Rushikonda: ‘రుషికొండ’ పనులపై ముందుకే..

వివాదాస్పద ‘రుషికొండ పర్యాటక పునరుద్ధరణ రిసార్టు’ ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పనులను పూర్తిస్థాయిలో పర్యవేక్షించేందుకు త్వరలో ఓ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించనున్నారు.

Updated : 23 Jan 2023 09:32 IST

రూ.164 కోట్ల ప్రాజెక్టు 12 నెలల్లో పూర్తికి ప్రణాళిక
పర్యవేక్షణకు కన్సల్టెన్సీ నియామకానికి చర్యలు

ఈనాడు, విశాఖపట్నం: వివాదాస్పద ‘రుషికొండ పర్యాటక పునరుద్ధరణ రిసార్టు’ ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పనులను పూర్తిస్థాయిలో పర్యవేక్షించేందుకు త్వరలో ఓ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించనున్నారు. అనుమతులు తీసుకురావడం మొదలుకుని నాణ్యతా పరిశీలన, ఇతర తనిఖీలు అదే సంస్థతో చేయిస్తారు. అంతేకాకుండా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థతో (ఏపీటీడీసీ) ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని గడువులోగా ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకుంటున్నారు. హైకోర్టులో ఒకవైపు న్యాయపరమైన విచారణ కొనసాగుతోంది. మరోవైపు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ రీ డెవలప్‌మెంట్‌ రిసార్టు పనుల పర్యవేక్షణకు తాజాగా ఏపీటీడీసీ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ (పీఎంసీ) నియామకానికి ప్రకటన ఇవ్వడం గమనార్హం. రూ.164 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో సమన్వయం చేసేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. 12 నెలలపాటు కన్సల్టెన్సీ సేవలు అందించాలి. ప్రస్తుతం రుషికొండ మీద పనులు వేగంగా సాగుతున్నాయి. ఆరు భవనాల నిర్మాణం చేపట్టారు. కొన్ని పనులు చివరి దశకు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కోసం ఏపీటీడీసీ సూచనలతో తయారు చేసిన అంచనాలు, ఫ్లోర్‌ ప్లాన్లను పీఎంసీ ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. పనుల ప్రగతిపై ప్రతి నెలా నివేదికతో పాటు మూడు నెలలకు ఒకటి, ప్రాజెక్టు ముగిశాక ముగింపు నివేదికను సమర్పించాలి. నిబంధనల ప్రకారం పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలిస్తూ అవసరమైన అన్ని రకాల అనుమతులు వచ్చేలా చూడాలి. ఇంటీరియర్‌ డిజైన్లు, ఆర్కిటెక్చరల్‌ పనులకు ప్రత్యేకంగా నియమించిన కన్సల్టెంట్లను పీఎంసీ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అనుమతులు తీసుకునే క్రమంలో ఏపీటీడీసీకి సహకారం అందించాలి. గుత్తేదారుకు అదనంగా స్థలం అవసరమైతే దాన్ని అన్ని రకాల అనుమతులతో సమకూర్చాలి. ప్రస్తుతం వినియోగిస్తున్న స్థలంతో పాటు మరికొంత స్థలాన్నీ తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని