తూర్పు తీరాన 103 పక్షి జాతులు

సుదీర్ఘ సాగర తీరం.. గోదావరి పరీవాహక ప్రాంతం.. చిత్తడి నేలలు.. మడ అడవులు.. పచ్చదనం పరవళ్లు.. ఇదీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రత్యేకత.

Updated : 26 Jan 2023 05:38 IST

తాజా గణనలో వెల్లడి
39,816 వలస పక్షుల గుర్తింపు

ఈనాడు, కాకినాడ - న్యూస్‌టుడే, తాళ్లరేవు: సుదీర్ఘ సాగర తీరం.. గోదావరి పరీవాహక ప్రాంతం.. చిత్తడి నేలలు.. మడ అడవులు.. పచ్చదనం పరవళ్లు.. ఇదీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రత్యేకత. అందుకే ఏటా ఆహారాన్వేషణ, సంతానోత్పత్తి కోసం దేశ విదేశాల నుంచి వలస పక్షులు వస్తుంటాయి. ఏటా అక్టోబరు నుంచి మార్చి వరకు ఈ విహôగాల తాకిడి ఉంటుంది. ఈనెల 10న నీటి పక్షుల గణన- 2023 చేపట్టారు. 103 జాతులకు చెందిన 39,816 పక్షులను గుర్తించినట్లు కోరింగ వన్యప్రాణి విభాగం అటవీ క్షేత్ర అధికారి వరప్రసాద్‌ వెల్లడించారు. హోప్‌ ఐలాండ్‌, కోరమండల్‌ ఏరియా, ఏటిమొగ, మగసానితిప్ప, కోరింగ క్రీక్స్‌, గాడిమొగ, భైరవపాలెం, సాక్రిమెంట్‌ ఐలాండ్‌ తదితర ప్రాంతాల్లో పక్షుల గణన సాగింది. ముందుగా కోరింగ బయోడైవర్సిటీ కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నేషనల్‌ ఏషియన్‌ వాటర్‌ బర్డ్‌ సెన్సెస్‌ కో-ఆర్డినేటర్‌, బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్‌ఎస్‌) డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.సత్యసెల్వం, ఇండియన్‌ బర్డ్‌ కన్జర్వేషన్‌ నెట్‌వర్క్‌ (ఐబీసీఎన్‌) సమన్వయకర్త కె.మృత్యుంజయరావు, బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్‌ఎస్‌), వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ), జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ), డక్కన్‌ బర్డ్స్‌ నిపుణులతో అవగాహన కల్పించారు. జిల్లా అటవీశాఖ అధికారి రాజు, అటవీ క్షేత్ర అధికారి వరప్రసాద్‌ ఆధ్వర్యంలో కోరింగ అభయారణ్యంతోపాటు నీటి పక్షుల ఆవాస ప్రాంతాల్లో ఈ బృందాలు పర్యటించాయి. 12 బృందాలు సేకరించిన చిత్రాలు, గణన ఆధారంగా ఇక్కడి పక్షిజాతులపై ఓ అంచనాకు వచ్చారు.

తగ్గిన పక్షుల జాడ.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2017 నాటి గణనలో 43,718 వలస పక్షులు ఉన్నట్లు గుర్తిస్తే.. 2020 నాటికి ఆ సంఖ్య 26,734కి తగ్గింది. 2021లో 34,207 పక్షులను గుర్తిస్తే.. 2022లో ఆ సంఖ్య 46,546కి పెరిగినట్లు అటవీశాఖ వెల్లడించింది. తాజా గణనలో మళ్లీ ఆ సంఖ్య 39,816కి తగ్గింది. పక్షుల తాకిడి తగ్గడానికి అనేక ప్రతికూల పరిస్థితులు కారణంగా కనిపిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణగా నిలిచే మడ అడవులు ఇక్కడ విస్తారంగా ఉన్నాయి. కోరింగ రక్షిత అడవులు.. దానికి అనుసంధానంగా అటవీ ప్రాంతం ఉంది. మడ అడవుల ధ్వంసం.. నిషేధిత ప్రాంతంలో నాటుసారా తయారీ స్థావరాలు పక్షులకు ఇబ్బందిగా మారాయి. కోనసీమలో సముద్ర తీరం.. మడ విస్తరించి ఉన్న చిత్తడి నేలల్లో అనధికార రొయ్యల చెరువులు వీటి సంచారానికి ప్రతికూలంగా మారాయి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు