ముంపు ముప్పు లేదు
పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముంపు ముప్పు ఉండబోదని, ఇప్పటికే అధ్యయనం పూర్తయిందని కేంద్ర జలసంఘం స్పష్టీకరించింది.
కేంద్రానికి ఇదే నివేదిస్తాం
పోలవరంపై కేంద్ర జలసంఘం స్పష్టీకరణ
రెండు రాష్ట్రాలూ సంయుక్త క్షేత్ర స్థాయి పరిశీలన జరపాలని సూచన
ప్రభుత్వంతో మాట్లాడి చెబుతామన్న ఏపీ ఈఎన్‌సీ
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముంపు ముప్పు ఉండబోదని, ఇప్పటికే అధ్యయనం పూర్తయిందని కేంద్ర జలసంఘం స్పష్టీకరించింది. మరోసారి ఈ విషయంపై అధ్యయనం చేసే అవకాశమే లేదని తేల్చిచెప్పింది. పోలవరం ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ముంపు ముప్పు ఉంటుందంటూ కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఆయా రాష్ట్రాలతో మాట్లాడి వారి అనుమానాలు నివృత్తి చేయాలని, పరిష్కారం కనుగొనాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో వరుసగా సమావేశాలు జరుగుతున్నాయి. బుధవారం కేంద్ర జలసంఘం ఛైర్మన్ కుష్వీందర్ ఓరా అధ్యక్షతన దిల్లీలో సాంకేతిక అంశాలపై భాగస్వామ్య రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, తెలంగాణ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేంద్రరావు, ఒడిశా ఇంజినీర్ ఇన్ చీఫ్ అశుతోష్ తదితరులు హాజరయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సమావేశంలో చర్చించిన అంశాలు ఇలా ఉన్నాయి. గోదావరికి ఇంతవరకూ గరిష్ఠంగా 36 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చిందని, 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలను అంచనా వేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని కుష్వీందర్ ఓరా స్పష్టంచేశారు. ఇప్పటికే కేంద్ర జలసంఘం పోలవరం ప్రాజెక్టు వల్ల వెనక్కు మళ్లే జలాల ప్రభావంపై అధ్యయనం పూర్తిచేసిందని తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని కేంద్రానికి నివేదిస్తామన్నారు. 2022 జులై, ఆగస్టు నెలల్లో గోదావరికి వచ్చిన వరద వల్ల భద్రాచలం, మణుగూరు, బూర్గంపాడుతో పాటు మరో ఆరు గ్రామాలు 891 ఎకరాలు ముంపులో చిక్కుకున్నాయన్న తెలంగాణ రాష్ట్ర వాదనను కేంద్ర జలసంఘం కొట్టేసింది. పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు ఆ స్థాయిలో ఉండబోదని, స్థానిక భౌగోళిక పరిస్థితుల వల్ల అలాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వాదిస్తున్నట్లుగా ఆ ప్రాంతాలు ఏవీ ముంపులో ఉండబోవన్నారు. ఇప్పటికే తాము పోలవరం జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పుడు ఎంతవరకు నీళ్లు నిల్వ ఉంటాయో సర్వేరాళ్లు ఏర్పాటుచేశామని చెప్పారు. తెలంగాణ అధికారులు వస్తే వాటిని చూపిస్తామని తెలిపారు. ఎక్కడైనా ప్రాంతాలు ఎఫ్‌ఆర్‌ఎల్ పరిధిలోకి వస్తుంటే వాటికి పునరావాసం కింద నిధులిచ్చి ఆ ప్రాంతాలను తీసుకుంటామని ఈఎన్‌సీ వెల్లడించారు. కిన్నెరసాని, ముర్రేడు వాగు సహా 36 స్థానిక పథకాలకు ముంపు ప్రభావం ఉందని తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేంద్రబాబు పేర్కొన్నారు. ముంపు ప్రభావంపై అధ్యయనం చేశామని, కిన్నెరసాని, ముర్రేడు వాగులపై ఉన్న ప్రభావంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు నివేదించామని ఏపీ ఈఎన్‌సీ పేర్కొన్నారు. కేంద్ర జలసంఘం సీఈవో కుష్వీందర్ ఓరా మాట్లాడుతూ రెండు రాష్ట్రాల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని అన్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు ఆయన సూచించారు. తమ ప్రభుత్వంతో మాట్లాడి ఈ విషయంపై తెలియజేస్తామని ఏపీ ఈఎన్‌సీ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: భర్త నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు
-
Crime News
Crime News: చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
-
Ap-top-news News
Andhra News: నారాయణ.. వాలంటీర్ ఇవన్నీ విద్యార్హతలేనట!