ప్రకాశంలో గ్రావెల్‌ గద్దలు!

అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల అండదండలతో ప్రకాశం జిల్లాలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఇష్టారాజ్యంగా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.

Published : 19 Jan 2023 04:14 IST

యరజర్ల, మర్లపాడు కొండల్లో రూ.కోట్ల విలువైన ఎర్రమట్టి తవ్వకం
అధికార పార్టీ అండదండలతో అక్రమార్కుల ఇష్టారాజ్యం
ఈనాడు డిజిటల్‌ - ఒంగోలు, న్యూస్‌టుడే - టంగుటూరు

అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల అండదండలతో ప్రకాశం జిల్లాలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఇష్టారాజ్యంగా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. వారి దెబ్బకు ఒంగోలు, టంగుటూరు సమీపంలోని కొండలు కరిగిపోతున్నాయి. నిత్యం వందలాది టిప్పర్లలో గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునేవారు కరవయ్యారు. ఒంగోలు మండల పరిధిలోని యరజర్ల కొండలు 800 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ఇనుప ఖనిజం ఉందని ఏళ్ల క్రితమే జింపెక్స్‌ సంస్థకు కొన్ని భూముల్ని కేటాయించినా ఇంతవరకూ మైనింగ్‌ జరగలేదు. అదే కొండల్లో దాదాపు 23వేల మందికి జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. కొండల్లో కొంత భాగం చదునుచేసి ప్లాట్లు వేసి, హద్దురాళ్లు పాతారు. ఈ వ్యవహారం న్యాయస్థానానికి వెళ్లడంతో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయలేదు. ఈ పరిస్థితుల్లో కొందరు అధికార పార్టీ నాయకులు, మద్దతుదారుల కళ్లు ఈ ప్రాంతంపై పడ్డాయి. మూడేళ్లుగా ఇష్టారీతిన ఎవరికి తోచినట్లు వారు గ్రావెల్‌ను తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఏ గ్రామాన్నీ వదల్లేదు

టంగుటూరు మండలం మర్లపాడు, కందులూరు, కొణిజేడు గ్రామాల పరిధిలో సుమారు 900 ఎకరాల ప్రభుత్వ కొండపోరంబోకు భూముల్లో ఎర్రమట్టి నిక్షేపాలున్నాయి. తవ్వకాలకు అనుమతుల్లేనప్పటికీ నిత్యం 200 టిప్పర్లతో ఒంగోలు, సంతనూతలపాడు, చీమకుర్తి, కొండపి, టంగుటూరు, కొత్తపట్నం, జరుగుమల్లి మండలాలకు కొందరు మట్టిని తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతల బంధువులు, వల్లూరు గ్రామానికి చెందిన ఓ గుత్తేదారు... కందులూరు, మర్లపాడు ప్రాంతాల వైకాపా నాయకులు సూత్రధారులు. మైనింగ్‌, విజిలెన్స్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొండల తవ్వకంతో పర్యావరణం దెబ్బతింటోందని, పశువుల మేతకూ భూమి లేని పరిస్థితులొచ్చాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అడ్డుకుంటే దాడులే

ఇళ్ల నిర్మాణాలు, రోడ్ల విస్తరణ పనులు, లేఅవుట్ల అభివృధ్ధి, ఇతర పనులకు ఈ మట్టినే వినియోగిస్తుండటంతో ఒక్కో టిప్పర్‌కు ప్రాంతాన్నిబట్టి రూ.5 వేల నుంచి రూ.10వేలు వసూలు చేస్తున్నారు. జగనన్న కాలనీ లేఅవుట్లకు, నాడు-నేడు పనులకు మెరక తోలకం పేరుతో కొండ ప్రాంతాన్ని తవ్వి భారీ గుంతలు పెట్టారు. వర్షాలకు అవి చెరువులను తలపిస్తున్నాయి. ఇటీవల పట్టపగలే టంగుటూరు మండలం మర్లపాడువద్ద వైకాపా నాయకుడు ఎర్రమట్టిని తవ్వి తరలిస్తుండగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకోబోతే దురుసుగా ప్రవర్తించారు. గ్రామస్థులపైనా దౌర్జన్యానికి దిగారు. 


పరిశీలించి చర్యలు తీసుకుంటాం
- ఓబుల్‌రెడ్డి, ఏడీ, గనులశాఖ

యరజర్ల, మర్లపాడు కొండలవద్ద ఎర్రమట్టి తవ్వకాలకు అనుమతుల్లేవు. తరచూ దాడులు చేస్తూ మట్టి తవ్వకాలను అడ్డుకుంటున్నాం. విజిలెన్స్‌ బృందాన్ని పంపి పరిశీలిస్తాం. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. 


రూ.65 కోట్ల పైమాటే...

ఒంగోలు మండలం పరిధిలోని 350 ఎకరాల కొండ భూముల్లో 80వేల టిప్పర్ల మట్టిని అక్రమంగా తవ్వి తరలించేశారని స్థానికులు ఇటీవల ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. టంగుటూరు పరిధిలో 70 ఎకరాల్లో అక్రమార్కులు గ్రావెల్‌ తవ్వేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన గ్రామస్థులపై దాడులకు యత్నించారు. ఈ ప్రాంతాల నుంచి నిత్యం 200 టిప్పర్ల ద్వారా రోజుకు రూ.10 లక్షల విలువైన మట్టి తరలుతోంది. ఇప్పటివరకు దాదాపు రూ.65 కోట్ల విలువైన మట్టిని కొల్లగొట్టడంతో కొండల రూపురేఖలు మారిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని