సర్పంచులకు మరో షాక్‌!

గ్రామ సచివాలయాలను పంచాయతీల పరిధిలో చేర్చి, వాటిలో పని చేస్తున్న ఉద్యోగులపై తమకు అధికారాలు కల్పించాలన్న సర్పంచుల డిమాండును ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

Published : 27 Jan 2023 05:03 IST

గ్రామ సచివాలయాల్లో కార్యదర్శులకు కీలక బాధ్యతలు

ఈనాడు, అమరావతి: గ్రామ సచివాలయాలను పంచాయతీల పరిధిలో చేర్చి, వాటిలో పని చేస్తున్న ఉద్యోగులపై తమకు అధికారాలు కల్పించాలన్న సర్పంచుల డిమాండును ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సచివాలయాలకు పంచాయతీలతో సంబంధం లేదని మొదటి నుంచీ చెబుతున్న ప్రభుత్వం... సర్పంచుల ఆధ్వర్యంలోని పంచాయతీ కార్యదర్శులకు సచివాలయాల నిర్వహణ, ఉద్యోగులపై పర్యవేక్షణ, ప్రత్యక్ష పరిశీలన, సమన్వయం వంటి కీలక బాధ్యతలను అప్పగించింది. గ్రామ స్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌డీజీ) సాధించేందుకు పంచాయతీ కార్యదర్శులకు... సచివాలయాల్లోని ఉద్యోగులు, వాలంటీర్లతో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై సమన్వయ బాధ్యతను కట్టబెట్టింది. ఈ మేరకు కార్యదర్శుల జాబ్‌ఛార్ట్‌ను తాజాగా సవరిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సమాంతర వ్యవస్థపై ఆందోళన

పరిపాలన, అధికార వికేంద్రీకరణ గురించి గొప్పగా చెబుతున్న ప్రభుత్వం పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసిందని కొందరు వైకాపా సర్పంచులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పంచాయతీల పరిధిలోనే గ్రామ సచివాలయాలను ప్రారంభించిన ప్రభుత్వం వాటిపై సర్పంచులకు ఎలాంటి అధికారం లేకుండా చూసుకుంది. ఉద్యోగులకు సెలవు మంజూరు అధికారాన్ని ప్రారంభంలో సర్పంచులకు కల్పించి... ఆ తరువాత రద్దు చేసింది. పంచాయతీలకు సంబంధం లేదంటూ ప్రత్యేకంగా సచివాలయాల శాఖను ప్రారంభించి, సర్పంచులను దూరం పెట్టింది.

నిర్వహణ ఖర్చుల కోసమే ఎత్తుగడ

పంచాయతీ కార్యదర్శులకు గ్రామ సచివాలయాల్లో కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇప్పటికీ అత్యధిక జిల్లాలోని సచివాలయాల నిర్వహణకు పంచాయతీల నిధులనే వాడుతున్నారు. స్టేషనరీ నుంచి ఇంటర్నెట్‌ ఛార్జీలు, ఇతర అత్యవసర పనులకు వాటిని వినియోగిస్తున్నారు. దీనివల్ల ఆడిట్‌ అభ్యంతరాలు వస్తున్నాయని కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే... కార్యదర్శులకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించినట్లు స్పష్టమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని