అదనపు వసూలు వాస్తవమే

తేమ, తరుగు తదితరాల పేరుతో రైతుల నుంచి ప్రతి క్వింటా ధాన్యానికి అదనంగా 3 నుంచి 6 కిలోలను రైస్‌మిల్లర్లు వసూలు చేస్తున్న మాట నిజమే.

Published : 25 Jan 2023 03:57 IST

క్వింటాల్‌కు 3 నుంచి  6 కిలోలు తీసుకుంటున్న మిల్లర్లు
రైతులకు హమాలీ, రవాణా ఛార్జీలూ ఇవ్వడం లేదు
విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌  విభాగం తనిఖీల్లో వెల్లడి

ఈనాడు, అమరావతి: తేమ, తరుగు తదితరాల పేరుతో రైతుల నుంచి ప్రతి క్వింటా ధాన్యానికి అదనంగా 3 నుంచి 6 కిలోలను రైస్‌మిల్లర్లు వసూలు చేస్తున్న మాట నిజమే. గోతాలూ సరిపడా ఇవ్వడం లేదు. రైతులకు హమాలీ, రవాణా ఛార్జీలూ ఇవ్వడం లేదు. విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లోనే ఈ విషయం వెల్లడైంది. మంగళవారం రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలోని 57 రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అందుతున్న సేవలపై విజిలెన్స్‌ బృందాలు తనిఖీ చేశాయి. రైతులతో మాట్లాడి పలు వివరాలను సేకరించాయి.

* శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం వండ్రాడ, విజయనగరం జిల్లా కోరుకొండ, కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగినపల్లి రైతు భరోసా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రతి 100 కిలోలకు అదనంగా 3 నుంచి 6 కిలోలు తీసుకుంటున్నట్లు రైతులు తెలిపారు.

* అనకాపల్లి జిల్లా కె.కోటపాడు, పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు, శ్రీకాకుళం జిల్లా వండ్రాడ, కృష్ణా జిల్లా కేసరపల్లి, చోడవరం, ఎన్టీఆర్‌ జిల్లా కొత్తూరు తాడేపల్లిలో గోతాలు సరిపడా ఇవ్వడం లేదని, ఇచ్చేవీ నాణ్యంగా లేవని రైతులు పేర్కొన్నారు.

* పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ, విజయనగరం జిల్లా కోరుకొండల్లో ధాన్యం రవాణా ఛార్జీలు చెల్లించడం లేదని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెం, ఏలూరు జిల్లా భీమడోలు మండలం సూరప్పగూడెంలో హమాలీ ఛార్జీలు ఇవ్వడం లేదని వివరించారు.

* వ్యక్తిగత వ్యవసాయ యంత్ర పరికరాలను రాయితీపై ఇవ్వాలని ప్రకాశం జిల్లా బింగినపల్లిలో రైతులు కోరారు. అదే జిల్లాలోని తాళ్లూరు, ముండ్లమూరుల్లో కియోస్క్‌ పని చేయడం లేదు.

* బాపట్ల జిల్లా తిమ్మరాజుపాలెం ఆర్‌బీకే పరిధిలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహించడం లేదు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు