పది పరీక్షలపై అయోమయం

రాష్ట్రంలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వింత పరిస్థితి ఎదురుకానుంది. విద్యార్థులంతా జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ను చదువుతున్నా... కొందరు సీబీఎస్‌ఈ, మరికొందరు రాష్ట్ర బోర్డు పరీక్షలు రాయాల్సి వచ్చేలా ఉంది.

Updated : 22 Dec 2022 07:56 IST

చదివేది ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలు
కొందరికి రాష్ట్ర బోర్డు పరీక్షలు..
రెండింటి మధ్య సబ్జెక్టులు, మార్కుల విధానంలో వ్యత్యాసం
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వింత పరిస్థితి ఎదురుకానుంది. విద్యార్థులంతా జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ను చదువుతున్నా... కొందరు సీబీఎస్‌ఈ, మరికొందరు రాష్ట్ర బోర్డు పరీక్షలు రాయాల్సి వచ్చేలా ఉంది. సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న బడులకు మాత్రమే ఆ సంస్థ పరీక్షలు నిర్వహిస్తుంది. మిగతా వారు ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలు చదివినా రాష్ట్ర బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అందరూ ఒకే సిలబస్‌ చదివినా రెండు రకాల బోర్డుల పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 6,500కుపైగా ఉండగా... వీటిలో వెయ్యి బడులకు మాత్రమే సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు లభించింది. ప్రైవేటు, ఎయిడెడ్‌లో కలిపి ఆరు వేల వరకు ఉండగా.. వీటిల్లో ఒక్కదానికీ సీబీఎస్‌ఈ గుర్తింపు లేదు. భవిష్యత్తులోనూ వీరు సీబీఎస్‌ఈ అనుమతికి వెళ్లే పరిస్థితి లేదు. పదో తరగతి పరీక్షల నిర్వహణ, సబ్జెక్టుల ఐచ్ఛికాలు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదవుతున్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను సరఫరా చేశారు. రాబోయే 9, 10 తరగతుల్లోనూ ఈ మండలి పుస్తకాలనే ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా 1-7 తరగతులకు గణితం, ఆంగ్లం, 6-7 తరగతులకు సామాన్యశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలనే అందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. 1-7లో సాంఘిక శాస్త్రం మినహా దాదాపుగా 1-10 తరగతులన్నింటికీ ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలనే ఇవ్వనున్నారు.


* ప్రస్తుతం రాష్ట్ర బోర్డులో ఆంగ్లం, తెలుగు, హిందీ, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాలున్నాయి. పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌ చదువుతున్నందున వీటిని 5 సబ్జెక్టులకు కుదిస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు.

* హిందీని తొలగిస్తే దాన్ని బోధించే ఉపాధ్యాయులను ఏం చేస్తారు? సీబీఎస్‌ఈలో ఎలెక్టివ్‌ విభాగంలో లాంగ్వేజీలున్నా తెలుగు, హిందీ, ఇతర భాషల పేపర్లలో అనుత్తీర్ణులైతే ఈ సబ్జెక్టు మార్కులను పరిగణనలోకి తీసుకునేలా ఉంది. కానీ, ఆప్షనల్స్‌కు అనుబంధంగా నైపుణ్య సబ్జెక్టులు ఉన్నాయి.

* పదో తరగతిలో ప్రస్తుతం అంతర్గత మార్కులు లేవు. వంద శాతం రాత పరీక్షే నిర్వహిస్తున్నారు. గతంలో ఉన్న అంతర్గత మార్కుల విధానాన్ని రద్దు చేశారు. ఇప్పుడు దీన్ని పునరుద్ధరిస్తారా? లేదా? అనే దానిపైనా నిర్ణయం రాలేదు.

* ప్రస్తుతం 8వ తరగతి ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలు చదువుతున్న వారు రెండేళ్లలో పదో తరగతి పరీక్షలు రాస్తారు. ఇప్పటి నుంచే వారిని అందుకు అనుగుణంగా సన్నద్ధం చేయాల్సి ఉన్నా... నిర్ణయం తీసుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని