సింగరేణి నుంచి 3 ఎంటీల బొగ్గు

ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు ఒడిశాలోని మహానది కోల్‌ ఫీల్డ్స్‌ (ఎంసీఎల్‌) నుంచి తీసుకునే బొగ్గు కోటాలో 3 మిలియన్‌ టన్నులను (ఎంటీ) సింగరేణికి బదిలీ చేసింది.

Published : 26 Jan 2023 05:00 IST

జెన్‌కోకు కోల్‌ ఇండియా అనుమతి

ఈనాడు, అమరావతి: ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు ఒడిశాలోని మహానది కోల్‌ ఫీల్డ్స్‌ (ఎంసీఎల్‌) నుంచి తీసుకునే బొగ్గు కోటాలో 3 మిలియన్‌ టన్నులను (ఎంటీ) సింగరేణికి బదిలీ చేసింది. దీనికి అనుగుణంగా కోల్‌ ఇండియా అనుమతి తీసుకుంది. బొగ్గు రవాణా ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు.. తక్కువ వ్యవధిలో విజయవాడ వీటీపీఎస్‌కు బొగ్గు తీసుకొచ్చే వెసులుబాటు జెన్‌కోకు లభిస్తుంది. ప్రస్తుతం ఎంసీఎల్‌ నుంచి 8 ఎంటీలు, సింగరేణి నుంచి 3.88 ఎంటీల బొగ్గును కోల్‌ ఇండియా కేటాయించింది. ఒడిశా నుంచి రైలు మార్గంలో వీటీపీఎస్‌కు బొగ్గు చేరడానికి సుమారు 2.5 రోజులు పడుతోంది. ఈ కారణంగా ఎంసీఎల్‌ నుంచి కేటాయించిన బొగ్గులో ఏటా 60 శాతానికి మించి తీసుకోవడం సాధ్యం కావడం లేదు. అదనపు రేక్‌ల కోసం రైల్వే శాఖతో సంప్రదింపులు జరిపినా ఫలితం లేదు. ఈ దృష్ట్యా వీటీపీఎస్‌కు దగ్గరగా ఉన్న సింగరేణి నుంచి బొగ్గు తీసుకోవాలని జెన్‌కో నిర్ణయించింది. దీని వల్ల ఉదయం అక్కడ లోడింగ్‌ చేసినా సాయంత్రానికి ప్లాంటుకు బొగ్గు చేరుతుంది. గతంలో 40 శాతం ప్రీమియం ధరకు బొగ్గు తీసుకోవడం వల్ల పడే అదనపు భారం కూడా తగ్గుతుందని అధికారులు తెలిపారు. గతంలో ఏటా సుమారు 5 ఎంటీల బొగ్గును సింగరేణి నుంచి ప్రీమియం ధరకు జెన్‌కో కొనుగోలు చేసింది.

టన్నుకు రూ.980 ఆదా

ఒడిశా నుంచి తీసుకునే బొగ్గుకు టన్నుకు రూ.1,880 వంతున జెన్‌కో చెల్లిస్తోంది. రైల్వే రవాణా ఖర్చుల కింద టన్నుకు రూ.2 వేల వరకు ఖర్చవుతోంది. దీని వల్ల టన్ను బొగ్గుకు రూ.3,880 వంతున ఖర్చు చేయాల్సి వస్తోంది. అదే సింగరేణి నుంచి టన్నుకు రవాణా ఖర్చుల కింద రూ.700 వరకు చెల్లిస్తే సరిపోతుంది. బొగ్గు ధర రూ.2,200 కలిపినా.. టన్నుకు రూ.2,900 వంతున చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రకారం టన్నుకు రూ.980 ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు