సంక్షిప్త వార్తలు(11)
ముఖ్యమంత్రి జగన్ ఈనెల 28న విశాఖలో పర్యటించనున్నారు. ఆ రోజు పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠం వెళతారు.
28న సీఎం జగన్ విశాఖ పర్యటన
విశాఖపట్నం (వన్‌టౌన్), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్ ఈనెల 28న విశాఖలో పర్యటించనున్నారు. ఆ రోజు పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠం వెళతారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో 12.30 గంటల వరకు పాల్గొంటారు. తర్వాత శారదాపీఠం నుంచి బయలుదేరి అక్కయ్యపాలెంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి కుమారుడి వివాహ విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం రుషికొండలోని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి వెళతారు. ఇటీవల పెళ్లైన ఎంపీ కుమారుడు శరత్ చౌదరి, కోడలు జ్ఞానితలను సీఎం ఆశీర్వదిస్తారు. అనంతరం కొత్త దంపతులు ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ నాయుడు, దివ్యలను అభినందిస్తారు. తరువాత విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు.
18 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 18 మంది డీఎస్పీలకు ప్రభుత్వం అదనపు ఎస్పీలుగా పదోన్నతులు కల్పించింది. స్క్రీనింగ్ కమిటీ సిఫార్సుల మేరకు వైబీటీఏ ప్రసాద్, ఎస్.ఆర్.రాజశేఖర్‌బాబు, ఆర్.రాఘవేంద్ర, జేవీ భాస్కర్‌రావు, ఆర్.శ్రీహరిబాబు, ఎస్.ఖాదర్‌బాషా, గరుగుబెల్లి ప్రేమ్ కాజల్, షేక్ మౌసమ్ బాషా, జె.తిప్పేస్వామి, గుంటుపల్లి శ్రీనివాసరావు, ఎన్.విష్ణు, జీవీ రమణమూర్తి, బి.ఉమామహేశ్వరరావు, ఎల్.సుధాకర్, కె.ప్రవీణ్‌కుమార్, సీహెచ్.సురేష్, ఎస్కే చంద్రశేఖర్, ఆర్.విజయ భాస్కర్‌రెడ్డిలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించనుంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులిచ్చారు.
వాణిజ్య పన్నుల శాఖలో నలుగురిపై వేటు
ఈనాడు, అమరావతి: పన్ను ఎగవేతలో ఏజెన్సీలకు సహకరించారని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు చెందిన విజయవాడ డివిజన్-1 కార్యాలయ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన నలుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో పది మంది ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ/డిప్యుటేషన్‌పై పంపింది. ఈ పరిణామాలు వాణిజ్య పన్నుల శాఖలో సంచలనం సృష్టించాయి. 2021 ఏప్రిల్‌లో మీడియాలో వచ్చిన కథనాలు, సీఎం కార్యాలయానికి అందిన ఫిర్యాదులపై వాణిజ్య పన్నుల శాఖ విచారణ చేసి, గత నెల 19న అందచేసిన నివేదికను అనుసరించి సోమవారం ఈ చర్యలను తీసుకుంది. వీరిలో జీఎస్టీవోలుగా పనిచేసిన కె.సంధ్య, జీఆర్‌వీ ప్రసాద్, మెహర్కుమార్తోపాటు సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ ఉన్నారు.
మాదేమైనా ఉగ్రవాద సంస్థా?
ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో అధికారులను కలవకుండా ఉండటానికి తమదేమైనా నిషేధిత సంస్థా? లేక ఉగ్రవాద.. మావోయిస్టు సంస్థా అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రశ్నించారు. మంగళవారం ఉద్యోగ సంఘ నేతలతో కలిసి సచివాలయానికి వచ్చిన సూర్యనారాయణను.. వాణిజ్య పన్నులశాఖలోని ఉద్యోగుల సస్పెన్షన్ వ్యవహారంపై అధికారులను కలిసేందుకు వచ్చారా అని విలేకరులడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. ఉద్యోగుల సస్పెన్షన్ వ్యవహారంపై జీఏడీ అధికారుల్ని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సచివాలయానికి వచ్చారని ప్రచారం జరిగింది. సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో అధికారుల్ని కలిసి వెనుదిరిగి వెళుతున్న సమయంలో మీడియా ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా తిరస్కరించారు. ‘సాధారణ వ్యవహారాల్లో భాగంగానే సచివాలయానికి వచ్చాం. ఏదో ఒక విషయంపై అధికారుల్ని కలుస్తూనే ఉంటాం. అధికారుల్ని కలవకుండా ఎలా ఉంటాం? మాదేమైనా నిషేధిత సంస్థా? లేక ఉగ్రవాద.. మావోయిస్టు సంస్థా’ అని ఎదురు ప్రశ్న వేశారు.
ఆప్కో ఛైర్మన్‌గా గంజి చిరంజీవి
ఈనాడు డిజిటల్, అమరావతి: ఆప్కో ఛైర్మన్‌గా మంగళగిరికి చెందిన వైకాపా నేత గంజి చిరంజీవిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ఆరు నెలలపాటు పదవిలో కొనసాగనున్నారు. లేదా అపెక్స్ బోర్డుకు ఎన్నికలు జరిగే వరకూ ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆప్కో ఛైర్మన్ పదవి గతేడాది డిసెంబరు 30వ తేదీ నుంచి ఖాళీగా ఉంది. గంజి చిరంజీవి ఇటీవలే తెదేపా నుంచి వైకాపాలో చేరారు. ఆయనకు పార్టీ చేనేత విభాగం అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. వెనువెంటనే ఆప్కో ఛైర్మన్‌గానూ నియమించారు.
నేడు పశువైద్య అంబులెన్సుల ప్రారంభం
ఈనాడు, అమరావతి: వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ కింద రెండో దశలో 165 పశు అంబులెన్సులు బుధవారం నుంచి సేవలు అందించనున్నాయి. బుధవారం క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ జెండా ఊపి వీటిని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద మొత్తం రూ.240.69 కోట్ల వ్యయంతో 340 అంబులెన్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలి దశలో ప్రారంభమైన 175 వాహనాలు ఇప్పటికే సేవలందిస్తున్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఉద్యోగుల హాజరు తనిఖీకి డ్యాష్‌బోర్డు
ఈనాడు, అమరావతి: ఉద్యోగుల హాజరు నమోదును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం రాష్ట్రస్థాయి డ్యాష్‌బోర్డును అమల్లోకి తెచ్చింది. యాప్ ద్వారా ఉద్యోగులు వేసే హాజరు డ్యాష్‌బోర్డుకు చేరుతుంది. వీటిని అయా విభాగాధిపతులు పరిశీలిస్తారు. విభాగాధిపతులు, అధికారులకు డ్యాష్‌బోర్డులో తనిఖీలకు అనుమతి కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. సిబ్బంది హాజరు పరిశీలనకు దీన్ని వినియోగించాలని సూచించింది. పాఠశాల విద్యాశాఖ, ఆరోగ్య, వైద్య, కుటుంబసంక్షేమ శాఖ, గ్రామ, వార్డు వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం వినియోగిస్తున్న ముఖగుర్తింపు ఆధారిత హాజరు యాప్ ద్వారానే హాజరువేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతులు, జిల్లా కార్యాలయాల్లో ముఖగుర్తింపు ఆధారిత హాజరు నమోదుకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ యాప్ హాజరును నుంచి వెసులుబాటు కల్పిస్తూ ప్రస్తుతం ఆయా విభాగాలు రూపొందించుకున్న యాప్ ద్వారానే నమోదు చేసేందుకు అవకాశం కల్పించింది. తుదిపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ విభాగాలు సొంత యాప్ ద్వారానే హాజరు నమోదుచేయాలని సూచించింది.
పుల్లరిన్పై పరిశోధనకు ఐఎంఎంటీతో ఏపీఎండీసీ ఒప్పందం
తక్కువ గ్రేడ్ ముగ్గురాయి శుద్ధీకరణపైనా దృష్టి
ఈనాడు, అమరావతి: అన్నమయ్య జిల్లాలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి చెందిన మంగంపేట ముగ్గురాయి గనుల్లో తవ్వితీసే బ్లాక్ షెల్ నుంచి పుల్లరిన్ను వెలికితీయడంపై పరిశోధనలు, తక్కువ గ్రేడ్ ముగ్గురాయి శుద్ధీకరణకు సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (ఐఎంఎంటీ)తో ఒప్పందం జరిగింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన ఐఎంఎంటీతో ఈ మేరకు ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి మంగళవారం భువనేశ్వర్‌లో ఒప్పందం చేసుకున్నారు. పుల్లరిన్ ఖనిజాన్ని ఏరోస్పేస్, డిఫెన్స్, బయోమెడికల్ రంగాల్లో వినియోగిస్తారని, మార్కెట్లో దీనికి అధికధర లభిస్తుందని వెంకటరెడ్డి తెలిపారు. పుల్లరిన్ పరిశోధనలు విజయవంతమైతే ఏపీఎండీసీకి, ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తక్కువ గ్రేడ్ ముగ్గురాయిని శుద్ధీకరణ చేయడం ద్వారా, దీనిని అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసుకునేందుకు వీలుందని తెలిపారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐఎంఎంటీ అధికారులు ఎల్కే సాహు, సి.ఈశ్వరయ్య, శివకుమార్, ఏపీఎండీసీ జీఎం బోస్ తదితరులు పాల్గొన్నారు.
ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ పునఃప్రారంభం
ఈనాడు, అమరావతి: ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ బుధవారం నుంచి పునఃప్రారంభించనున్నట్లు కన్వీనర్ రామమోహన్‌రావు తెలిపారు. అక్టోబరులో కౌన్సెలింగ్‌కు ప్రకటన విడుదల చేయగా.. రిజిస్ట్రేషన్ల అనంతరం వాయిదా పడింది. వెబ్‌ఐచ్ఛికాల నమోదుకు 27వరకు అవకాశం కల్పించారు. వెబ్‌ఐచ్ఛికాల మార్పు 28న, సీట్ల కేటాయింపు 30న పూర్తి చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి మూడు లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఫిబ్రవరి ఒకటి నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
ఎన్ఐఐటీతో ఉన్నత విద్యామండలి ఒప్పందం
ఈనాడు, అమరావతి: దిల్లీకి చెందిన ఎన్ఐఐటీ ఫౌండేషన్ రూపొందించిన కోర్సులను ఉన్నత విద్యాసంస్థల్లో అమలు చేసేందుకు ఉన్నత విద్యామండలి మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఫౌండేషనల్, ఉపాధి కల్పించే కోర్సులను ఎన్ఐఐటీ రూపొందించింది. వీటిని అమలు చేయనున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఐఐటీ చీఫ్ అపరేషన్ అధికారి చారు కపూర్, కార్యదర్శి నజీర్ పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ రామమోహనరావు పాల్గొన్నారు.
ముఖ ఆధారిత గుర్తింపు హాజరు నుంచి కార్మికులను మినహాయించాలని వినతి
ఈనాడు-అమరావతి: పురపాలక, నగరపాలక సంస్థల్లో ప్రజారోగ్య, ఇంజినీరింగ్, తాగునీటి సరఫరా, ఇతర విభాగాల్లోని శాశ్వత, పొరుగు సేవల కార్మికులకు ముఖ ఆధారిత గుర్తింపు హాజరు నుంచి మినహాయించాలని రాష్ట్ర పురపాలక కార్మికులు, ఉద్యోగుల సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. స్మార్ట్ ఫోన్ల సదుపాయం అంతంత మాత్రంగా ఉన్న కార్మికులతో ముఖ ఆధారిత గుర్తింపు హాజరు ఎలా సాధ్యమని సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న కొద్దిమందికి కూడా వీటిపై సాంకేతికంగా తగిన అవగాహన లేదని ఆయన వివరించారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ముఖ ఆధారిత గుర్తింపు హాజరు నుంచి కార్మికులను మినహాయించి ..పాత విధానాన్నే అమలు చేయాలని పురపాలకశాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌కు సమాఖ్య ప్రధాన కార్యదర్శి మంగళవారం వినతిపత్రం ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Ravi Shastri: అశ్విన్.. అతి ప్రణాళికలు వద్దు
-
India News
చనిపోయాడనుకొని ఖననం చేశారు.. కానీ స్నేహితుడికి వీడియో కాల్!
-
Ap-top-news News
Andhra News: పన్నులు వసూలు చేసే వరకూ సెలవుల్లేవ్
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్‌లను ఆపిన యువకుడు