Rushikonda: రుషికొండను చూస్తే కన్నీళ్లొస్తున్నాయి

‘విశాఖలో రుషికొండ మీద జరిగిన విధ్వంసాన్ని చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి.. కొండ చుట్టూ తవ్వేసిన తీరు చాలా బాధ కలిగిస్తోంది’ అని రాష్ట్రీయ జల బిరాదరీ (ఆర్‌జేబీ) ఛైర్మన్‌, రామన్‌ మెగసెసె పురస్కార గ్రహీత, వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 12 Dec 2022 08:30 IST

ఈ ప్రభుత్వం చేస్తున్నది క్షమించరాని నేరం
జగన్‌ హయాంలో పర్వతాలూ కనుమరుగు
జాతీయ జల బిరాదరీ ఛైర్మన్‌ రాజేంద్రసింగ్‌

ఈనాడు, విశాఖపట్నం, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం): ‘విశాఖలో రుషికొండ మీద జరిగిన విధ్వంసాన్ని చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి.. కొండ చుట్టూ తవ్వేసిన తీరు చాలా బాధ కలిగిస్తోంది’ అని రాష్ట్రీయ జల బిరాదరీ (ఆర్‌జేబీ) ఛైర్మన్‌, రామన్‌ మెగసెసె పురస్కార గ్రహీత, వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆర్‌జేబీ జాతీయ కన్వీనర్‌, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణతో కలిసి
ఆయన రుషికొండను వేంకటేశ్వరస్వామి కొండ మీద నుంచి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సముద్రం ఒడ్డున ఉన్న రుషికొండను అసలు ఎలా ధ్వంసం చేయాలనిపించిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఇక్కడ సముద్రం తల్లిలాంటిదైతే ఈ రుషికొండ పాలిచ్చే వక్షోజం. అక్కడ జరిగిన తవ్వకాలను చూస్తే తల్లి వక్షోజాలను కోసేసినట్లు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ ప్రభుత్వం చేస్తున్నది క్షమించరాని నేరం. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నదిలో ఇల్లు నిర్మించుకుంటున్నారని మేం ప్రశ్నించినపుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శభాష్‌ అన్నారు. ఇప్పుడు అదే వ్యక్తి ఎందుకు ఇలా చేయిస్తున్నారు? ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తగిన న్యాయం జరుగుతుందని భావిస్తున్నా’ అని అన్నారు.

నదుల పరిరక్షణకు రాజకీయాలకతీతంగా పోరాడాలి

రాష్ట్రంలో జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కంటే ఘోరంగా నదులు కలుషితమవడంతో పాటు కొండలు, పర్వతాలు కనుమరుగవుతున్నాయని రాజేంద్రసింగ్‌ ఆరోపించారు. దేశంలో నదుల పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నది కాలుష్యంపై గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టి.కె.విశ్వేశ్వరెడ్డి చేపడుతున్న ఉద్యమానికి మద్దతుగా ఆదివారం ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాగు నీటి కోసం, నదుల పరిరక్షణ కోసం 50 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా ఏ రాజకీయ పార్టీ మద్దతివ్వలేదన్నారు. రాజకీయ నేతలు అధికారంలో లేనప్పుడు ఒకలా, వచ్చాక మరోలా మాట్లాడతారని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా ఇక్కడి గోదావరి నదిని రక్షించుకునేందుకు పోరాడితే సహకరిస్తానని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. సభలో పర్యావరణవేత్త, జల బిరాదరీ జాతీయ కన్వీనర్‌ బొలిశెట్టి సత్యనారాయణ, ఓఎన్జీసీ విశ్రాంత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డీఎంఆర్‌ శేఖర్‌, సిటిజన్స్‌ ఫోరం, గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని