పోలీసులను ప్రభుత్వం ఎలా ఆదేశిస్తుంది?
సభలు, సమావేశాల నియంత్రణ విషయంలో పోలీసు చట్టంలోని సెక్షన్ 3ను ఆసరా చేసుకొని పోలీసులకు ఆదేశాలిచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు.
ప్రాథమిక హక్కుల్ని హరించే జీవో అది
జీవో 1పై హైకోర్టులో న్యాయవాదుల వాదనలు
తీర్పు రిజర్వు చేసిన ధర్మాసనం
ఈనాడు, అమరావతి: సభలు, సమావేశాల నియంత్రణ విషయంలో పోలీసు చట్టంలోని సెక్షన్ 3ను ఆసరా చేసుకొని పోలీసులకు ఆదేశాలిచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. సెక్షన్ 30 ప్రకారం ఆ అధికారం డీజీపీ, ఎస్పీలకు మాత్రమే ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో1 పౌరుల ప్రాథమిక హక్కులను హరించేదిగా ఉందని ఆరోపించారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వం తరఫు వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా (రిజర్వు) వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. వారంలోపు నిర్ణయం వెల్లడిస్తామంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. జీవో 1ను సవాల్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై మాజీమంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రుద్రరాజు, భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ, ఏఐఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఐఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు వ్యాజ్యాలు వేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, జంధ్యాల రవిశంకర్, న్యాయవాదులు టి.శ్రీధర్, ఎన్.అశ్వినీకుమార్, జవ్వాజి శరత్‌చంద్ర వాదనలు వినిపించారు. ‘ప్రతిపక్షాలకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకునేందుకు జీవో 1 తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్షాలు నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత సక్రమంగా నిర్వహించి ఉంటే తొక్కిసలాటలు జరిగేవి కాదు. షరతుల పేరుతో గొంతెత్తకుండా చేయాలనుకోవడం అప్రజాస్వామికం. 2008లో ప్రజారాజ్యం పార్టీ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి నలుగురు మృతి చెందారు. అప్పట్లో డీజీపీ సహేతుకమైన సర్క్యులర్ ఇచ్చారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోల నియంత్రణ అధికారం డీజీపీ, ఎస్పీలకు ఉంటుంది తప్ప.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. ‘కార్యక్రమాలకు అనుమతి ఇవ్వండి, ప్రత్యేక పరిస్థితులుంటే నిరాకరించండి’ అని పోలీసు చట్టం సెక్షన్ 30 చెబుతోంది. జీవో 1 అందుకు భిన్నంగా ‘అనుమతి నిరాకరించండి, ప్రత్యేక పరిస్థితులుంటేనే అనుమతించండి’ అని చెబుతోంది’ అని అన్నారు.
సీఎం పర్యటిస్తే బడులూ మూసేస్తున్నారు.. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా
తెదేపా మాజీమంత్రి కొల్లు రవీంద్ర తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. జీవో 1 జారీ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కుప్పం వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అదే ముఖ్యమంత్రి పర్యటన సాగే ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నారు. దుకాణాలను మూసేయిస్తున్నారు. ఇళ్ల ముందు పరదాలు కడుతున్నారు. అధికార పార్టీ విషయంలో ఒకలా ప్రతిపక్షాల విషయంలో మరోలా రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరిస్తోంది’ అన్నారు.
వెకేషన్ బెంచ్‌కు ఆ అధికారం ఉంది: న్యాయవాది అశ్వినీకుమార్
సీపీఐ నేత కె.రామకృష్ణ తరఫున న్యాయవాది ఎన్.అశ్వినీకుమార్ వాదనలు వినిపిస్తూ.. జీవో 1పై వెకేషన్ బెంచ్‌కు విచారణ చేసే అధికారం ఉంది. ఆ ఉత్తర్వులు విధానపరమైన నిర్ణయం, పరిపాలన సంబంధమైనవి కావు. అందువల్లనే వెకేషన్ బెంచ్ అత్యవసరంగా విచారణ జరిపింది’ అని వివరించారు.
పూర్తి నిషేధంవిధించలేదు: ఏజీ శ్రీరామ్
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ‘పోలీసు చట్టానికి లోబడే ఆ జీవో ఉంది. రహదారులపై ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలను పూర్తిగా నిషేధించలేదు. ఏ పార్టీనీ అడ్డుకోవడం లేదు. అనుమతి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తగిన ఉత్తర్వులిస్తాం’ అని తెలిపారు. లోకేశ్ పాదయాత్రకు అనుమతించినట్లు తెలిపారు.
* మరోవైపు రాజకీయ సమావేశాలకు/రోడ్ షోలకు రహదారులపై అనుమతి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కొట్టి బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన వ్యాజ్యంలో న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు.
నోటిఫికేషన్లో పేరాలు మిస్: సీజే
సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర స్పందిస్తూ.. వెకేషన్ సమయంలో విచారణ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్లో రెండు పేరాలు మిస్ అయ్యాయని తెలిపారు. బెంచ్ పైనుంచి ఇంతకుమించి ఏమి చెప్పలేనన్నారు. హైకోర్టుకు ఉన్న సర్వోన్నతాధికారాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు పరిస్థితిని చక్కదిద్దకపోతే భవిష్యత్తులో ఏపీ హైకోర్టుకు వచ్చే సీజేలు ఏదో ఒకరోజు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: పూజాహెగ్డే ‘వెడ్డింగ్ ఫీవర్’.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు
-
Politics News
YSRCP: ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిరూపిస్తా: వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sports News
IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే టెస్టు సిరీస్ ఆడటమా..?: ఆసీస్ క్రికెట్ దిగ్గజం
-
Movies News
Kantara: అందుకే ‘కాంతార’ ఆస్కార్‌కు నామినేట్ కాలేకపోయింది: విజయ్ కిరగందూర్
-
World News
Pakistan: పాకిస్థాన్‌పై మరో పిడుగు.. త్వరలో ఇంధన సంక్షోభం..!
-
Sports News
Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషభ్ పంత్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి ఎప్పుడంటే?