Andhra News: సర్వం అమూల్‌‘పాలు’

సహకార డెయిరీలను పునరుద్ధరించి చూపిస్తానని, లీటరుకు రూ.4 చొప్పున బోనస్‌ ఇస్తామని ఎన్నికల ముందు శపథం చేసిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక దానికి చాపచుట్టేసి అమూల్‌ జపం చేస్తున్నారు.

Updated : 20 Dec 2022 06:41 IST

99 ఏళ్లు లీజుకివ్వడమే పునరుద్ధరణా?

డెయిరీలకు రూ. 3,000 కోట్ల విలువైన ఆస్తులు

నామమాత్రపు ధరతో అమూల్‌కు అప్పగింత  

లీటరుకు రూ. 4 బోనస్‌ హామీకి మొండిచేయి

మూడున్నరేళ్లకు రూ. 1,108 కోట్లు ఇవ్వాలి

హామీలపై మడమ తిప్పిన ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు - అమరావతి


అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాదిలో సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. రెండో ఏడాది నుంచి సహకార డెయిరీలకు పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు రూ.4 చొప్పున రాయితీ ఇస్తాం.

2019 మార్చి 24న ప్రస్తుత బాపట్ల జిల్లా రేపల్లెలో జగన్‌మోహన్‌రెడ్డి


చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తాం. ఆ డెయిరీకి పాలు పోసిన ప్రతి రైతుకు లీటరుకు రూ.4 చొప్పున బోనస్‌గా ఇస్తామని చెబుతున్నా..  

2018 జనవరి 3న ప్రస్తుత అన్నమయ్య జిల్లా పీలేరులో జగన్‌మోహన్‌రెడ్డి


డెయిరీలను పునరుద్ధరించడమంటే వందల కోట్ల విలువైన ఆస్తుల్ని 99 ఏళ్ల లీజుకు అప్పనంగా కట్టబెట్టడమా? నడుస్తున్న ఒంగోలు డెయిరీని కావాలనే మూయించేయడమా? 99 ఏళ్ల లీజు అంటే హక్కుల్ని పూర్తిగా వదులుకున్నట్లు కాదా?

పాడి రైతులందరికీ లీటరుకు రూ.4 బోనస్‌ అనే ఊసే లేదు. అమూల్‌ ద్వారా లీటరుకు రూ.10 వరకు ఎక్కువ ధర ఇప్పిస్తున్నాం.. అదే గొప్ప అన్నట్లుంది ముఖ్యమంత్రి తీరు. ప్రైవేటు డెయిరీలతో పోలిస్తే అంత గొప్ప ధరలేమీ దక్కడం లేదన్నది రైతుల వాదన.


హకార డెయిరీలను పునరుద్ధరించి చూపిస్తానని, లీటరుకు రూ.4 చొప్పున బోనస్‌ ఇస్తామని ఎన్నికల ముందు శపథం చేసిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక దానికి చాపచుట్టేసి అమూల్‌ జపం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సొంత బ్రాండ్‌ ‘విజయ’ డెయిరీని పక్కకు నెట్టేసి గుజరాత్‌ సహకార సంఘాలకు పెద్దపీట వేస్తున్నారు. అప్పులు తెచ్చి మరీ మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. మూతపడిన డెయిరీలతోపాటు నడుస్తున్న వాటినీ మూయించి అమూల్‌కే అప్పగించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలితో భవిష్యత్తులో ప్రభుత్వ రంగంలో డెయిరీ అనేదే ఉండదు. అంతా అమూల్‌మయమే. అప్పుల భారం, వాటిని చెల్లించే బాధ్యతను ఏపీ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ దశాబ్దాల పాటు మోయాల్సి వస్తుంది. అమూల్‌ కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు, కట్టబెట్టేందుకు సై అంటున్న ముఖ్యమంత్రికి.. బోనస్‌ ఇచ్చేందుకు మాత్రం మనసు రావడం లేదు. రాష్ట్రంలో ఏపీడీడీసీఎఫ్‌ పరిధిలోని డెయిరీలకు రూ. 3,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అంచనా. సుమారు 700 ఎకరాల వరకు భూములు ఉండగా.. వాటి విలువే రూ. 1,500 కోట్ల వరకు ఉంటుంది. ఒంగోలు, అనంతపురం, హిందూపురం, రాజమహేంద్రవరం, కంకిపాడు, పులివెందుల, ఏలూరు జిల్లా కొత్తపల్లిలో డెయిరీలు ఉన్నాయి.

మూతపడిన, పనిచేస్తున్న డెయిరీల్లో మొత్తం 141 బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, 8 పాల ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, రెండు మిల్క్‌ చిల్లింగ్‌ కేంద్రాలు, మదనపల్లెలో యూహెచ్‌టీ ప్లాంట్‌తోపాటు ఒంగోలులో 3,000 టన్నుల సామర్థ్యంతో పాలపొడి ప్లాంట్‌ ఉన్నాయి. వీటన్నింటికి కలిపి ప్రభుత్వం గతంలో నిర్ణయించిన లీజు ధర రూ. 3.38 కోట్లు మాత్రమే. ఏడాదికి 3% చొప్పున పెంచుతామని ప్రతిపాదించారు.

అప్పనంగా కట్టబెట్టడమే లక్ష్యంగా

వైకాపా ప్రభుత్వం సహకార డెయిరీల పునరుద్ధరణ అనే పదాన్నే మరచిపోయింది. ఒక్క డెయిరీని కూడా నిర్వహణలోకి తెచ్చే ప్రయత్నం చేయలేదు. అన్నీ అమూల్‌కు కట్టబెట్టే దిశగా చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె యూహెచ్‌టీ ప్లాంట్‌ను అమూల్‌కు అప్పగించింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్లాంట్‌కు రూ.15 కోట్ల  వ్యయంతో యంత్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా మూతపడిన చిత్తూరు డెయిరీని 99 ఏళ్ల లీజుకు ఇస్తూ డిసెంబరు 13న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. త్వరలో ఒంగోలు డెయిరీతోపాటు మిగిలిన వాటిని కూడా కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అమూల్‌ సంస్థ వద్దనడంతోనే కొన్నిటిని పక్కన పెట్టింది. లేదంటే ఇప్పటికే అన్నిటికి లీజులు పూర్తయ్యేవని అధికారవర్గాలే పేర్కొంటున్నాయి.

గతంలో.. సర్కారు చేయూత ఇలా!

రుణభారం పెరిగిపోయి.. బకాయిల్ని చెల్లించలేని స్థితికి చేరుకున్న డెయిరీలకు గతంలో ప్రభుత్వం ఆర్థిక భరోసా అందించింది. సంక్షోభంలో ఉన్న విజయ డెయిరీని కాపాడేందుకు 1998లో అప్పటి సీఎం  చంద్రబాబు.. ఎన్‌డీడీబీ ద్వారా రూ.4 కోట్లు, ప్రభుత్వం నుంచి రూ.4 కోట్లు, ఆప్కాబ్‌ ద్వారా రుణం రూ.4 కోట్లు కలిపి మొత్తం రూ.12 కోట్లు సమకూర్చారు. దీంతో విజయా డెయిరీ మనుగడ సాధ్యమైందని అధికారులు పేర్కొంటున్నారు. 2017లోనూ ఒంగోలు డెయిరీ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు రూ.35 కోట్లు మంజూరు చేశారు.

బోనస్‌గా మూడున్నరేళ్లకు రూ. 1,108 కోట్లు

సహకార డెయిరీలకు రోజూ 22 లక్షల లీటర్ల పాలు పోస్తున్నట్లు అంచనా. వీరందరికి లీటరుకు రూ.4 చొప్పున బోనస్‌గా ఇస్తే రైతులకు నెలకు రూ.26 కోట్లు చొప్పున మూడున్నరేళ్లలో రూ.1,108 కోట్లు చెల్లించాలి. అమూల్‌ ద్వారా అధిక ధర వచ్చేలా చేస్తున్నామంటున్న సీఎం.. తానిచ్చిన హామీకి నీళ్లొదిలారు.

రెండు పాడి పశువుల రైతుకు రూ.8,000

* వాస్తవానికి 8 నెలల పాడి కాలంలో సగటున ఒక్కో పశువుకు 2,000 లీటర్ల పాలు వస్తాయనుకుంటే.. లీటరుకు రూ.4 చొప్పున బోనస్‌గా రూ.8,000 అందుతాయి. రెండు పాడి పశువులు ఉన్న కుటుంబానికి రూ. 16,000 వస్తే వారికి ఆర్థిక భరోసా లభిస్తుంది.

* డెయిరీలను మూసివేయించడం, మూతపడిన వాటిని అమూల్‌కు కట్టబెట్టడం ద్వారా  ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకుంటోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న విలువైన స్థలాలను కూడా నామమాత్రపు లీజుపై అప్పనంగా ఇస్తోంది. అమూల్‌కు సౌకర్యాల కల్పన పేరుతో ఆటోమేటిక్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లకు రూ.3,000కు పైగానే ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇందులో సగం ఖర్చు చేసినా సంక్షోభంలో ఉన్న వాటితోపాటు మూతపడిన పరిశ్రమలను తిరిగి వినియోగంలోకి తెచ్చే వీలుంటుంది. అయితే ప్రభుత్వం ఆ ఆలోచనే చేయడం లేదని పాడిరంగ నిపుణులు విమర్శిస్తున్నారు.


అన్నా.. అమూల్‌కే ఇచ్చేయ్‌

‘అన్నా.. ఆ డెయిరీని అమూల్‌కు అప్పగించెయ్‌.. మీరడిగిన సాయం చేస్తా’.. ఏదైనా ఆర్థిక సాయం అందుతుందనే ఆశతో వచ్చిన సొంతపార్టీకే చెందిన ఒక డెయిరీ ఛైర్మన్‌కు జగన్‌ సలహా ఇది. దీంతో కంగుతినడం రాయలసీమకు చెందిన ఆయన వంతయింది. సీఎం అంతటితో ఊరుకోలేదు. తన కార్యాలయ అధికారులను పిలిచి ‘అమూల్‌కు అప్పగించే పని చూడమని’ అప్పగించారు.

‘నీకేం పనిలేదా? ఎందుకు వచ్చావ్‌.. సరే.. ఇంకెప్పుడూ ఇటు చూడకు..’ అని కొందరు అధికారులే ఆ డెయిరీ ఛైర్మన్‌కు సలహా ఇచ్చారంటే సీఎం నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది.

* సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటామని పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు పేర్కొంటున్నారు. అంటే దాన్ని కూడా తీసుకుని అమూల్‌కు అప్పగిస్తారా? అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.


అమూల్‌ కోసం ఒంగోలు డెయిరీ మూయించేసింది

వైకాపా అధికారంలోకి వచ్చాక అమూల్‌ను రాష్ట్రంలోకి ఆహ్వానించింది. వారికి కట్టబెట్టేందుకు ఏకంగా ఒంగోలు డెయిరీ మూసివేతకే కంకణం కట్టుకుంది. అప్పటి వరకు రోజుకు 50,000 లీటర్ల వరకు పాలు వస్తుండగా.. సేకరణ ఆపేయాలని ఆదేశించింది. పాడి రైతులకు బకాయిలతోపాటు, ఉద్యోగుల వీఆర్‌ఎస్‌కు సుమారు రూ.80 కోట్లు విడుదల చేసింది. తర్వాత అమూల్‌కు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. అయితే నిర్వహణ వ్యయం అధికం అవుతుందనే ఆలోచనతో.. అమూల్‌ దీన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో డెయిరీలోని విలువైన ఆస్తులు నిరుపయోగంగా మారాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని