Vizag Airport: ‘భోగాపురం’ ప్రారంభమైతే ‘వైజాగ్‌’లో 30 ఏళ్లపాటు పౌరవిమానాలు బంద్‌: వీకే సింగ్‌

భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే ఇప్పుడున్న వైజాగ్‌ నావల్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో 30 ఏళ్లపాటు పౌరవిమానయాన సేవలు బంద్‌ అవుతాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి జనరల్‌ వీకే సింగ్‌ తెలిపారు.

Updated : 16 Dec 2022 07:57 IST

ఈనాడు, దిల్లీ: భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే ఇప్పుడున్న వైజాగ్‌ నావల్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో 30 ఏళ్లపాటు పౌరవిమానయాన సేవలు బంద్‌ అవుతాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి జనరల్‌ వీకే సింగ్‌ తెలిపారు. గురువారం లోక్‌సభలో ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

‘‘భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2016 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి స్థల అనుమతి ఇచ్చింది. ఒకసారి ఈ విమానాశ్రయ సేవలు ప్రారంభమైతే ఇప్పుడున్న నావల్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో షెడ్యూల్డ్‌ వాణిజ్య కార్యకలాపాలు 30 ఏళ్లపాటు నిలిపేస్తారన్న షరతుతో ఆ అనుమతులు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ విమానాశ్రయాన్ని పీపీపీ విధానంలో చేపడుతోంది. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం, ప్రాజెక్టు నిర్మాణదారు మధ్య 2020 జూన్‌ 12న రాయితీ ఒప్పందం కుదిరింది.

అలాగే ప్రస్తుతం వైజాగ్‌ విమానాశ్రయంలో ఉన్న సివిల్‌ ఎన్‌క్లేవ్‌కి  చెందిన భూమిని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా పేరు మీద మార్చి అప్పగించేలా గత సెప్టెంబరులో ఏఏఐ, ఏపీ ప్రభుత్వం మధ్య పరస్పర అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలోని నిబంధనలకు లోబడి ప్రస్తుత వైజాగ్‌ నావల్‌ ఎయిర్‌ఫీల్డ్‌ (ఐఎన్‌ఎస్‌డేగ)లో 30 ఏళ్లపాటు షెడ్యూల్డ్‌ వాణిజ్య కార్యకలాపాలు నిలిపేయడానికి పౌరవిమానయానశాఖ సెప్టెంబరులో ఏపీ ప్రభుత్వానికి ఎన్‌ఓసీ జారీచేసింది’’ అని జనరల్‌ వీకేసింగ్‌ వివరించారు.

మూడేళ్లలో 13% ఇళ్లే పూర్తి

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణం) కింద ఏపీకి 2019-20 నుంచి 2021-22 మధ్య మూడేళ్లలో 14,47,407 ఇళ్లు మంజూరుచేస్తే 1,88,764 (13.04%) మాత్రమే పూర్తయినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. మొత్తం కేటాయింపుల్లో 10,36,544 (71%)ఇళ్ల నిర్మాణం మాత్రమే ప్రారంభమైనట్లు వెల్లడించారు. గురువారం లోక్‌సభలో రాహుల్‌ కస్వాన్‌ అనే సభ్యుడి ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని