New Year 2023: నవజీవన సూత్రాలివి..

అనుకరణ అభివృద్ధికి తొలి అడుగే కావాలి గానీ... అన్ని అడుగులూ కారాదు. పనిలో అయినా, జీవితంలోనైనా కాస్త భిన్నంగా ఆలోచించి... విభిన్నంగా ప్రయత్నిస్తే ఉండే కిక్కే వేరు. కొత్త సంవత్సర వేళ... జీవితాన్ని మలుపుతిప్పే అవకాశమున్న కొన్ని నవజీవన సూత్రాలు..!

Updated : 01 Jan 2023 12:49 IST

 

అనుకరణ అభివృద్ధికి తొలి అడుగే కావాలి గానీ... అన్ని అడుగులూ కారాదు. పనిలో అయినా, జీవితంలోనైనా కాస్త భిన్నంగా ఆలోచించి... విభిన్నంగా ప్రయత్నిస్తే ఉండే కిక్కే వేరు. కొత్త సంవత్సర వేళ... జీవితాన్ని మలుపుతిప్పే అవకాశమున్న కొన్ని నవజీవన సూత్రాలు..!


ఎక్కువలో కాదు... తక్కువలోనే ఉంది!

మీరు సంపన్నులా? ఎంతుంటే సంపన్నులు? ఎంతున్నా మనకన్నా మించినవారొకరుంటారు. అందుకే మనకు లేని దాని ఆధారంగా కాకుండా ఏం అవసరం లేదో అది కొలమానంగా సంపదను బేరీజు వేస్తే...? నిజమైన సంపద అనేది ఎక్కువ కలిగి ఉండటంలో కాదు... తక్కువ ఆశించటంలో ఉంటుంది!


ఆ తలుపులు తెరవండి....

మనలో చాలామంది తమకు తెలిసిందే నిజమనుకొంటారు. ఇతరుల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోరు. కాస్త మనసు తలుపులూ తెరిచి భిన్నాభిప్రాయాలకు చోటిద్దాం! తనకే అన్నీ తెలుసనుకునేవాడు ఎందుకూ కొరగాకుండాపోతాడు. అందుకే... అన్ని వైపుల నుంచీ గాలుల్ని ఆహ్వానిద్దాం! ఆస్వాదిద్దాం!


ఒకే ఒక ప్రశ్న...

ఎంత ప్రయత్నించినా జీవితంలో కొన్నింటిని మార్చగలం. కొన్నింటిని మార్చలేం. ఈ సత్యాన్ని తెలుసుకొని... ముందుకు వెళ్లటంలోనే సంతోషం దాగుంది. ఏదైనా ఇబ్బంది, సమస్య ఎదురైతే తనకు తాను వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే! దాన్ని మార్చే సత్తా మనకుందా అని! ఉంటే ముందుకు దూకటం... లేదంటే ముందుకు కదలటం... అంతే!


వేచి చూడటం కాదు...

దేని కోసమైనా వేచి చూస్తున్నారా? అది మీదగ్గరకు వస్తుందా? మీరు వెళ్లి సాధించాలా? ఎవరో వస్తారని, ఏదో చేస్తారని వేచి చూడడం కాలాన్ని వృథా చేసుకోవడమే. ఏం ఆశిస్తున్నామో, మనకేం సాధ్యమో బేరీజు వేసుకుని తొలి అడుగు వేయాల్సిందే. ప్రయత్నించి సాధించుకోవాలి.


బదులిచ్చే ముందు...

ఏ సందర్భంలో అయినా సరే.. ఎవరితో అయినా సరే.. ముందు ఎదుటివారు చెప్పేది పూర్తిగా విని తర్వాతే మాట్లాడాలి. వినటం కూడా... ఏదో ఒక బదులు చెప్పాలనే ఆరాటంతో కాదు.. అర్థం చేసుకోవటానికి వినాలి. మాటల్లో సారం ఉండాలి.


దురదృష్టంలో అదృష్టం

ప్రపంచంలో అత్యంత కుబేరుడికైనా... కూటికి లేనివాడికైౖనా... జీవితంలో ఒడుదొడుకులు, ఎత్తుపల్లాలు సహజం. వీటిని ఎదుర్కొనక తప్పదు. కష్టాలు కడగండ్లు లేని జీవితం నిస్సారం. పరీక్షిస్తేనేగదా... సత్తా ఏంటో, ఎంతో తెలిసేది! జీవితంలో కూడా అంతే! కష్టాలనేవే ఆ పరీక్షలు. అవే మన సత్తాను తెలిపే సాధనాలు! దురదృష్టంలో అదృష్టం వెతుక్కోవాలి. సమస్యలకు లొంగిపోవటం కాదు... వాటిని లోబర్చుకోవాలి. ఆ పరీక్షలో పైచేయి సాధించాలి. ఆణిముత్యాలు... పైపైన ఉండవు. లోతుకు దిగాల్సిందే!


విమర్శలో విషయముందా?

ఎవరైనా ఏమైనా తప్పుపట్టినా, విమర్శించినా కోపం పందెం కోడిలా పైకి లేస్తుందా? మనసు కుతకుతలాడుతుందా? ఒక్క నిమిషం ఆగండి! విమర్శలో విషయముందా? అందులో నిజంగా లాజిక్‌ ఉందా? ఉంటే... అది విమర్శే కాదు. చెప్పినవారికి థాంక్స్‌ చెప్పి సవరించుకునే దిశగా ముందుకు సాగటమే! మన గురించి ఇతరులేమనుకుంటారనే దానిపై కాకుండా... మన లోపాలపై దృష్టి పెడితే మనకే మేలు!


టైమ్‌ మెషిన్‌ లేదు...

అప్పుడలా చేసుంటే/చేయకుండాఉంటే... ఆప్పుడా భూమి కొనుంటే... ఇలా ఎన్నోసార్లు రోజూ గతంలోకి తొంగి చూస్తూనే ఉంటాం! కానీ మన దగ్గర టైమ్‌ మెషిన్‌ ఉండదు కదా.. అలా చేసుంటే బాగుండేది, ఇలా జరుగుంటే బాగుండేది అనే ఆలోచనలు అప్రస్తుతం. ఇప్పుడు, ఈ క్షణం ఏం చేస్తున్నాం... భవిష్యత్‌నెలా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నాం అనేది ముఖ్యం!


ఈ రోజే నీది

చేయలేకపోయిన పనుల్ని చూసి కుంగిపోవద్దు. వాటికే పరిమితం కావొద్దు. ప్రతి రోజూ వాట్‌ నెక్ట్స్‌ అంటూ... ప్రశ్నించుకొని... ఇంకా ఏం చేయగలమో ఆలోచించించాలి. రేపటికి రూపం లేదు. ఈ రోజే ఆ ప్రయత్నం మొదలుపెట్టు. ఈ రోజు మాత్రమే నీది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని