43 నెలల్లో గ్రామ స్వరాజ్యం తెచ్చాం

దేశంలో మరెక్కడా లేని విధంగా 43 నెలల్లో తమ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిందని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు.

Published : 27 Jan 2023 05:03 IST

గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో ఇది సాకారమైంది
గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ఈనాడు, అమరావతి: దేశంలో మరెక్కడా లేని విధంగా 43 నెలల్లో తమ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిందని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుతో ఇది సాకారమైందని పేర్కొన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయ సంబంధాలతో ప్రమేయం లేకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సమానావకాశాలను కల్పిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.1.82 లక్షల కోట్లు జమ చేసినట్లు వివరించారు. అణగారిన వర్గాల తలరాతలు మార్చేలా ఇలాంటి ప్రయత్నాలేవీ గతంలో జరగలేదని చెప్పారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో గురువారం నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ... తమది మాటల ప్రభుత్వం కాదని, చేతలదని చెప్పారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు వివరించారు. మహిళా సాధికారత కోసం వైఎస్‌ఆర్‌ ఆసరా, వైఎస్‌ఆర్‌ చేయూత, జగనన్న అమ్మఒడి వంటి పలు పథకాలను తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లోనూ సంక్షేమాధారిత అభివృద్ధిని ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తామని వెల్లడించారు. సీఎం జగన్‌ సమర్థ నాయకత్వం, మానవీయ దృక్పథంతో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని వ్యాఖ్యానించారు.

పోలవరం పూర్తి చేస్తాం

‘పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధాన డ్యాం, కాలువ పనులు 78.64 శాతం పూర్తయ్యాయి. భూసేకరణ, పునరావాసం పనులు 22.11 శాతం అయ్యాయి. మార్చి నాటికి నాగావళి- వంశధార అనుసంధానం అవుతుంది. జూన్‌ నాటికి వంశధార ఫేజ్‌-2, స్టేజ్‌-2 పనులు పూర్తిచేశాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.15,548 కోట్ల వ్యయంతో బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టాం. వచ్చే ఏడాదికి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1ను అందుబాటులోకి తెస్తాం.

* 2019 జూన్‌ నుంచి 2022 డిసెంబరు 31 మధ్య.. రాష్ట్రంలో రూ.54,236 కోట్ల పెట్టుబడులతో 109 భారీ పరిశ్రమల స్థాపన జరిగింది. 71,856 మందికి ఉద్యోగాలు లభించాయి. స్థూల జాతీయోత్పత్తితో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) ఎక్కువగా ఉంది.

* జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటివరకూ 44.49 లక్షల మంది తల్లులకు రూ.19,167 కోట్లు అందించాం. 84 లక్షల మంది విద్యార్థులకు మేలు కల్పించాం. ఫలితంగా గత మూడేళ్లలో రాష్ట్రంలో స్థూలప్రవేశాల నిష్పత్తి బాగా పెరిగింది. 4,59,564 మంది విద్యార్థులు, 59,176 మంది ఉపాధ్యాయులకు రూ.668 కోట్ల విలువైన ట్యాబ్‌లు అందించాం. మనబడి-నాడునేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన వంటి పథకాల ద్వారా విద్యావ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం.

* రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యమిస్తోంది. వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా, పెట్టుబడి రాయితీ, పంట ఉత్పత్తుల కొనుగోలు, సున్నా వడ్డీ పంటరుణాలు వంటి పథకాల అమలుకు వీలుగా ఈ-క్రాప్‌ బుకింగ్‌ విధానం అమలు చేస్తున్నాం. రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోంది. 2023ను తృణధాన్యాల సంవత్సరంగా.. ఐక్య రాజ్యసమితి ప్రకటించింది. తదనుగుణంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించాం.

* ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.82 లక్షల కోట్లు జమచేశాం. అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకతతో అందించాం’ అని గవర్నర్‌ పేర్కొన్నారు.

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేస్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌. చిత్రంలో సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు