హైకోర్టు తీర్పులనూ తెలుగులో అందుబాటులోకి తెస్తాం

సుప్రీంకోర్టు అడుగుజాడలను స్ఫూర్తిగా తీసుకుని ఏపీ హైకోర్టులో తీర్పులను తెలుగు భాషలో అందించేందుకు చర్యలు చేపడతామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర తెలిపారు.

Published : 27 Jan 2023 03:06 IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర

ఈనాడు, అమరావతి: సుప్రీంకోర్టు అడుగుజాడలను స్ఫూర్తిగా తీసుకుని ఏపీ హైకోర్టులో తీర్పులను తెలుగు భాషలో అందించేందుకు చర్యలు చేపడతామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర తెలిపారు. హైకోర్టు ఆవరణలో గురువారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీజే మాట్లాడుతూ... న్యాయస్థానాలిచ్చే తీర్పులు ప్రజల వాడుక భాషలో, వారికి అర్థమయ్యే రీతిలో లేకపోతే వాటికి అర్థమేలేదని, ఆంగ్లంలో చట్టపరమైన అంశాలు ఉండటంతో 99 శాతం మంది సామాన్య ప్రజలకు అర్థం కావడం లేదని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ఓ కార్యక్రమంలో చెప్పారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు తీర్పులను తెలుగులో అందుబాటులో తెచ్చేలా చర్యలు చేపట్టబోతున్నామని వెల్లడించారు. న్యాయ వ్యవస్థలో రికార్డుల డిజిటలైజేషన్‌, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) వ్యవస్థలను ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. విచారణలను వేగవంతం చేసేందుకు, న్యాయఫలాల్ని కక్షిదారులకు త్వరగా చేర్చేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని  పేర్కొన్నారు. 

భారీ స్థాయిలో పోస్టుల భర్తీకి చర్యలు

దేశంలోనే మొదటి సారిగా ఏపీ హైకోర్టు, దిగువ కోర్టుల్లో భారీ స్థాయిలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర చెప్పారు. మరో 3 నెలల్లో హైకోర్టులో 14 కోర్టు హాళ్లు అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. లక్ష పుస్తకాలతో గ్రంథాలయం, భారతదేశ కోర్టుల తీర్పులే కాకుండా విదేశీ లా జర్నళ్లను ‘ఈ లైబ్రరీ’ ద్వారా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. అంతకుముందు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకిరామిరెడ్డి, ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు, అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, వారి సతీమణులు, విశ్రాంత న్యాయమూర్తులు, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు