వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీలో ఒరిజనల్ డిగ్రీ పట్టాల్లేవు
ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరు మార్పునకు తగ్గట్లుగా ఒరిజనల్ డిగ్రీ (ఓడీ) పట్టాలు సిద్ధం చేయనందున పలువురు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
వారంలోగా పరిష్కరిస్తాం: విశ్వవిద్యాలయం
ఈనాడు, అమరావతి: ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరు మార్పునకు తగ్గట్లుగా ఒరిజనల్ డిగ్రీ (ఓడీ) పట్టాలు సిద్ధం చేయనందున పలువురు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయానికి ఉన్న ఎన్టీఆర్ పేరు తొలగించి... డాక్టర్ వై.ఎస్.ఆర్.పేరును చేర్చిన విషయం విదితమే. ఈ నిర్ణయానికి తగ్గట్లుగా మార్కుల మెమోలు, ఒరిజనల్ డిగ్రీ పట్టాలపై ముద్రించిన ‘ఎన్టీఆర్’ పేరులో మార్పు జరగాల్సి ఉంది. ఆ మేరకు ముద్రణ జరగనందున పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ పట్టాలతో పాటే స్టడీ, మైగ్రేషన్ ధృవీకరణ పత్రాలు, ఇతర వాటి కోసం కూడా దరఖాస్తు చేస్తున్నారు. ముఖ్యంగా నిర్ణీత తేదీల్లో విదేశాలకు వెళ్లాలనుకున్న విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఈ వర్సిటీ నుంచి ఎంబీబీఎస్, ఇతర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల్లో కొందరు ఒరిజనల్ పట్టాలు తీసుకోలేదు. వారు ప్రస్తుతం దరఖాస్తు చేసుకుంటే జారీ చేయలేని పరిస్థితి నెలకొంది. మరో వారంలో ఈ సమస్య పరిష్కారమవుతుందని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. ముద్రణ పరంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యల వల్ల జాప్యం జరిగిందని వివరణ ఇచ్చాయి.
మార్కుల మెమోల తేడాపై ఆందోళన
ఎంబీబీఎస్, పీజీ, హోమియో, యునాని, ఆయుర్వేద, తదితర కోర్సులకు సంబంధించి సుమారు 20వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. ఈ విశ్వవిద్యాలయ అనుబంధ వైద్య విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఆరోగ్య విశ్వవిద్యాలయం సెమిస్టర్, వార్షిక పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరం (2022-23) ముగింపులో తుది పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుతో డిగ్రీ పట్టాలు జారీ చేయాలి. వీరికి తుది వార్షిక పరీక్షలు త్వరలో జరుగుతాయి. అయితే.. 2021-22 విద్యా సంవత్సరం వరకు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరుతో ఉన్న మార్కుల మెమోలను విశ్వవిద్యాలయం జారీ చేసింది. చివరి సంవత్సరం మార్కుల మెమో వైఎస్సార్ పేరుతో, అంతకుముందు ఉన్న మార్కుల మెమోలు ఎన్టీఆర్ పేరుతో ఉండడం వల్ల ఉన్నత విద్య, ఉద్యోగాల్లో చేరేటప్పుడు, ముఖ్యంగా విదేశాల్లో చదవాలనుకునే వారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిపై ఆయా సంస్థలు వివరణ అడిగితే తాము నిర్థారిస్తామని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. విశ్వవిద్యాలయం పేరు మార్పు గురించి ఇప్పటికే జాతీయ వైద్య కమిషన్‌కు తెలియబరిచినట్లు పేర్కొన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vijay: నిజమే విజయ్‌తో నాకు మాటల్లేవు కానీ..
-
Politics News
Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్ భేటీ
-
General News
KTR: ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: భర్త నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?