Vande Bharat Express: స్లైడింగ్‌ డోర్లు, రీడింగ్‌ లైట్స్‌.. 16 కోచ్‌లు.. 1,128 సీట్లు

తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు విశాఖకు చేరుకుంది. ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా చెన్నైలోని కోచ్‌ ఫ్యాక్టరీ నుంచి నేరుగా విశాఖ రైల్వేస్టేషన్‌కు వచ్చింది.

Updated : 12 Jan 2023 09:53 IST

విశాఖ వచ్చిన వందేభారత్‌ రైలు

ఈనాడు, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు విశాఖకు చేరుకుంది. ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా చెన్నైలోని కోచ్‌ ఫ్యాక్టరీ నుంచి నేరుగా విశాఖ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. 16 బోగీలతో వచ్చిన ఆ రైలు బుధవారం ఉదయం 11.50 గంటలకు చేరుకోగా స్టేషన్‌లోని ప్రయాణికులంతా ఆసక్తిగా తిలకించారు. మిగిలిన రైళ్ల కన్నా భిన్నంగా అత్యాధునికంగా ఉండడంతో చూసేందుకు పోటీపడ్డారు. కొంత సమయం స్టేషన్‌లో ఉన్న తరువాత వాల్తేరు కోచింగ్‌ కాంప్లెక్స్‌కు తరలించారు.

విశాఖ నుంచి హైదరాబాద్‌కు తిరిగి గురువారం ఉదయం బయలుదేరనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. విశాఖకు వచ్చిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు అత్యాధునిక సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉంది. మొత్తం 1,128 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. 52 మంది కూర్చునే మొదటి శ్రేణి కోచ్‌లు రెండున్నాయి. కోచ్‌ పొడవు 23 మీటర్లు. ప్రత్యేకంగా స్లైడింగ్‌ డోర్లు, రీడింగ్‌ లైట్స్‌, అటెండెంట్‌ కాల్‌ బటన్లు, ఆటోమెటిక్‌ ఎగ్జిట్‌, ఎంట్రీ డోర్లు, సీసీటీవీ కెమెరాలు, పడుకునే సౌకర్యం కలిగిన కుర్చీలు ఉన్నాయి. జీపీఎస్‌ ఆధారిత ప్రయాణికుల సమాచారం, బయోవాక్యూమ్‌ మరుగుదొడ్లు ఉన్నాయి.

రైలుపై ఆకతాయిల రాళ్ల దాడి

విశాఖకు వచ్చిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మీద ఆకతాయిలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. రైల్వేస్టేషన్‌ నుంచి నిర్వహణ కోసం కంచరపాలెంవద్ద ఉన్న న్యూ కోచింగ్‌ కాంప్లెక్సుకు రైలును తరలించారు. కోచింగ్‌ కాంప్లెక్సు సమీపంలో ఆడుకుంటున్న కొందరు బాలలు రాళ్ల దాడికి పాల్పడినట్లు రైల్వే రక్షక దళం ప్రాథమికంగా గుర్తించింది. దీంతో ఒక కోచ్‌ అద్దం ధ్వంసమైంది. మరోచోట పగిలిపోయి అక్కడక్కడ బీటలు ఏర్పడ్డాయి. దీంతో రైల్వే పోలీసులు బృందాలుగా ఏర్పడి ఘటనకు బాధ్యులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని