చేదోడుకు గడువు గండం

జగనన్న చేదోడు పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనీస గడువునూ ఇవ్వలేదు. మూడో విడత సాయం మంజూరు విషయంలో దరఖాస్తుకు ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకూ మూడే రోజుల సమయమిచ్చింది.

Updated : 27 Jan 2023 06:45 IST

దరఖాస్తుకు సమయమిచ్చింది 3 రోజులే
నిర్దేశిత సమయానికి 80 వేల మంది ధ్రువీకరణ పత్రాలు సమర్పించని వైనం
లబ్ధిదారుల్లో ఆందోళన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగనన్న చేదోడు పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనీస గడువునూ ఇవ్వలేదు. మూడో విడత సాయం మంజూరు విషయంలో దరఖాస్తుకు ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకూ మూడే రోజుల సమయమిచ్చింది. పాత లబ్ధిదారుల నుంచి వేలిముద్రల సేకరణ ఇదే సమయంలో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దరఖాస్తుల పరిశీలనకు గ్రామ, వార్డు సచివాలయాలకు శుక్రవారం మధ్యాహ్నం వరకూ గడువిచ్చింది. గతంలో ఈ ప్రక్రియ పూర్తికి వారం నుంచి 10 రోజుల సమయం ఇచ్చేది. మరోవైపు పాత లబ్ధిదారులు, కొత్త దరఖాస్తుదారులు కలిపి గురువారం రాత్రి 7 గంటల సమయానికి 80వేల మంది ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. లబ్ధిదారులు, కొత్త దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. దరఖాస్తుకు గడువు పొడిగించాలని వారు కోరుతున్నారు.

3 రోజుల్లో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తెచ్చేదెలా?: చేదోడు పథకం కింద దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఏటా ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో రెండో విడత కింద 2.85 లక్షల మందికి సాయం అందించింది. మూడో విడత సాయాన్ని ఈ నెల 30న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. పాత లబ్ధిదారులు, కొత్తగా దరఖాస్తు చేసినవారు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, లేబర్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంది. ఉన్న మూడు రోజుల గడువులోనూ గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యాలయాలకు సెలవు. ఇక రెండు రోజుల్లో వీటిని పొందేది ఎలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది దరఖాస్తు చేసుకున్నా మరికొందరు అర్హులు లబ్ధిని కోల్పోయే అవకాశాలున్నాయని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. పైగా మీసేవా కేంద్రాల నుంచి తీసుకున్నవి పథకానికి వర్తించబోవని లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయ అధికారులు చెబుతున్నారు. పాత లబ్ధిదారులు, కొత్త దరఖాస్తుదారులు కలిపి గురువారం రాత్రి 7 గంటల సమయానికి 2.92 లక్షల మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 1.79 లక్షల మంది దరఖాస్తులు సచివాలయాల స్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఎంపీడీవో లాగిన్‌లో 27వేలు,  జిల్లా బీసీ సంక్షేమశాఖ ఈడీ లాగిన్‌లో 5,500 వరకూ ఉన్నాయి. వీటన్నింటినీ కలెక్టరు ఆమోదించిన తర్వాత రాష్ట్ర స్థాయికి చేరతాయి. అక్కడ వారి వద్ద ఉన్న సమాచారంతో తనిఖీ చేసిన తర్వాతే అర్హుల సంఖ్య తేలుతుంది. ఇంకా 80వేల మంది ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని