Cyclone Mandous: తుపాను బీభత్సం

మాండౌస్‌ తుపాను రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తీవ్రమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురిసింది. వైయస్‌ఆర్‌ జిల్లాలో వర్షాలకు గోడ కూలి ఒక మహిళ మృతిచెందారు. జలాశయాలన్నీ పూర్తిస్థాయిలో నిండి, పొంగి పొర్లాయి.

Updated : 11 Dec 2022 06:48 IST

మాండౌస్‌ ప్రభావంతో పలు జిల్లాల్లో గాలులు.. వానలు
ఉద్ధృతంగా పొంగిన వాగులు.. వంకలు
నీట మునిగిన పొలాలు.. నేలకూలిన వృక్షాలు
వైయస్‌ఆర్‌ జిల్లాలో గోడ కూలి మహిళ మృతి
రాకపోకలకు తీవ్రంగా అంతరాయం
ఈనాడు, ఈనాడు డిజిటల్‌, న్యూస్‌టుడే యంత్రాంగం

మాండౌస్‌ తుపాను రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తీవ్రమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురిసింది. వైయస్‌ఆర్‌ జిల్లాలో వర్షాలకు గోడ కూలి ఒక మహిళ మృతిచెందారు. జలాశయాలన్నీ పూర్తిస్థాయిలో నిండి, పొంగి పొర్లాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. చాలా జిల్లాల్లో రహదారులపై నీళ్లు ప్రవహించడంతో శనివారం రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రభావిత జిల్లాల్లో ప్రధాన రహదారులు చెరువుల్లా మారాయి. పంటనష్టాల సంగతి చెప్పనక్కర్లేదు. ప్రధానంగా వరితో పాటు ఉద్యానపంటలూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. తిరుపతి, చిత్తూరు, వైయస్‌ఆర్‌, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తూర్పుగోదావరి, కాకినాడ తదితర జిల్లాలపై ఎక్కువ ప్రభావం కనిపించింది. తిరుపతి జిల్లాపై మాండౌస్‌ తుపాను ఎక్కువ ప్రభావం చూపించింది. అనేక ప్రాంతాల్లో రహదారులు, కల్వర్టులు, కాజ్‌వేలు నీటమునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు విరిగి విద్యుత్తు లైన్లు, స్తంభాలపై పడ్డాయి. శనివారం ఉదయం తర్వాత వర్షం కొంతమేరకు తెరిపి ఇచ్చింది. శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు ప్రాంతాల్లోని వరి నీటమునిగింది. కేబీపురం మండలంలోని కాళంగి జలాశయానికి భారీగా నీరు చేరడంతో పది గేట్లు ఎత్తి 16,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఆరు గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పుడిసికేపురం-ఎంఏ రాజులకండ్రిగ మధ్య కాజ్‌వే కొట్టుకుపోయింది. రేణిగుంట మండలం మల్లెమడుగు జలాశయం 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీకాళహస్తి-తడ మార్గంలో సున్నపుకాల్వపై బస్సు ఇరుక్కుపోగా, ప్రయాణికులను పోలీసులు సురక్షితంగా కిందకు దించారు. వాతావరణం అనుకూలించక హైదరాబాద్‌-రేణిగుంట-విశాఖ ఇండిగో విమానాన్ని రద్దుచేశారు. కొన్నిచోట్ల చెరువులకు గండ్లు పడటంతో అధికారయంత్రాంగం వెంటనే వాటిని పూడ్చేసింది.

భక్తులపైనా ప్రభావం..

వర్షం కారణంగా తిరుమల శ్రీవారి భక్తులు ఇబ్బందిపడ్డారు. మొదటి ఘాట్‌రోడ్డులోని మలుపువద్ద వృక్షాలు కూలడంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడింది. కొండపై చెట్టు కూలి, పారిశుద్ధ్య కార్మికురాలికి స్వల్ప గాయాలయ్యాయి. మధ్యాహ్నం వరకు శ్రీవారి మెట్టుమార్గం వైపునుంచి భక్తులను అనుమతించలేదు.

కూలిన ఇళ్లు.. తడిసిన ధాన్యం

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో భారీ కెరటాలు ఎగసిపడి తీరప్రాంత గ్రామాలపైకి వచ్చాయి. ఇళ్లు నేలకూలి.. మత్స్యకారులు పరుగులు తీశారు. ఉప్పాడ, సూరాడపేట, మాయాపట్నం, కోనపాపపేట గ్రామాలపై కెరటాల ప్రభావం ఎక్కువగా పడింది. ఇళ్లు నేలకూలి సముద్రగర్భంలో కలిసిపోయాయి. బీచ్‌రోడ్డు దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. దీనికి ఇటీవలే రూ.50లక్షలు వెచ్చించి మరమ్మతులు చేపట్టారు. కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిచిపోయింది.

సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు

సముద్రంలో వేటకు వెళ్లిన బాపట్ల జిల్లా చీరాల వాడరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. శనివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం తీరానికి రెండు కి.మీ. దూరంలో వారిని గుర్తించిన అధికారులు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు ఆరురోజుల క్రితం వేటకు వెళ్లారు. తుపాను ప్రభావంతో సిగ్నళ్లు లేక దారితెలియక గల్లంతయ్యారు. సిగ్నల్‌ రాగానే మెరైన్‌ పోలీసులకు చెప్పడంతో.. సహాయక చర్యలు మొదలుపెట్టారు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఒడ్డుకు చేర్చడం వీలుకాలేదు.

నీటమునిగిన పంటలు

నెల్లూరు నగరంతో పాటు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 13 వేల ఎకరాల్లో వరినాట్లు, పత్తి, వేరుశనగ, మినుము పంటలు నీటమునిగాయి. బొప్పాయి, అరటి, మిరప పొలాల్లోకి నీరు చేరింది. నెల్లూరు నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపైనా నీరు నిలిచి.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


గోడకూలి మహిళ మృతి

వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట మండలం దర్జిపల్లిలో వర్షానికి ఓ ఇంటిగోడ కూలిపోవడంతో ఓ మహిళ మృతిచెందారు. దవంతరంపల్లికి చెందిన కొమ్ము పద్మావతి (42), తన భర్త చిన్ననాగయ్యతో కలిసి శుక్రవారం దర్జిపల్లిలోని తల్లి శంకరమ్మ ఇంటికి వెళ్లారు. శనివారం మధ్యాహ్నం వంట చేస్తుండగా గోడ కూలిపోయింది. పద్మావతిపై గోడ రాళ్లు పడి.. ఆమె అక్కడికక్కడే మృతిచెందారు.


నాయుడుపేటలో 28.1 సెం.మీ. వర్షం

ఈనాడు, అమరావతి, విశాఖపట్నం: ఆరు జిల్లాల్లోని 32 మండలాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంది. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, వైయస్‌ఆర్‌, ప్రకాశం జిల్లాల్లో రెండురోజులుగా భారీ నుంచి అత్యంత భారీవర్షాలు కురిశాయి. రాయలసీమలోని శ్రీసత్యసాయి జిల్లాతోపాటు మిగిలిన జిల్లాల్లోనూ శనివారం వానలు కురిశాయి. శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 మధ్య రాష్ట్రంలోనే అత్యధికంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలో 281 మి.మీ., బాలాయపల్లి మండలం హస్తకావేరిలో 241.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లా పరిధిలో 30 గ్రామాలపై వర్షప్రభావం ఉండగా.. 3 పట్టణాలు, 10 గ్రామాలు ముంపుబారిన పడ్డాయని అధికారులు తెలిపారు. 160 ఇళ్లు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

* శనివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8గంటల వరకు అత్యధికంగా పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడులో 133 మి.మీ., ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బల్లిపల్లిలో 119.5, పీసీపల్లి మండలం పెద్ద అలవాలపాడులో 116 మి.మీ. వర్షపాతం నమోదైంది. 266 మండలాల్లో సగటున 10 మి.మీ. పైబడి వర్షం కురిసింది.

కోస్తాలో వీడని ముసురు

శనివారం ఉదయం నుంచి కోస్తావ్యాప్తంగా ముసురుపట్టింది. సాయంత్రం నుంచి చిరుజల్లులు మొదలయ్యాయి. కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిశాయి.

అల్పపీడనంగా బలహీనం.. నేడూ వర్షాలు

మాండౌస్‌ తుపాను తీవ్ర వాయుగుండంగా... తర్వాత వాయుగుండంగా మారి శనివారం సాయంత్రానికి అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురుస్తాయి. రాయలసీమలో అనేక చోట్ల తేలికపాటి వర్షాలు భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల ఉండొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

708 మందిని ఖాళీ చేయించాం

లోతట్టుప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీచేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 33 సహాయశిబిరాలను ఏర్పాటుచేశామని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సాయిప్రసాద్‌ తెలిపారు. విపత్తుసంస్థ కార్యాలయంలో ఎండీ అంబేడ్కర్‌తో కలిసి ఆయన తుపాను సహాయచర్యలను సమీక్షించారు. ప్రకాశం, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 8 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.


తమిళనాడులో భారీ వర్షాలు.. నలుగురి మృతి

ఈనాడు, చెన్నై: మాండౌస్‌ తుపాను తమిళనాడులోని పలు జిల్లాల్లో తీవ్రప్రభావం చూపుతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలో తీరాన్ని తాకింది. శనివారం వేకువజామున గాలులు 65- 85కి.మీ. వేగంతో వీచాయని తమిళనాడు వాతావరణ విభాగం వెల్లడించింది. మామల్లాపురంలో చెట్లు నేలకూలాయి. చెన్నైలో 350పైగా భారీ వృక్షాలు నేలకూలి, కార్లు ధ్వంసమయ్యాయి. చెన్నైలో 30వేల మంది సిబ్బంది సహాయకచర్యల్లో నిమగ్నమయ్యారు. 10వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. శనివారం ఉదయం పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. కాశిమేడు ఫిషింగ్‌ హార్బర్‌లో పలు కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ఆ ప్రాంతంలో నష్టాన్ని పరిశీలించారు. మడిప్పాక్కంలో వర్షాలకు గుడిసె కూలడంతో లక్ష్మి (45), ఆమె అన్న కుమారుడు (25) మృతిచెందారు. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరు సమీపంలో పిళ్లైపాక్కంలో తుపాను ప్రభావంతో శుక్రవారం రాత్రి విద్యుత్తు తీగలు తెగి కిందపడ్డాయి. గమనించకుండా వాటిని తాకడంతో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు మరణించారు.


సహాయ చర్యలు చేపట్టండి
కలెక్టర్లకు ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశం

భారీవర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది రాకుండా సహాయచర్యలు అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. శనివారం ఆయన తుపాను ప్రభావంపై అధికారులతో సమీక్షించారు. ప్రభావితప్రాంతాల్లో పరిస్థితులపై అక్కడి అధికారులతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, సీఎంఓ ప్రత్యేక ప్రధానకార్యదర్శి పూనం మాలకొండయ్య శనివారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కలెక్టర్లు రెండురోజుల పాటు గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. తిరుపతిలో వరదనీరు త్వరితగతిన దిగువకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


తుపాను బాధితులను ఆదుకోవాలి: చంద్రబాబు

మాండౌస్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలిచి, అవసరమైన మేర సహాయ సహకారాలు అందించాలని తెదేపా శ్రేణులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అవసరం మేరకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ‘‘విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.  రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులకు సాయం చేయాలి. తడిచిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. మత్స్యకారుల్ని అప్రమత్తం చేయాలి...’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


సలే పల్లెవెలుగు బస్సు. కుయ్యో.. మొర్రోమంటూ వెళ్తున్న అది కాస్తా ఇలా కూరుకుపోయింది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలోని తాత్కాలిక ఆర్టీసీ బస్టాండులో పరిస్థితి ఇదీ!

 ఈనాడు డిజిటల్‌, కడప

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని