ 125, 126, 127లలో ‘హారిక వెన్నెల’ అనే ఒకటే పేరు ఉంది. విద్యార్హత ఇంటర్మీడియటే.

* వైయస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరు 52వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలోని గొర్లె కిషోర్‌ (తండ్రి పేరు ఓబులేశు గొర్లె), ఖాదర్‌ మొహియుద్దీన్‌ షేక్‌,  వెంకటరమణమ్మ బబ్బూరి, అట్లా బాల ఓబులేసు, చింతా అనిల్‌కుమార్‌రెడ్డి పేర్లు రెండేసిసార్లు ఉన్నాయి.  

* ముసాయిదా జాబితాలో ఇలాంటి ఉదంతాలు వేల సంఖ్యలో ఉన్నాయి.


నిరక్షరాస్యులకూ ఓటు.. నిదర్శనాలివే

* విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడలోని 205వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రం ఓటర్ల జాబితాలో 705 వరుస సంఖ్యలో ఉన్న రాజారావు ముంజేటి, కణితిలోని 210వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో వరుస సంఖ్య 744లో ఉన్న చిత్రాడ మోహన్‌ నిరక్షరాస్యులు.

* రేగిడి ఆమదాలవలస మండలం ఉంగరాడమెట్టలోని 26వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రం ఓటర్ల జాబితాలో శాంతకుమార్‌ పెద్ద అనే పేరుంది. విద్యార్హత 5వ తరగతి.

* సంతకవిటి మండలంలోని 38వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రం ఓటర్ల జాబితా వరుస సంఖ్య 300లో సుధీర్‌ ఇల్లిపిల్లి అనే పేరుంది. విద్యార్హత 3వ తరగతి.

* వైయస్‌ఆర్‌ జిల్లా కలసపాడులోని 1వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రం ఓటర్ల జాబితా సీరియల్‌ నంబర్‌ 66లో ఉన్న బొమ్ము పెద్ద వీరయ్య విద్యార్హత పదో తరగతి.


అనర్హులను చేర్పించారు

వాలంటీర్లను ఉపయోగించుకుని వైకాపా అనర్హులను కూడా పెద్ద ఎత్తున పట్టభద్ర ఓటర్లుగా చేర్పించింది. విశాఖపట్నం జిల్లా జాబితాలోనే 11 వేల మందికి పైగా అనర్హులు ఉన్నట్లు మా పరిశీలనలో తేలింది. ఎన్నికల సంఘం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పర్యవేక్షణలో ఈ జాబితాలపై సమగ్ర విచారణ జరిపించాలి.

అజశర్మ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక


వాలంటీర్లతో చేయించిన దరఖాస్తుల్లో ఎక్కువ నకిలీవే

వాలంటీర్ల ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ శాతం నకిలీవే. ఒకే వ్యక్తి పేరుతో వేర్వేరు మండలాల్లోనూ దరఖాస్తు చేయించారు. చివరి నిమిషంలో పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను సరిగ్గా పరిశీలించకుండానే ఆమోదించారు. వీటిపై సమగ్ర విచారణ జరపాలి.

విఠపు బాలసుబ్రమణ్యం, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని