ఆకలితో అదనపు తరగతులకు..!

ఒకవైపు సమీపిస్తున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు.. మరోపక్క పాఠశాలల్లో అదనపు తరగతులు.. ఒత్తిడి పెంచే ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందించడం లేదు.

Published : 25 Jan 2023 05:33 IST

పాఠశాలల పనివేళల తర్వాత ‘పది’కి అదనపు తరగతులు
అల్పాహారం అందించకపోవడంతో ఆకలితో విద్యార్థులు

ఈనాడు, అమరావతి: ఒకవైపు సమీపిస్తున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు.. మరోపక్క పాఠశాలల్లో అదనపు తరగతులు.. ఒత్తిడి పెంచే ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అందించడం లేదు. పిల్లలు ఆకలితోనే అదనపు తరగతులకు హాజరవుతున్నారు. చాలా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చుట్టుపక్కల 3, 4 కి.మీ. దూరం నుంచి విద్యార్థులు వస్తుంటారు. సాధారణంగా పాఠశాలల సమయం ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉంటుంది. పదో తరగతికి మాత్రం పరీక్షల సన్నద్ధత కోసమని ఉదయం గంట ముందు, సాయంత్రం అదనంగా గంటన్నర నుంచి 2 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. అంటే.. ఉదయం ఉదయం 7.30కు ఇంటి నుంచి వచ్చిన పిల్లలు తిరిగి వెళ్లేందుకు రాత్రి 6.30-7 గంటలవుతోంది. బడిలో ఒంటి గంటలోపే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ఆ తర్వాత 6 గంటలపాటు బడిలోనే ఉండే విద్యార్థులు.. సాయంత్రం అయ్యే సరికి నీరసపడిపోతున్నారు. ఆకలితో చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

సన్నద్ధతపైనే దృష్టి

గతంలో కొన్నిచోట్ల స్థానిక సంస్థలు, మరికొన్నిచోట్ల దాతల సాయంతో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించేవారు. ఈసారి ఇప్పటి వరకూ ఆ చర్యలు తీసుకోలేదు. స్థానిక సంస్థలు నిధుల సమస్యతో పట్టించుకోవడం లేదు. పాఠశాల విద్యాశాఖ నిధులివ్వడం లేదు. పాఠశాల విద్యకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నామంటున్న ప్రజాప్రతినిధులూ దృష్టిపెట్టడం లేదు. ఉత్తీర్ణత పెంచాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్న అధికారులూ సమస్యను పాఠశాలలపైనే వదిలేశారు. దీంతో ప్రధానోపాధ్యాయులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.

ఉత్తీర్ణతపైనే దృష్టి

గతేడాది పదోతరగతి ఉత్తీర్ణత 67.25%. 20ఏళ్లలో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం ఇదే. దీన్ని ఈ సారి పెంచాలని పాఠశాల విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే అదనపు తరగతులు పెట్టింది. విజయనగరం జిల్లాలో రోజూ ఉదయం పరీక్ష, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు సన్నద్ధతపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ, అల్పాహారం అందించాలనే విషయాన్ని ఎవరూ  పరిగణనలోకి తీసుకోవడం లేదు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు