జగనన్న మాట.. నీటిమూట

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటినా హంద్రీ నీవా డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి కాలేదు.

Published : 27 Jan 2023 05:04 IST

అధికారంలోకి వస్తే రెండేళ్లలో హంద్రీ - నీవా డిస్ట్రిబ్యూటరీలు నిర్మిస్తామని హామీ
మూడున్నరేళ్లలో తట్టెడు మట్టీ పోయలేదు
గతంలో తవ్విన కాలువల్లోనూ పెరిగిపోయిన కంపలు
రైతులే చందాలేసుకుని పనులు చేసుకుంటున్న వైనం
చాలినంత నీరూ ఇవ్వడం లేదు
మోటార్లు పెట్టి తోడుకోవడానికి అన్నదాతకు అదనపు ఖర్చు
బొమ్మరాజు దుర్గాప్రసాద్‌
అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి


హంద్రీ నీవా ప్రాజెక్టు తొలిదశలో మిగిలిపోయిన డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేస్తే ఒక్క అనంతపురం జిల్లాలోనే 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వచ్చు. ప్రాజెక్టు పూర్తి చేయకపోతే పోరాడతాం. లేదంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్ల సమయం ఇవ్వండి.. హంద్రీనీవా పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తాం.

- 2017 ఫిబ్రవరి 6న అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన మహాధర్నాలో ప్రతిపక్ష నేతగా జగన్‌ ఇచ్చిన హామీ ఇది.


జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటినా హంద్రీ నీవా డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి కాలేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండేళ్లలోనే హంద్రీ నీవా డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పూర్తి చేసి నీళ్లిస్తామని ఘనంగా ప్రకటించిన జగన్‌ మాట నిలబెట్టుకోలేదు. తాను చెప్పిన గడువు తీరిపోయి దాదాపు రెండేళ్లవుతున్నా కనీసం ఆ పనులు ప్రారంభించనూ లేదు. ఈ మూడున్నరేళ్లలో పనుల్లో ఒక్క అడుగూ పడలేదు. పైగా జగన్‌ అధికారంలోకి వచ్చేసరికి కొద్ది మేర నిర్మించిన ఉప కాలువలు, పిల్ల కాలువల్లో కంపచెట్లు  పెరిగిపోయాయి. కొన్ని చోట్ల మట్టి పూడుకుపోయి నీళ్లు పారే పరిస్థితీ లేకుండా పోయింది. కొన్ని గ్రామాల రైతులు తామే చందాలేసుకుని కాలువను బాగు చేసుకుని పొలాలకు నీరు  మళ్లించే ఏర్పాట్లు చేసుకున్నారు.

హంద్రీ నీవా తొలి దశ కింద ఆయకట్టు సాగు చేయాల్సిన అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ‘ఈనాడు- ఈటీవీ’ ప్రతినిధులు పర్యటించి రైతులతో మాట్లాడినప్పుడు వారి మాటల్లో ఇదే ఆవేదన వినిపించింది. శ్రీశైలం జలాశయం నీటిని వివిధ దశల్లో ఎత్తిపోసి హంద్రీ నీవా సుజల స్రవంతి తొలి దశ కింద 1.98 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వడం లక్ష్యం. తొలిదశలో కృష్ణగిరి జలాశయంలో 0.161 టీఎంసీలు, పత్తికొండ జలాశయంలో 1.216, జీడిపల్లి జలాశయంలో 1.686 టీఎంసీలు నిల్వ చేసి కర్నూలు జిల్లాలో 80 వేల ఎకరాలకు, అనంతపురం జిల్లాలో 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలన్నది ప్రణాళిక. మొత్తం 14 టీఎంసీలు వినియోగించేలా ఈ పథకం నిర్మించారు. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయకపోవడంతో.. రూ.వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు ఫలాలు పూర్తిగా అందడం లేదు.

ఒక్క అడుగూ పడలేదు

వైకాపా ప్రభుత్వం వచ్చాక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంపిణీ కాలువలు, పిల్ల కాలువల పనులు నాలుగేళ్ల కిందట ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయని చెబుతున్నారు. చాలా మంది రైతులు ప్రధాన కాలువల నుంచి పైపులు వేసుకుని మోటార్లు పెట్టుకుని పొలాలకు నీళ్లు మళ్లించుకోవాల్సి వస్తోంది. ఫలితంగా అదనపు పెట్టుబడులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక చోట్ల పంపిణీ కాలువల నిండా పెద్ద పెద్ద ముళ్ల కంపలు, చెట్లు పెరిగిపోయాయి. కొన్ని చోట్ల అన్ని పంపులనూ నడిపించకపోవడంతో సరిపడా నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల పంపిణీ కాలువలపై వంతెనలు నిర్మించాల్సి ఉంది. కాలువ లైనింగు పనులు పూర్తి చేయాల్సి ఉంది. తాత్కాలికంగా చేసిన పనులను సరిదిద్ది నీరు తగినంతగా ప్రవహించేలా చూడాలి. 

నీళ్లున్నా ఇవ్వడానికి ఇబ్బందేనా!

శ్రీశైలంలో నిండుగా నీళ్లున్నా హంద్రీ నీవా ప్రధాన కాలువల కింద రైతులు సాగు ప్రారంభించినా తొలుత ప్రభుత్వం ఆయకట్టుకు నీళ్లివ్వలేదు. విద్యుత్తు బకాయిలు, ప్రాజెక్టు నిర్వహణ బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో ఈ పథకాన్ని పని చేయించకుండా వదిలేశారు. రైతులు ఆందోళన చేయడం, నవంబరు నెలలో ‘ఈనాడు’ కథనం ప్రచురించడంతో నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో సకాలంలో ప్రభుత్వం నీరివ్వకపోవడంతో పంటలు నష్టపోయిన రైతులూ ఉన్నారు. హంద్రీ నీవా ప్రధాన కాలువలతో పాటు ఉప కాలువల కింద కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సాగు చేసుకున్న దాదాపు 1.10 లక్షల ఎకరాల్లో పంట చేతికి అందాలంటే ఇంకా సమయం పడుతుంది. డిసెంబరు తర్వాత నీటి సరఫరా చేయబోమని నోటీసులిచ్చినా ప్రస్తుతానికైతే ఇస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు నీళ్లివ్వకపోతే ఆయకట్టుకు ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పంట చేతికొచ్చే వరకు నీళ్లివ్వడంతోపాటు వచ్చే ఏడాదికల్లా డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేసి, మొత్తం ఆయకట్టుకు జలాలు పారించాలని రైతులు కోరుతున్నారు.

మూడు ప్యాకేజీలు.. 1.18 లక్షల ఎకరాలు

అనంతపురం జిల్లాలో మూడు ప్యాకేజీల కింద 1,18,000 ఎకరాలకు నీళ్లందించేలా పనులు పూర్తి చేయాల్సి ఉంది. ప్యాకేజీ 33 కింద దాదాపు 20,574 ఎకరాలకు నీళ్లందించేందుకు డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువలు తవ్వాల్సి ఉంది. 2004లో పనులు అప్పగించారు. పనులు పూర్తి చేయకపోవడంతో తిరిగి 2016-17లో 33ఏ ప్యాకేజీగా మార్చి మళ్లీ టెండర్లు పిలిచారు. దాదాపు 60 శాతం పనులు పూర్తయిన తర్వాత 2019లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అప్పట్లో పని నిలుపుదల ఉత్తర్వులిచ్చిన తర్వాత ఈ పనులు మళ్లీ మొదలు కాలేదు. ఈ ప్యాకేజీ కింద పూర్తి స్థాయిలో నీళ్లిచ్చేందుకు అవసరమైన కాలువలు తవ్వాలంటే ఇంకా 30 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.
ఇందులోనే 34వ ప్యాకేజీలో 17,500 ఎకరాలకు నీళ్లిచ్చేలా పంపిణీ కాలువలు, పిల్ల కాలువల నిర్మించాలి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా 150 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.

* అనంతపురం జిల్లాలోనే 80,600 ఎకరాలకు సాగు నీరందించేలా 36వ ప్యాకేజీ కింద గతంలో పంపిణీ కాలువలు, పిల్ల కాలువలకు టెండర్లు పిలిచారు. 2015లో మళ్లీ వీటిని సవరించారు. ఆ రోజు నాటికి మిగిలి ఉన్న పనికి రూ.336 కోట్లు అవుతుందని గుర్తించి వాటిని రెండు ప్యాకేజీలుగా విడగొట్టి రూ.246 కోట్లు, రూ.60 కోట్లతో టెండర్లు పిలిచారు. 1400 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. భూసేకరణ, నిధుల చెల్లింపు సమస్యలతో పనులు ముందుకు సాగడం లేదు.

* పత్తికొండ జలాశయం కింద కర్నూలు జిల్లాలో 61 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉంది. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయకపోవడంతో దాదాపు 40 వేల ఎకరాలకు ఇంకా నీళ్లివ్వలేకపోతున్నారు. 28, 29 ప్యాకేజీల కింద డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి కాలేదు. 2020లో జీవో 365 కింద ఈ పనులను రద్దు చేశారు. ఆ జీవో ప్రకారం మళ్లీ అయిదేళ్ల వరకు అవి చేపట్టే అవకాశం లేదు. ప్రస్తుతం జలవనరులశాఖ అధికారులు ఈ డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసేందుకు రూ.180 కోట్లతో అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి నివేదించారు. హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టాలంటే జీవో 365 నుంచి మినహాయింపు అవసరమని ప్రభుత్వానికి లేఖ రాశారు.


మా ఊళ్లో నీళ్లు రాక వేరే ఊళ్లో కౌలు చేస్తున్నా
- ఎం.కె.గోవర్ధన్‌, చాబాల గ్రామం

మాది చాబాల గ్రామం. హంద్రీ నీవా కాలువలు పూర్తి చేయకపోవడంతో అక్కడ నాకున్న 9 ఎకరాల్లో సాగుకు ధైర్యం చేయలేకపోతున్నా. సమీపంలోనే ప్రధాన కాలువ ఉన్నా మాకు నీళ్లు రావడం లేదు. దీంతో ఛాయాపురంలో 9 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి కాలేదు. పైపులైను సాయంతో నీళ్లు తీసుకుని, మోటార్లతో తోడుకుంటూ సాగు చేస్తున్నాం. దీంతో కౌలు భరించాల్సి వస్తోంది. పెట్టుబడి పెరిగిపోతోంది.


కాలువ మేమే బాగు చేసుకున్నాం
- ఎన్‌.సుంకన్న, గడేహోతూరు, వజ్రకరూరు మండలం

హంద్రీ నీవా ప్రధాన కాలువ నుంచి నీరు మళ్లించే పంపిణీ కాలువల్లో కంపచెట్లు పెరిగిపోయాయి. మూడు, నాలుగు కిలోమీటర్ల మేర కంపలు తొలగించే పనిని 60 మంది రైతులం శ్రమదానంతో చేసుకున్నాం. ఈ పనులకు రూ.70 వేల వరకు ఖర్చయింది. పంపిణీ కాలువల నిర్మాణం పూర్తి చేయకపోగా.. తవ్వినవి పూడుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ కాలువ కింద నాకున్న 5 ఎకరాల్లో మిరప, శనగ సాగు చేశాను. ఫిబ్రవరి వరకు నీళ్లిస్తేనే పంటలు గట్టెక్కుతాయి.


రెండు పంపులతో నీళ్లు వదిలితే చాలట్లేదు
- ఈశ్వరయ్య, రైతు, గడేహోతూరు, వజ్రకరూరు మండలం

రాగులపాడు పంపుహౌస్‌ వద్ద మూడు పంపులతో ఇస్తేనే నీళ్లు వస్తున్నాయి. రెండు పైపుల నుంచి నీళ్లు వదలడంతో మాకు అందడం లేదు. పంపిణీ కాలువల్లో నీరు సరిగా రాకపోవడంతో రైతులమే అడ్డుకట్ట పెట్టి.. చందాలు వేసుకుని మోటార్లతో నీళ్లు తోడుకోవాల్సి వస్తోంది. అడ్డుకట్ట వేసి నీళ్లు తోడుకుంటుంటే కేసులు అంటున్నారు. పంపిణీ కాలువల్లో జనుము పేరుకుపోవడంతో ఇబ్బందవుతోంది.


ప్రధాన కాలువ పక్కనున్నా ఎకరాకు రూ.15 వేల ఖర్చు
- వడ్డే సురేష్‌, రైతు, కొనకచర్ల

హంద్రీ నీవా ప్రధాన కాలువ దగ్గర్లోనే ఉంది. పిల్ల కాలువలు తీయలేదు. దీంతో ప్రధాన కాలువ నుంచి పైపులైను వేసుకుని, మోటార్లు పెట్టుకుని నీళ్లు తోడుకుంటున్నాం. డీజిల్‌కు, నీళ్లు తోడుకునేందుకు మాకు ఎకరాకు రూ.15 వేలు అదనంగా ఖర్చవుతోంది. 


మా భూములకు ఇంకా పరిహారం ఇవ్వలేదు
- నారాయణస్వామి నాయక్‌, లత్తవరం తండా, ఉరవకొండ మండలం

హంద్రీ నీవా కాలువల కోసం మా భూములు తీసుకున్నారు. ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. ఇక్కడ కాలువలు పూర్తయితే మొత్తం నాలుగు చెరువులకు నీళ్లివ్వచ్చు. దీని వల్ల చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల మేర భూగర్భజలాలు రీఛార్జి అవుతాయి. ఆయకట్టు సాగుకు సులువవుతుంది. ఈ భూములకు సంబంధించి 32 మంది రైతులకు పరిహారం ఇవ్వకపోవడంతో పనులు సాగడం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని