కళాశాల విద్య.. అక్రమాల అడ్డా..!

కళాశాల విద్యాశాఖలో పదోన్నతులు, పోస్టుల సృష్టి, బదిలీలు, మామూళ్ల వసూళ్లపైనే దృష్టి సారిస్తున్నారే తప్ప విద్యార్థుల ప్రవేశాలపై దృష్టిపెట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Published : 10 Dec 2022 05:33 IST

కమిషనరేట్‌లో మామూళ్లకు హడలిపోతున్న అధ్యాపకులు
ఆర్జేడీ పోస్టులను విభజించి నియామకం
పని భారమంటూ కొత్త ఎత్తుగడ

ఈనాడు, అమరావతి: కళాశాల విద్యాశాఖలో పదోన్నతులు, పోస్టుల సృష్టి, బదిలీలు, మామూళ్ల వసూళ్లపైనే దృష్టి సారిస్తున్నారే తప్ప విద్యార్థుల ప్రవేశాలపై దృష్టిపెట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కమిషనరేట్‌లోని ఇద్దరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ దస్త్రం కదలాలన్నా ఎంతో కొంత ఇచ్చుకుంటే తప్ప ముందుకు కదలని దుస్థితి నెలకొంది. ఈ ఇద్దరు అధికారులూ కార్యాలయంలోనే నేరుగా ప్రతి పనికీ ధరలు నిర్ణయిస్తూ.. ఈ మొత్తాలను వారి ఇంటి వద్ద ఇవ్వాలని సూచిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వసూళ్లలో పైస్థాయి వరకు అందరికీ వాటాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కమిషనరేట్‌లోని ఈ అధికారి తన వెనుక ఉన్నారంటూ శ్రీకాకుళంలోని ఓ ప్రిన్సిపల్‌ కింది స్థాయి సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారి ఆ తర్వాత నివేదికను మూలకు పడేశారు. ఇటీవల ఎయిడెడ్‌ అధ్యాపకులకు పోస్టింగ్‌లు, వారిని మళ్లీ సొంత జోన్‌లోకి మార్పు చేసేందుకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకూ వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అధ్యాపకుల జోనల్‌ బదిలీలకు దస్త్రం పంపాలంటే రూ.లక్షన్నర వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. హెచ్‌ఆర్‌ఏ ఎక్కువగా ఉండే నగరాలకు డిప్యుటేషన్‌, బదిలీ చేయాలంటే రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వింత ఆర్జేడీ వ్యవస్థ..: కళాశాల విద్యలో కడప, గుంటూరు, రాజమహేంద్రవరం ప్రాంతీయ సంయుక్త సంచాలకుల పోస్టులు ఉండగా.. ఇప్పుడు పని భారం పేరుతో కొత్తగా మరో రెండు పోస్టులను కమిషనరేట్‌ స్థాయిలోనే సృష్టించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇన్‌ఛార్జులను నియమించారు. ప్రస్తుతం కడప ఆర్జేడీగా ఉన్న నాగలింగారెడ్డిని ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలకు, వాయల్పాడు ప్రిన్సిపల్‌ బాబును ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలకు కొత్త ఆర్జేడీగా నియమించారు. కమిషనరేట్‌లో ప్రస్తుతం జేడీగా ఉన్న డేవిడ్‌ కుమార్‌ స్వామిని ఉమ్మడి కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలకు ఇన్‌ఛార్జి ఆర్జేడీగా నియమించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఆర్జేడీ పోస్టును సృష్టించి రావులపాలెం కళాశాల ప్రిన్సిపల్‌ కృష్ణను ఇన్‌ఛార్జిగా నియమించారు. ఈయన రావులపాలెం ప్రిన్సిపల్‌తోపాటు రాజమహేంద్రవరం కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌, ఆర్జేడీగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

శ్రీ రాష్ట్రంలో మూడు ఆర్జేడీ, కమిషనరేట్‌లలోని జేడీ పోస్టులు ఖాళీగా ఉండగా.. ఒక్క పోస్టు భర్తీకే పదోన్నతి కల్పించారు. విభాగ పదోన్నతుల కమిటీ(డీపీసీ) ఏర్పాటు చేయకుండానే డేవిడ్‌ కుమార్‌ స్వామి (ఒక్క) పేరునే నేరుగా ప్రతిపాదించారు. ఇప్పుడు మూడు ఆర్జేడీ పోస్టుల భర్తీకి పదోన్నతులు కల్పించేందుకు వివరాలు సేకరిస్తున్నారు. ఈ పదోన్నతులకు భారీగా మామూళ్లు డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అధ్యాపకులకు పదోన్నతులు కల్పించే కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌(సీఏఎస్‌) అమలుకు ఇంక్రిమెంట్ల ఆధారంగా రేటు నిర్ణయిస్తున్నట్లు అధ్యాపకులు చెబుతున్నారు.

విద్యార్థుల ప్రవేశాలపై దృష్టి ఏదీ?

విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా పడిపోయాయి. మొదట్లో ప్రవేశాలపై దృష్టిపెట్టకుండా ఇప్పుడు 15శాతంలోపు ప్రవేశాలున్న కోర్సులను మూసివేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 254 కోర్సులను మూసివేయాలని నిర్ణయించారు. ఒక పక్క డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండగా.. మరోపక్క పని భారాన్ని తగ్గించేందుకు అంటూ ప్రిన్సిపాళ్లను అనధికారికంగా ఆర్జేడీలుగా నియమించేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని