డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమ కార్యాచరణ

‘పీఆర్‌సీలు ప్రకటించలేదు. 6 డీఏలు ఇవ్వలేదు. అన్ని భత్యాలు కలిపి ఏడాది కిందట రూ.400 కోట్లు ఉన్న బకాయిలు.. ప్రస్తుతం రూ.12 వేల కోట్లకు చేరాయి.

Updated : 25 Jan 2023 08:26 IST

ప్రభుత్వ తీరుపై  ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

తిరుమల, శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ‘పీఆర్‌సీలు ప్రకటించలేదు. 6 డీఏలు ఇవ్వలేదు. అన్ని భత్యాలు కలిపి ఏడాది కిందట రూ.400 కోట్లు ఉన్న బకాయిలు.. ప్రస్తుతం రూ.12 వేల కోట్లకు చేరాయి. ఇప్పటికీ చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి మానుకోకుంటే ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టక తప్పదు’ అని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చిన ఆయన దర్శనం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఉద్యోగులను సంక్షోభంలోకి నెట్టడాన్ని అడుగుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా పింఛను సవరణలు జరగలేదు. సచివాలయ ఉద్యోగుల విషయానికి వస్తే.. స్పౌజ్‌ ఉద్యోగుల విషయంలో చర్యల్లేవు. డీఏలు రాకున్నా పలువురు ఉద్యోగుల నుంచి ఆదాయపన్ను వసూలు చేస్తున్నారు. ఇకనైనా ఉద్యోగులు పడే కష్టాన్ని గుర్తించి, బకాయిలు విడుదల చేయాలి. ఆలస్యమైతే ఏపీ ఎన్జీవో ఎగ్జిక్యూటివ్‌ సమావేశం నిర్వహిస్తాం. ఏపీ ఐకాస పరిధిలోని 108 సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టేందుకు వెనుకాడబోం. మరో సంఘం నేతలు గవర్నర్‌ను కలవడాన్ని మేము తప్పుపట్టలేదు. మా సంఘంపై నోరుపారేసుకోవడం తగదని హితవు పలికాం’ అని వివరించారు. శ్రీనివాసరావు ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగుపడాలని శ్రీవారిని ప్రార్థించానని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని