తెల్లబోయిన నల్లబల్ల!

ఉపాధ్యాయుల పదోన్నతులు, సర్దుబాటులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో కొన్ని జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలల్లో పాఠాలు చెప్పేందుకు గురువులే లేకుండాపోయారు.

Published : 26 Jan 2023 05:00 IST

వివిధ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పరిస్థితి తీవ్రం

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల పదోన్నతులు, సర్దుబాటులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో కొన్ని జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలల్లో పాఠాలు చెప్పేందుకు గురువులే లేకుండాపోయారు. నిబంధనల ప్రకారం 70% పదోన్నతులు, 30% నేరుగా నియామకాలు చేపట్టాలి. ఇందుకు విరుద్ధంగా 100% పదోన్నతులతో భర్తీ చేశారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే ఎస్జీటీల కొరత ఉంది. ఇలాంటిచోట వందశాతం పదోన్నతులు నిర్వహించడంతో అనేక పాఠశాలలు ఖాళీ అయ్యాయి. పదోన్నతులు, బదిలీలకు సంబంధించి న్యాయస్థానంలో కేసులు ఉన్నందున సర్దుబాటు పేరిట దీన్ని పూర్తి చేస్తున్నారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలోని ఉన్నత, ప్రాథమికోన్నత బడులకు తరలించింది. సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉండడంతో ఎస్జీటీలకు వందశాతం పదోన్నతులు కల్పించారు. ఇప్పుడు చాలా జిల్లాల్లో ప్రాథమిక స్థాయిలో పాఠాలు చెప్పేవారే కరవయ్యారు.

ఎక్కడి నుంచి తెస్తారు?

రాష్ట్రవ్యాప్తంగా 12 వేల మంది స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు అవసరం అవుతాయని అధికారులు గుర్తించారు. ఇందులో 70% పదోన్నతులను గత ఏడాది అక్టోబరులోనే కల్పించారు. అప్పటికీ చాలాచోట్ల సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. దాంతో తాజాగా మిగతా 30శాతానికి పదోన్నతులు ఇచ్చారు. వీరందర్నీ 27న కొత్త బడుల్లో చేరిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. తెలుగు, హిందీ పండితుల పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నందున ఇంకా కొన్నిచోట్ల ఉపాధ్యాయులు మిగిలారు. ఈ సబ్జెక్టులకూ పదోన్నతులు కల్పించి ఉంటే మరిన్ని పోస్టులు ఖాళీ అయ్యేవి. ఒకేసారి పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు లేకుండా పోతుండడంతో క్షేత్రస్థాయిలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తాత్కాలికంగా సర్దుబాటు చేయాలని, లేదంటే డీఎస్సీ-98 వారికి వెంటనే పోస్టింగులు ఇచ్చి ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు వినతిపత్రాలు సమర్పించాయి. కొన్ని జిల్లాల్లో ఎస్జీటీల కొరత ఉన్నందున ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది.

భారీగా పెరిగిన ఏకోపాధ్యాయ బడులు

ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతుల తరలింపు, పదోన్నతులు కారణంగా ఏకోపాధ్యాయ బడుల సంఖ్య భారీగా పెరిగింది. 1-5 తరగతులు ఉండే బడుల నుంచి 3, 4, 5 తరగతుల వారు వెళ్లిపోవడంతో విద్యార్థుల సంఖ్యా తగ్గిపోయింది. విద్యార్థులు 20లోపు ఉంటే ఒకే టీచర్‌ను ఇచ్చారు. దీంతో అప్పటివరకు ఉన్న రెండో పోస్టు పోయింది. ఎస్జీటీలకు పదోన్నతుల కారణంగా కొన్ని బడుల్లో ఒక్కొక్కరే మిగిలారు. రాష్ట్రంలో 2020లో ఏకోపాధ్యాయ బడులు 7,774 ఉండగా.. ఇప్పుడు వీటి సంఖ్య 10వేలకుపైగా చేరింది. ఇలాంటిచోట టీచర్‌ సెలవు పెడితే పక్కవారిని పంపించడం, లేదంటే బడికి సెలవు ఇవ్వడంలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం బరకాల, కడమలకల్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరేసి సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్జీటీ) ఉండగా.. అందరికీ స్కూల్‌ అసిస్టెంట్లు(ఎస్‌ఏ)గా పదోన్నతులు ఇచ్చారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాధపురం, జిల్లెడు బుడకల ప్రాథమిక బడుల్లో ఉన్న ఇద్దరేసి ఉపాధ్యాయులకూ పదోన్నతులు లభించాయి. వీరంతా ఈనెల 27న కొత్త పాఠశాలల్లో చేరిపోనున్నారు. ఇప్పుడా బడుల్లో పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులే లేరు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు