Andhra News: 12వ తేదీ.. అయినా జీతాల్లేవ్‌

ప్రభుత్వ ఉద్యోగి అంటే ఠంచనుగా ఒకటో తేదీన జీతం.. ఏదైనా డబ్బులు అవసరం పడితే జీపీఎఫ్‌, పీఎఫ్‌ నుంచి అడ్వాన్సులు, రుణాలు వెంటనే తీసుకునే సదుపాయం.. అవసరానికి ఆర్జిత సెలవుల డబ్బులు.. ఎప్పటికప్పుడు డీఏలు, పీఆర్సీలతో పెరిగే జీతం.. ఇదంతా ఒకప్పుడు.

Updated : 13 Dec 2022 10:12 IST

ఇంకెన్నాళ్లో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఎదురుచూపులు
ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆందోళన  
నిరసన తెలిపితే నోటీసులు.. ధర్నాలు చేస్తే కేసులతో వేధిస్తున్న ప్రభుత్వం
ఈనాడు - అమరావతి

ప్రభుత్వ ఉద్యోగి అంటే ఠంచనుగా ఒకటో తేదీన జీతం.. ఏదైనా డబ్బులు అవసరం పడితే జీపీఎఫ్‌, పీఎఫ్‌ నుంచి అడ్వాన్సులు, రుణాలు వెంటనే తీసుకునే సదుపాయం.. అవసరానికి ఆర్జిత సెలవుల డబ్బులు.. ఎప్పటికప్పుడు డీఏలు, పీఆర్సీలతో పెరిగే జీతం.. ఇదంతా ఒకప్పుడు.


ఎన్నికల ముందు..
ఉద్యోగిలో చిరునవ్వు ఉండాలి..

‘ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగి ముఖంలో ఎప్పుడైతే చిరునవ్వు కనిపిస్తుందో అప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాడు. పేదవాడికి మంచి చేయడానికి ఆరాటపడే పరిస్థితి వస్తుంది. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రావాల్సినవన్నీ కూడా సరిగ్గా సమయానికి వచ్చేటట్టుగా.. ప్రతి డీఏ సమయానికి వచ్చేటట్టు చేస్తానని ప్రతి ఉద్యోగికి హామీ ఇస్తున్నా.

ప్రతిపక్ష నేతగా జగన్‌


అధికారంలోకి వచ్చాక..
ఉద్యోగ సంఘాలకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలి

ఉద్యోగ సంఘాలు నేరుగా దండోపాయానికి దిగుతూ ధర్నాలు, రాస్తారోకోలు చేయడం తగదు. ఏ సమస్యనైనా కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలి. అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలి.

 మంత్రి బొత్స


బటన్‌ నొక్కుడుతో పోల్చుకోవద్దు..

సంక్షేమ పథకాలకు బటన్‌ నొక్కుతున్న సీఎం జగన్‌ తమకూ ఒక బటన్‌ నొక్కాలంటూ ఉద్యోగులు పోల్చుకోవడం సరికాదు. ఉద్యోగ సంఘాల నాయకుల్లో ఇలాంటి ఆలోచన ఉంటే తీసేయాలి. సంక్షేమ పథకాలకు రూ.వేల కోట్లు పోతోంది..

సజ్జల


వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పటికీ చాలా జిల్లాల్లో ఉపాధ్యాయులు, లెక్చరర్లకు నవంబరు నెల జీతం అందలేదు. ఆర్థిక అవసరాలకు డబ్బులు ఇవ్వాలంటూ చేసుకున్న దరఖాస్తులకు మోక్షం ఎప్పుడో తెలియదు. డీఏ బకాయిలు ఇవ్వకుండానే ఆదాయపు పన్ను మినహాయించేస్తున్న వింత పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులకు రావల్సివన్నీ సకాలంలో అందిస్తామని ప్రతిపక్షనేతగా సెలవిచ్చిన జగన్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పింఛనర్లు ప్రతి నెలా జీతం కోసం కూడా ఆందోళన పడే పరిస్థితి తెచ్చారు. గతంలో తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చేసేవి. ఇప్పుడు జీతాల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ప్రతి నెలా మొదట తారీఖున జీతాలు అందుకొని ఎన్ని నెలలవుతోందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. పాలు పోసే వ్యక్తి నుంచి కిరాణా కొట్టులో బాకీ వరకు ప్రతి ఖర్చుకూ ఎలా సర్దుబాటు చేయాలో తెలియక ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన పడుతున్నారు. ఒకటో తేదీ జీతం వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది రుణవాయిదాలను ప్రతి నెలా 10వ తేదీలోపే పెట్టుకున్నారు. దాదాపు సగం నెల గడిచే వరకు జీతాలు రాకపోవడంతో వాయిదాలకు వడ్డీ కింద ప్రతి నెలా రూ.600 నుంచి రూ.1,500 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. పింఛనర్లు మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల మందులు కొనుక్కునేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది.

ఆందోళన చేస్తే వేధింపులు

ఒకటో తేదీన జీతం ఇవ్వాలని ఆందోళన చేస్తే ఉపాధ్యాయులకు నోటీసులు ఇస్తున్నారు. అక్టోబరు నెల జీతాలు రాలేదని నవంబరులో విజయనగరం జిల్లాకు చెందిన కొందరు ఉపాధ్యాయులు నిరసనలు తెలిపారు. వెంటనే ఆర్జేడీ, డీఈవో, డిప్యూటీ డీఈవోలు ఉపాధ్యాయులపై వేధింపులకు దిగారు. జీతం ఆలస్యమైతే కొంపలు మునిగిపోతాయా అని ప్రశ్నించడంతోపాటు ఉపాధ్యాయుల నుంచి వివరణ తీసుకున్నారు. ఇటీవల ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్‌), రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ)లు వేతనాలు, ఇతర సమస్యలపై ఆందోళనలు నిర్వహించాయి. ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్‌) కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. యూటీఎఫ్‌ రాష్ట్ర స్థాయి ధర్నాకు దిగితే అనుమతి ఇవ్వకుండా ఎక్కడిక్కడ అరెస్టులు చేశారు. ఆందోళన, నిరసన, ధర్నా దేనికి పిలుపునిచ్చినా పోలీసుల మోహరింపు, ఉద్యోగులపై కేసులు సాధారణమైపోయాయి. జీతాల కోసం ఆందోళనలు చేయడం ఎప్పుడూ చూడలేదని సీనియర్‌ ఉద్యోగులు పేర్కొంటున్నారు.


జీతాలు రాకపోవడం ఆందోళనకరం

చాలా మంది ఉపాధ్యాయులకు ఇప్పటికీ జీతాలు పడకపోవడం ఆందోళనకరం. ఆర్థికంగా రాష్ట్రానికి ఏ విధంగా ఇబ్బంది లేదంటూనే.. జీతాలు ఆపడం ఎంతవరకు సమంజసం? ఒకటో తేదీన జీతాలు చెల్లించకపోతే డీటీఏ కార్యాలయాలను ముట్టడిస్తాం.

లంకలపల్లి సాయి శ్రీనివాస్‌, అధ్యక్షుడు, రాష్ట్రోపాధ్యాయ సంఘం


పోరాడి సాధించుకోవాల్సి వస్తోంది

నెల రోజులు పని చేయించుకుని ఒకటో తేదీన జీతం ఇవ్వడం యాజమాన్య బాధ్యత. 12వ తేదీ వచ్చినా జీతాలు చెల్లించకపోవడం అత్యంత దారుణమైన విషయం. పోరాటంతో జీతం సాధించుకోవడం ఎలాంటి ప్రజాస్వామ్యం?

 వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు, యూటీఎఫ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని