New Year 2023: క్యాలెండర్‌తో పాటు మనమూ మారదాం

కొత్త సంవత్సరమంటే క్యాలెండర్‌లో తేదీ మారటం, కేకులు కోసుకోవటం, పార్టీలు చేసుకోవటమేగాదు. మనమూ మారాలి. మన మనసులు మారాలి. ఆ మార్పు మంచివైపు కావాలి. 

Updated : 01 Jan 2023 12:03 IST

కొత్త సంవత్సరమంటే క్యాలెండర్‌లో తేదీ మారటం, కేకులు కోసుకోవటం, పార్టీలు చేసుకోవటమేగాదు. మనమూ మారాలి. మన మనసులు మారాలి. ఆ మార్పు మంచివైపు కావాలి.  వృత్తిలో నిపుణుడిగా, కొలువులో నిపుణుడైన ఉద్యోగిగా, బడిలో ఉత్తమ విద్యార్థిగా, ఇంట్లో మంచి సోదరుడిగా/సోదరిగా, మంచి తండ్రిగా/తల్లిగా, మంచి భార్యగా/భర్తగా, మంచి పిల్లలుగా, మంచి స్నేహితులుగా.. ఎవరి పాత్రలో వారు మార్పును ఆహ్వానించాలి. అలాంటి చక్కటి మార్పులతోనే అసలైన హ్యాపీ సిసలైన న్యూ ఇయర్‌!


మారాలి మనసు డ్రైవింగ్‌!

అన్వేష్‌ ఓ వ్యాపారవేత్త.. ఎయిర్‌పోర్టులో విమానం దిగి బయటకు వచ్చారు. అంతకుముందే మిత్రుడి ద్వారా బుక్‌ చేసుకున్న కారు సిద్ధంగా ఉంది. డ్రైవర్‌ చిరునవ్వుతో ‘‘నా పేరు వాసు’’ అని పరిచయం చేసుకున్నాక ఇద్దరూ కారు దగ్గరకు వెళ్లారు.

కారు చాలా శుభ్రంగా తళతళా మెరుస్తోంది. అన్వేష్‌ లోపల కూర్చుంటుండగా చేతిలో చిన్న విజిటింగ్‌ కార్డు చేతిలో పెట్టాడు వాసు.

‘నేను మీ బ్యాగులు లోపల సర్దేలోపు ఒకసారి చూడండి సార్‌’ అని చెప్పాడు.

‘ఇప్పుడు మీరు నా అతిథి. మీ పర్యటన చక్కగా సాగాలని ఆశిస్తున్నా. మీ ప్రయాణాన్ని అతి తక్కువ సమయంలో సురక్షితమైన, దగ్గరి దారిలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను.. ఈ కారును మీ సొంతకారులా భావించవచ్చు’’ అని ఉందా కార్డులో!

కారు లోపలా చాలా శుభ్రంగా ఉంది.

డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చున్న తర్వాత అడిగాడు వాసు.. ‘‘సార్‌ మీరు ప్రయాణంలో అలసిపోయి ఉంటారు. మంచి కాఫీ తాగుతారా? నా దగ్గర ఫ్లాస్క్‌లో వేడిపాలు ఉన్నాయి. కాఫీ పొడి సాచెట్‌ ఉంది.. కావాలంటే టీ ప్యాకెట్‌ కూడా ఉంది’’ అన్నాడు.

అన్వేష్‌ ఆశ్చర్యపోయినా.. అతణ్ణి ఆటపట్టించడం కోసం ‘‘లేదోయ్‌.. నాకు జ్యూస్‌ తాగాలని ఉంది’’ అన్నారు.

‘‘పర్వాలేదండీ! నా క్యాబ్‌లో చిన్న కూలర్‌ ఉంది. అందులో కూలింగ్‌ వాటర్‌, కోక్‌, ఆరెంజ్‌ జ్యూస్‌ ఉన్నాయి’’ అన్నాడు వాసు.

‘‘సరే జ్యూస్‌ ఇవ్వు’’ అన్నారు అన్వేష్‌!

పళ్లరసం ఇచ్చాక... ‘‘ఇది ఈరోజు న్యూస్‌ పేపర్‌ సార్‌.. చదువుతారా?’’ అంటూ ఓ దినపత్రికను చేతిలో పెట్టాడు.

కారులో ఎయిర్‌ కండిషనర్‌ ఆన్‌ చేసి ‘కూలింగ్‌ సరిపోతుందా’ అని అడిగాడు.

కారు వెళ్తుండగా మళ్లీ తనే అడిగాడు. నా కారులో చాలా మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ ఉన్నాయి. శాస్త్రీయం... పాప్‌... మీకు ఏది ఇష్టం అయితే దానిని ప్లే చేస్తాను. లేదంటే ఈ నగరం గురించి, మనం వెళ్లే దారిలోని ప్రసిద్ధ కట్టడాలు, చారిత్రక ప్రదేశాల గురించి చెప్పమంటే వెళ్తూ వాటి గురించి వివరిస్తాను. ఒకవేళ విశ్రాంతి తీసుకుంటానంటే కాసేపు ఓ కునుకు వేయండి’’ అని చెప్పాడు.

అన్వేష్‌ చాలాసార్లు చాలా ఊళ్లను సందర్శించాడు. కానీ ఓ క్యాబ్‌ డ్రైవరుతో ఇలాంటి అనుభవం కొత్తగా, ఆశ్చర్యంగా ఉంది.

వచ్చేముందు తన మిత్రుడు ‘ఫలానా డ్రైవరునే పెట్టుకో’ అని ఎందుకు చెప్పాడో అర్థమైంది అన్వేష్‌కు.

‘‘నువ్వు మొదటి నుంచీ.. ప్రతి కస్టమరుకు ఇలాంటి సేవలే అందిస్తున్నావా?’’ అని అడిగారు అన్వేష్‌.

‘‘లేదు సార్‌.. గత రెండేళ్ల నుంచే ఇలా మొదలుపెట్టాను ‘మొదట్లో ఓ అయిదేళ్లపాటు ఎప్పుడు బేరం తగులుతుందా.. అని ఎదురు చూడడంతోనే సరిపోయేది.. ఒక్కోసారి బేరాలేవీ లేకుండానే ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. ఒకసారి రేడియోలో ఓ గురువు ప్రసంగం విన్నాను. అవకాశాలను మనమే ఎలా సృష్టించుకోవాలో చెప్పారాయన. ‘చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోవడం కాదు ప్రయత్నించి ఓ చిరు దీపాన్ని వెలిగించడం నేర్చుకోవాలన్నారు. అప్పటి నుంచి నా ఆలోచన మారింది.

కస్టమర్లతో స్నేహపూర్వకంగా ఉండేవాణ్ని కాదు. నిజానికి ఎంతో దూరం నుంచి బోలెడు ఖర్చుపెట్టుకుని వచ్చే కస్టమర్లు ఇక్కడ వీలైనన్ని ఎక్కువ ప్రదేశాలను చూడాలని.. చౌకలో దొరికే వస్తువులను కొనుక్కోవాలని భావిస్తుంటారు. ఈ విషయాల్లో వాళ్లకు కాస్త మాట సాయం చేస్తే చాలు.. వాళ్లు ఎప్పటికీ మరచిపోరు అనిపించింది. ఒకరిద్దరి విషయంలో ఇలా చేసేసరికి ఎంతో ఆనందించారు. అంతేకాదు.. వాళ్ల బంధు మిత్రులు ఎవరు ఈ ఊరికి వచ్చినా నా నంబరు ఇస్తుంటారు. అప్పటి నుంచి ఇదే పద్ధతి మొదలుపెట్టాను.

ఇప్పుడు నాకు ఏ టాక్సీ సర్వీసుల్లోనూ సభ్యత్వం లేదు. నేరుగా వచ్చే బుకింగ్సే బోలెడన్ని. మరో ఇద్దరు మిత్రులకు బేరాలు అప్పగిస్తున్నాను. వాళ్లు కూడా ఇదేరకమైన సర్వీసు చేసేలా అలవాటు చేశాను. ఈ రెండేళ్లలో సంపాదన రెట్టింపైంది’’ అన్నాడు వాసు.
ఆశ్చర్యపోవడం అన్వేష్‌ వంతైంది. ఓ క్యాబ్‌ డ్రైవరు ఇలాంటి జీవితపాఠాలను చెప్పడం ఆయనను ఆకట్టుకుంది. అంతేకాదు.. తన వ్యాపార విస్తరణకు అవసరమైన మంచి పాఠం నేర్చుకున్నట్లు అనిపించింది.

పరిమితుల్ని తలచుకుంటూ కుంగిపోవటం; సమాజం మనకు గొప్ప అవకాశాలను ఇవ్వడంలేదంటూ నిరాశ చెందడం కాదు. అవకాశాలను మనమే సృష్టించుకోవాలి.. అవి మన చుట్టూనే ఉంటాయి. మన తీరు మారితే అవే దొరుకుతాయి!


సమయం తక్కువ మిత్రమా!

సిటీ బస్సు పరుగులు తీస్తోంది. ఓ యువతి తన సీట్లో కూర్చుంది. తర్వాతి స్టాపులో ఓ లావుపాటి మహిళ ఎక్కింది. నాలుగైదు బ్యాగులతో సహా నేరుగా వచ్చి దాదాపుగా ఆ యువతి ఒళ్లో కూర్చున్నట్లుగా కూలబడింది. బ్యాగుల్ని ఆమె ఒళ్లోకి నెట్టేసింది. కొన్నింటిని కాళ్ల మీద ఎత్తేసింది. మరోవైపు సీట్లో కూర్చున్న మరో మహిళకు ఇదంతా చూసి కోపం వచ్చింది. ‘అదేంటి మీరు అలా ఎలా ఊరుకుంటున్నారు? ఆ బ్యాగుల్ని తీసి కింద పారేయమని అడగరెందుకు’ అని సలహా ఇచ్చింది.

కూల్‌గా చూసి సన్నగా నవ్విన ఆ యువతి అంతే కూల్‌గా సమాధానం చెప్పింది.. ‘‘ఆమెతో వాదించి గొడవ పెట్టుకునేంత ప్రధాన సమస్యేమీ కాదిది. నేను వచ్చే స్టాపులో దిగిపోతాను. ఈ కొద్దిసేపటిదానికి అంత అవసరమా?’’ అంది.

ఎవరైనా మీ మనసు విరిచారా? మోసం చేశారా? తిట్టారా? అవమానించారా? వదిలేయండి... బాధపడుతూ, కోప్పడుతూ, రగిలిపోతూ కూర్చునేంత సమయం లేదు. ఈ ప్రపంచంలో మన జీవితకాలం చాలా తక్కువ. ఉన్న ఆ కొద్దిసేపట్లోనే దానిని చక్కగా అనుభవించకుండా.. సమాజానికి ఉపయోగపడే పనులు వదిలేసి, మన లక్ష్యాన్ని వదిలేసి... దారిన పోయే దానయ్యల లోపాలను కనిపెట్టి వారితో వాదించడానికి, గొడవ పెట్టుకోడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తే పోయేది మన విలువైన సమయమే!


గోడు విందాం..

విక్టర్‌ ఫ్రాంకిల్‌.. 20వ శతాబ్దంలో పేరెన్నికగన్న గొప్ప మానసిక వైద్య నిపుణుడు.

ఆయన రాసిన ‘మ్యాన్స్‌ సెర్చ్‌ ఫర్‌ మీనింగ్‌’ అనే గొప్ప పుస్తకం ఎంతోమంది జీవితాలను మార్చింది. ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకమది.

ఆయనకు ఓరోజు అర్ధరాత్రి వేళ ఓ మహిళ ఫోన్‌ చేసి... తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పారు.

జీవితంలో సర్వం కోల్పోయినట్లున్నాయి ఆమె మాటలు. తనకు బతకాలనే ఆశ ఏమాత్రం లేదని.. జీవితాన్ని ముగించాలనుకుంటున్నానంది ఆవిడ.

ఆమె ఎందుకు ఇలాంటి నిర్ణయానికి వచ్చిందో అడిగి... వాటిని ఎలా అధిగమించవచ్చో వివరించడానికి ప్రయత్నించారు విక్టర్‌.

జీవితం ఎంత విలువైనదో చెప్పడానికి అర్ధరాత్రి వేళ ఆమెతో చాలాసేపు మాట్లాడారు.

బతకడానికి ఎన్నిరకాల మార్గాలున్నాయో చెప్పారు. చివరకు ఆమె ఎలాంటి అఘాయిత్యానికీ పాల్పడనని ఆయనకు భరోసా ఇచ్చి ఫోన్‌ పెట్టేసింది. కొన్నాళ్ల తర్వాత ఆమె విక్టర్‌ను కలిసింది.

ఆరోజు రాత్రి తాను చెప్పిన విషయాల్లో ఏ అంశం ఆమెను ఆత్మహత్య ఆలోచన నుంచి బయటకు పడేసిందో తెలుసుకుందామనిపించి అడిగారు విక్టర్‌కు. తన సూచనలేవీ తనపై ప్రభావం చూపలేదంది ఆవిడ!

మరి?... అంటూ ఆశ్చర్యపోయారు విక్టర్‌!

‘‘మీరు చెప్పిన సూచనలేవీ కారణాలు కాలేదు. కానీ అర్ధరాత్రి వేళ ఓ అభాగిని చావుకు, బతుక్కి మధ్యలో కొట్టుమిట్టాడుతున్నపుడు అంత ఓపికతో.. అంతసేపు మీరు మాట్లాడడటమే నాకెంతో ఆశ్చర్యమేసింది. ఈ ప్రపంచం ఎదుటివారి బాధలు, కష్టాలు వినడానికి సిద్ధపడుతుందనే ఆలోచనే నాకు బతుకు మీద ఆశలు పెంచింది. అందుకే ఆత్మహత్య నిర్ణయాన్ని విరమించుకున్నాను’’ అని చెప్పింది.

సాయం చేయలేకున్నా.. సాటి మనిషి కష్టసుఖాలను కొంతైనా వినడానికి, నాలుగు ఓదార్పు మాటలు చెప్పడానికి మనమంతా సిద్ధమైతే ఎంతమందికి గుండె ధైర్యాన్ని ఇవ్వగలమో గదా!


అప్పుడేమీ వినిపించవు...

శిష్యుడు ఒకరోజు గురువు దగ్గరకు వచ్చాడు..

‘స్వామీ నేను ఈ గురుకులాన్ని విడిచి పోవాలనుకుంటున్నాను.

ఆశ్చర్యపోయిన గురువు ఎందుకని అడిగారు..

‘ఇక్కడ పిల్లలంతా ఎప్పుడూ కీచులాడుకుంటూ గొడవ గొడవ చేస్తున్నారు. టీచర్లు ఎప్పుడూ దుర్భాషలాడుతూ ఉంటారు. పక్కనుంచి ఎప్పుడూ భరించలేనంత గోల.. వీటన్నింటి మధ్యా నేను చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను..’’ అని ఫిర్యాదు చేశాడు.
శిష్యుడు చెప్పినదంతా ప్రశాంతంగా విన్న గురువుగారు.. ‘‘నీకు ఇష్టంలేకపోతే వెళ్లిపోవచ్చు కానీ, వెళ్లేముందు నాకొక చిన్న పని చేసిపెడతావా?’’ అని అడిగారు. శిష్యుడు సరేనన్నాడు.

చిన్న కుండను నీళ్లతో నింపి శిష్యుడికిచ్చారు.

కుండలోని నీళ్లు ఒక్క చుక్క కూడా కింద ఒలికిపోకుండా గురుకులం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి రమ్మన్నారు.

గురువుగారు పెద్ద కార్యమేదైనా చెబుతారేమో అనుకుంటే ఇంత చిన్న పని చెప్పారేమిటా అనుకున్న శిష్యుడు కుండ పట్టుకొని బయలుదేరాడు.

తొణక్కుండా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ గురుకుల ప్రదక్షిణ మొదలు పెట్టాడు. ఒకటి.. రెండు.. మూడు ప్రదక్షిణలు అయిపోయాయి. చుక్కనీరు కింద పడలేదు.

హమ్మయ్య అనుకుని సంతోషంగా గురువు దగ్గరకు వచ్చి ‘నేనెంత పనిమంతుడినో’ అన్నట్లు మొహం పెట్టి.. కుండ చూపించాడు.

అప్పుడు గురువు అడిగారు.. ‘‘నువ్వు కుండ పట్టుకుని గురుకులం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నపుడు ఆ టీచర్‌ వేస్తున్న కేకలు వినిపించాయా?’’ అని.. లేదన్నాడు శిష్యుడు!

మరి చుట్టుపక్కల నుంచి గోల వినిపించిందా.. అంటే లేదన్నాడు.

పిల్లల అల్లరి, కేకలు కూడా వినిపించలేదన్నాడు.

‘‘నీకు అవన్నీ ఎందుకు వినిపించలేదంటే.. అప్పుడు నీ దృష్టి పూర్తిగా చేస్తున్న పని మీదనే ఉంది. ఒక్క బొట్టు నీరు కూడా కిందకు ఒలికిపోకుండా జాగ్రత్తగా ఎలా నడవాలనే దానిపైనే నీ ధ్యాస ఉంది కనుక.. ఇంకే గందరగోళాలూ నీ చెవిన పడలేదు. అదే ఏకాగ్రత అంటే. జీవితంలో ఎప్పుడూ ఇలాగే ఉండాలి. చేస్తున్న పని మీద ధ్యాస నిలిపినప్పుడు ఇతరత్రా అంశాలేవీ నీ బుర్రలోకి ఎక్కవు. నీ పనిని దెబ్బతీయవు. ముఖ్యంగా నీ పని మీద మాత్రమే నీకు శ్రద్ధ ఉన్నపుడు ఇతరుల్లోని లోపాలను, లోటుపాట్లను ఎత్తి చూపడానికి నీకు సమయమే ఉండదు...’’


ఖాళీ చేసి వెళ్లండి

‘‘ఈ భూమండలం మీద అత్యంత ఖరీదైన స్థలం ఏది?’’ 

ఓ సంస్థ బోర్డు సమావేశంలో ఆ ప్రశ్న వినగానే ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఒక్కొక్కరూ ఒక్కో సమాధానం చెప్పసాగారు.

‘గల్ఫ్‌ దేశాలు’.. ‘ఆఫ్రికాలోని వజ్రాల గనులు’.. ‘హాంకాంగ్‌లోని ఫలానా వ్యాపార కూడలి’.. ఇలా రకరకాల జవాబులు వచ్చాయి.

ఇవేవీ కాదంటూ చివరగా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.

‘‘ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం.. శ్మశానవాటిక! ఎందుకంటే, ఈ ప్రపంచంలో అనాదిగా కోటాను కోట్లమంది పుట్టారు, మరణించారు. వారిలో చాలా కొద్దిమందే తమ తెలివితేటలను ప్రపంచానికి పంచారు. మిగతావారంతా తమ మేధస్సును, ఆలోచనలను, అద్భుతమైన తెలివితేటలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని వీడిపోయారు. అవి వెలుగు చూడలేదు. వాటివల్ల ఈ ప్రపంచానికి ప్రయోజనం లేకుండాపోయింది. అవన్నీ వారితోపాటే సమాధి అయిపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న శ్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ ఉంటుంది?’’

అది వినగానే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. తర్వాత ఈ విషయాన్ని మరచిపోయారు. ఒక వ్యక్తి మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నాడు.

ఆయన పేరు టాడ్‌ హెన్రీ. ఆయనో రచయిత. దీన్నే ప్రాతిపదిక చేసుకొని ఆయనొక పుస్తకం రాశారు. దాని పేరు ‘డై ఎమ్టీ!’

ఇంతకీ ఆ పుస్తకంలో ఏం రాశారు ఆయన?

‘‘మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వత నిద్రకు వెళ్లకండి. వాటన్నింటినీ ఈ ప్రపంచానికి పంచి వెళ్లండి.

ఈ లోకాన్ని వీడేలోగా మీలోని మంచిని ప్రపంచానికి అందజేసి వెళ్లండి.

మీ మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టి వెళ్లండి. మీలోని జ్ఞానాన్ని నలుగురికీ అందించి వెళ్లండి. ప్రేమను పంచి వెళ్లండి...

ఏదీ దాచుకొని వెళ్లకండి. అంతా ఖాళీ చేసి వెళ్లండి!’’- అని!

ఈ ప్రపంచం నాకేమిచ్చింది.. అని కాదు. ఈ ప్రపంచానికి నేనేం ఇచ్చాను? అని ప్రశ్నించుకుందాం!

‘డై ఎమ్టీ’.. చిన్న పుస్తకమే కానీ, అద్భుతమైనది.


తగ్గితే నెగ్గొచ్చు...

ఒక ఇంజినీరు సొంతంగా అందమైన కారు తయారు చేశాడు.

దానిని చూసిన ఆ వర్క్‌ షాప్‌ యజమాని ఆనందించి ఇంజినీరుకు మంచి బహుమతులిచ్చారు.

ఆ తర్వాత కారును వర్క్‌షాప్‌ నుంచి షోరూముకు తీసుకెళ్లాలని భావించారు.

అయితే.. వర్క్‌షాపు గుమ్మం ఎత్తు కాస్త తక్కువ కావడంతో అందులోంచి కారు బయటకు వెళ్లేలా కనిపించలేదు. అంతా కలవరపడ్డారు. అందరూ తలో సలహా ఇవ్వటం మొదలెట్టారు.

ఈలోగా ఆ ఇంజినీరు.. కారు పైన అంచును కొద్దిగా నొక్కుదామని, గుమ్మంలోంచి దూరి బయటకు వెళ్లాక దానిని యథావిధిగా మార్చేద్దాం అన్నాడు.

కానీ కొత్త కారుకు సొట్టలు పెట్టడం యజమానికి నచ్చలేదు.

అక్కడ ఉన్న మరొకాయన గుమ్మం పైన షట్టర్‌ తొలగిద్దాం. కారు బయటకు వెళ్లిన తర్వాత మళ్లీ సెట్‌ చేసుకోవచ్చు అన్నాడు.

యజమానికి అది కూడా నచ్చలేదు.

ఏం చేయాలా అని అంతా తలలు బద్దలుకొట్టుకుంటున్నారు.

ఇదంతా చూస్తున్న వాచ్‌మన్‌ నేనొక సలహా చెప్పనా సార్‌ అని అడిగాడు.

అందరూ ఆశ్చర్యపోయి... మాకు తట్టని ఐడియా నీకు తడుతుందా అన్నట్లు నవ్వారు.

ఏ పుట్టలో ఏ పాముందోనన్నట్లు... యజమాని సరే చెప్పమన్నారు.

‘‘ఏమీ లేదు సార్‌.. కారు బయటకు వెళ్లడానికి గుమ్మం రెండు అంగుళాలు మాత్రమే అడ్డుకుంటోంది. కాబట్టి కారు టైర్లలో గాలి తీసేస్తే ఆ మేరకు ఎత్తు తగ్గుతుంది. బయటకు వెళ్లిన తర్వాత మళ్లీ గాలి నింపవచ్చు’’ అన్నాడు. యజమాని సహా అక్కడున్న అందరూ అబ్బురపడ్డారు.

వర్క్‌షాప్‌ ఓనరు అతడి తెలివి మెచ్చుకుని అదే పని చేశారు. కారు వర్క్‌షాపులోంచి బయటపడి కొత్త లోకాన్ని చూసింది.

కొన్నిచోట్ల ‘ఇగో’ మనకు అడ్డం వస్తూ ఉంటుంది. దానిని తగ్గించుకుని.. కాస్త ‘ఒదిగితే’ విజయం సాధించొచ్చు.

అలాగే అందరిలోనూ తెలివి ఉంటుంది. ఎవ్వరినీ తక్కువ అంచనా వేయొద్దు కూడా!


మూడో నంబర్‌ మేక...

ఓ ఊళ్లో పాఠశాల...

ఇద్దరు విద్యార్థులు ఒక తమాషా పని చేశారు. మూడు మేకలను తెచ్చి వాటి మీద 1, 2, 4 అనే అంకెలు రాసి రాత్రివేళ పాఠశాలలోకి వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఉదయం ఉపాధ్యాయులు, సిబ్బంది వచ్చారు. బడి ఆవరణలో ఎక్కడ చూసినా మేకల పెంట కనిపించడంతో అవి స్కూల్లోకి చొరబడ్డాయని అర్థమైంది. వెంటనే సిబ్బంది వాటిని పట్టుకునే పనిలో పడ్డారు. 1, 2, 4 నంబర్లు రాసి ఉన్న మేకలు మూడూ పట్టుబడ్డాయి. అయితే.. ‘మూడో నంబరు’ మేక ఏమైందో ఎవరికీ అర్థంకాలేదు. ఆవరణంతా గాలించారు. ఆ ‘మాయా మేక’ కనిపించలేదు. తరగతుల్ని రద్దుచేసి పిల్లలను ఇళ్లకు పంపేశారు. టీచర్లు, సిబ్బంది సహా అందరూ వెతికినా దొరకలేదు. అసలు ఉంటే కదా దొరకడానికి!

మనలో కూడా చాలామంది.. జీవితంలో మాయలేడిలాంటి ఆ మూడో నంబర్‌ మేకను ఊహించుకుని.. దాని కోసం వెతుకులాడుతుంటాం. అసంతృప్తితో, ఫిర్యాదులతో జీవితాలను గందరగోళం చేసుకుంటుంటాం. లేని మూడో నంబర్‌ మేక గురించి మరచి, ఉన్నదాంతో సర్దుకుపోతే ఎంత హాయి!


ఆ బంతికి నా వయసు తెలియదు కదా..

టెన్నిస్‌ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా 50 ఏళ్ల వయసులోనూ కోర్టులో సంచలనాలు సృష్టించారు. తన వయసులో సగం వయసున్నవారితో కలసి ఆడారు. వారినీ ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

‘‘ఈ వయసులో కూడా ఇంత దృఢంగా? ఇంత వేగంగా ఎలా ఆడగలుగుతున్నారు?’’ ఓసారి ఓ ప్రేక్షకుడు అడిగిన ప్రశ్న ఇది.

‘‘పాపం ఆ బంతికి నా వయసు తెలియదుగా’’ అన్నారావిడ!

వయసుకు, చేసే పనికి సంబంధం లేదనటానికి మార్టినా నవ్రతిలోవా మంచి ఉదాహరణ.

నిజానికి మనిషి ఆడినా, పనిచేసినా, ఏది చేసినా అదంతా మెదడులోనే జరుగుతుంది. మనం భౌతికంగా భవంతుల్లో, ఇళ్లలో నివసించొచ్చు. కానీ వాటితో పాటు గోడల్లేని అనంతమైన మనసులో జీవిస్తాం. అక్కడ స్పష్టత ఉంటే, అక్కడ బలంగా ఉంటే... అక్కడ సంపన్నంగా ఉంటే అంతటా ఉన్నట్లే! మనసు బలంగా లేకుంటే ముప్పైల్లోనే ముసలితనం వచ్చేస్తుంది. మనసు యువకువలాడుతుంటే 80ల్లోనూ ఉత్సాహంగానే ఉంటుంది. కాబట్టి జీవితంలో రాణించాలంటే.. మనసు గట్టిగా ఉండాలి.


అటువైపు నుంచి ఆలోచిద్దాం!

నున్నటి తారు రోడ్డు. వాతావరణం హాయిగా ఉంది. కారు సర్రున దూసుకుపోయేదే.. కానీ ముందు వెళ్తున్న ఓ కారు చాలా నెమ్మదిగా పోతోంది. అందులోని వ్యక్తికి పనేమీ లేనట్లుంది ప్రశాంతంగా నడుపుతున్నాడు.

సరదాగా వ్యాహ్యాళికి వచ్చాడేమో అన్నట్లుంది అతడి డ్రైవింగ్‌ చూస్తుంటే.

రెండు మూడుసార్లు హింట్‌ ఇచ్చి చూశాను.. కనీసం పక్కకు మళ్లి దారి ఇవ్వడంలేదు.

నాకు కోపం ముంచుకొచ్చింది.

పక్కనుంచి దారి చేసుకుని వెళ్లి ఎదురుగా అడ్డంగా కారు ఆపి.. అతడిని చెడామడా తిట్టేద్దాం అనుకున్నాను.

అలా వెళ్లబోతుండగా చూశాను.. కారు పక్కన అద్దం మీద చిన్న స్టిక్కర్‌ అతికించి ఉంది. ‘‘నేను దివ్యాంగుడిని.. దయచేసి కాస్త ఓపిక పట్టండి’’ అని రాసి ఉంది!

వెంటనే నా కోపం దిగిపోయింది. అప్పటి వరకు అతడి గురించి నేను మనసులో అనుకున్న మాటలకు సిగ్గేసింది. నా కారు వేగం తగ్గిపోయింది.

ఆ కారు నా దారిలోంచి తొలగే వరకు అలాగే నెమ్మదిగానే వెళ్లాను. ఏదో కొద్ది నిమిషాలు ఆలస్యంగా ఇంటికి చేరానే తప్ప పెద్దగా పోయిందేం లేదు.

ఒకవేళ ఆ స్టిక్కర్‌ చూసి ఉండకపోతే అతడి పట్ల నా ప్రవర్తన ఎంత అమానుషంగా ఉండేదో తలచుకుంటేనే నిలువునా కుంగిపోయినట్లు అనిపించింది.

నిజమే.. ఆ చిన్న స్టిక్కరు నాకు ఇంత సహనాన్ని కలగచేసింది.. అది లేకపోతే ఇంత సహనంగా ఉండేవాడినా?

కానీ ప్రతి ఒక్కరూ ఇలాంటి స్టిక్కర్లను మొహానికి అతికించుకోగలరా?

‘‘నేను ఇబ్బందుల్లో ఉన్నాను..’’

‘‘ఉద్యోగం కోసం అన్వేషణలో అలసిపోయి ఉన్నాను..’’

‘‘నేను క్యాన్సర్‌ బాధితుణ్ని’’..

‘‘నా ప్రియ మిత్రుణ్ని కోల్పోయిన దుఃఖంలో ఉన్నాను’’..

‘‘ఆర్థికంగా నష్టపోయి కుంగుబాటులో ఉన్నాను’’.. ఇలా ఎంతమంది తమకున్న రకరకాల కారణాలను స్టిక్కర్ల రూపంలో మొహం మీద అతికించుకుని తిరుగుతారు?

జీవన పోరాటంలో అందరూ నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతూనే ఉంటారు. వాటి గురించి మనం అసలు పట్టించుకోం.

అందుకే.. ఎదుటివారి అవ్యక్త సమస్యలను చెప్పకుండానే సానుభూతితో అర్థం చేసుకొని... కాసింత సహనాన్ని పెంచుకుంటే.... ఈ లోకం ఎంత అందంగా ఉంటుందో కదా!!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని