Andhra News: ‘ఏపీలో ఉద్యోగుల పరిస్థితి దయనీయం’

తమ రాష్ట్రంలో కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని తెలంగాణ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

Updated : 12 Dec 2022 07:11 IST

తెలంగాణ ప్రజారోగ్య   వైద్య ఉద్యోగుల సంఘం నేత వెంకటేశ్వరరెడ్డి

విజయవాడ, న్యూస్‌టుడే: తమ రాష్ట్రంలో కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని తెలంగాణ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం సర్వజన మహాసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఉద్యోగుల పట్ల మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఉన్న గౌరవం ఏపీలో లేదన్నారు. పారామెడికల్‌, కాంట్రాక్టు సిబ్బంది ఉద్యోగాల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. జీవో 16 ద్వారా పదివేల మంది ఉద్యోగాలను త్వరలో క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఏపీలో ఆ ఆలోచన కూడా చేయకపోవడం బాధాకరమన్నారు. ఏపీ ఉద్యోగుల పోరాటానికి తాము సంఘీభావం తెలుపుతామన్నారు. ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షులు జి.సంజీవరెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి సమైక్య పోరాటమే మార్గమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొరుగు సేవల పేరుతో ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్నాయన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్‌.సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఆస్కార్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక జీవోలతో ఉద్యోగుల భవిష్యత్తు అంధకారమవుతోందన్నారు.  అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. సంక్రాంతి తరువాత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా జి.ఆస్కార్‌రావు, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.కె.బాబాసాహేబ్‌తోపాటు 37 మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని