సంక్షిప్త వార్తలు (9)

అమరావతిపై హైకోర్టు గతేడాది మార్చిలో ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది.

Updated : 27 Jan 2023 06:04 IST

రాజధానిపై సుప్రీంలో మరో పిటిషన్‌

ఈనాడు, దిల్లీ: అమరావతిపై హైకోర్టు గతేడాది మార్చిలో ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది.  రాజధానిని రెండు లేదా మూడుగా విభజించే అధికారం శాసనసభకు లేదంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గతేడాది మార్చి మూడో తేదీన  ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని గుంటూరు జిల్లా పేరేచర్లకు చెందిన మస్తాన్‌ వలీ సుప్రీంలో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పలువురు రైతులు సుప్రీంకోర్టులో గతంలోనే పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై ఈ నెల 31న సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది.


సదరం శిబిరాల్లో స్లాట్లకు దివ్యాంగుల ఇక్కట్లు

ఈనాడు, అమరావతి: సదరం శిబిరాలు దివ్యాంగులకు చుక్కలు చూపిస్తున్నాయి. వైకల్య శాతం నిర్ధారించి, వైద్యులు జారీ చేసే ధ్రువపత్రాల కోసం వారు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా ఈఎన్‌టీ, నేత్ర, ఆర్థో, మానసిక రుగ్మతల వైకల్య శాతాన్ని నిర్ధారించే సదరం శిబిరాల్లో 3 నెలలకోసారి బుకింగ్‌ ప్రారంభం కాగానే ఈఎన్‌టీ, ఆర్థో విభాగాల్లో స్లాట్‌ దొరకడం లేదు. తొలి ప్రయత్నంలో వెనకబడినవారు అదనంగా 2 సార్లు దరఖాస్తు చేసుకునే వీలున్నా చాలా మందికి తెలియక ధ్రువపత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో 171 ఆసుపత్రుల్లో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో ఈఎన్‌టీ పరీక్షలు జరుగుతున్నాయి. దీనివల్ల ఈఎన్‌టీ పరీక్షలకు స్లాట్లు దొరకడం లేదు.తొలి పరీక్షలో వైద్యులు కేటాయించిన ‘శాతం’పై సంతృప్తి చెందనివారు 2 సార్లు అప్పీలు చేసుకోవచ్చు. తొలి పరీక్ష జరిగిన మరుసటి రోజు నుంచే అప్పీల్‌ చేసుకోవచ్చు. తొలి సదరం ఐడీ నంబరు ద్వారా ఆన్‌లైన్‌లోనే స్లాట్‌ పొందొచ్చు. ఈ రెండుసార్లూ తిరస్కరణకు గురైతే అలాంటి వారికి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించరు. ఈలోగా అత్యవసరంగా వైకల్య ధ్రువపత్రం కావాల్సి వస్తే ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సిఫార్సుతో అదనంగా సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది.


స్కానింగ్‌ సేవలు కొనసాగుతున్నాయి  

ఈనాడు, అమరావతి: ప్రభుత్వాసుపత్రుల్లో సీటీ స్కాన్‌, ఎక్స్‌రే సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయని వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వం నుంచి బిల్లుల బకాయిల చెల్లింపులు జరగనందున ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ సేవలను ప్రైవేట్‌ సంస్థ నిలిపేసినట్లు ‘ఈనాడు’లో బుధవారం కథనం ప్రచురితమైంది. దీనిపై కమిషనర్‌ స్పందిస్తూ... జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా బిల్లులను చెల్లిస్తున్నామని, స్కానింగ్‌ సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు.


ప్రొఫెసర్లుగా 125 మందికి పదోన్నతి

బోధనాసుపత్రుల్లో అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారిలో 125 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు ఇంఛార్జి డీఎంఈ వినోద్‌కుమార్‌ తెలిపారు. తొలి విడతలో 67 మందికి ఈ నెల 29న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లలో అర్హులకు అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రాథమిక జాబితాను సిద్ధం చేశామన్నారు.


శాసన మండలి, శాసనసభ ఆవరణలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

ఈనాడు, అమరావతి: వెలగపూడిలోని అసెంబ్లీ భవనంలో ఉన్న శాసనమండలి, శాసనసభల ముందు గురువారం గణతంత్ర వేడుకలను నిర్వహించారు. శాసనమండలి వద్ద ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు, శాసనసభ వద్ద స్పీకర్‌ తమ్మినేని సీతారాం జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలదండ వేసి నివాళి అర్పించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. కార్యక్రమంలో శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు, ఉప కార్యదర్శులు రాజకుమార్‌, జయరాజు, జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


ప్రజల చేతుల్లోనే సార్వభౌమాధికారం: సీఎస్‌

ఈనాడు, అమరావతి: ప్రజాస్వామ్య వ్యవస్థలో సార్వభౌమాధికారం ప్రజల చేతుల్లోనే ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్‌ వద్ద జవహర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలదండ వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో అన్ని వర్గాల సంక్షేమానికీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అవి అందేలా ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు.


తెలంగాణలో మరికొన్ని రోజులు చలి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మరికొన్ని రోజులపాటు శీతల వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో 15 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రస్తుతం దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని తెలిపింది. బుధవారం తెల్లవారుజామున రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోని చాలా చోట్ల 11.5 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


పంచాయతీ కార్యదర్శులకు అదనపు ఉద్యోగులను కేటాయించాలి

ఈనాడు, అమరావతి: పంచాయతీ కార్యదర్శులకు జీవో-2 ద్వారా అదనపు బాధ్యతలు అప్పగించడంతో పనిభారం పెరగనుందని, అదనంగా ఉద్యోగులను కేటాయించాలని ఏపీ పంచాయతీరాజ్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ గౌరవ ఛైర్మన్‌ టీయూబీ బుచ్చిరాజు గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి పంచాయతీకి ఒక్కో కంప్యూటర్‌ ఆపరేటర్‌, బిల్‌ కలక్టర్లను అదనంగా ఇవ్వాలన్నారు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులపై పర్యవేక్షణ చూడాల్సిన అవసరం కూడా ఉన్నందున కార్యదర్శి పోస్టుకు గెజిటెడ్‌ హోదా కల్పించాలని బుచ్చిరాజు విన్నవించారు.


ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలి: అప్టా

ఈనాడు, అమరావతి: పని సర్దుబాటు కింద ఎస్టీజీలకు సబ్జెక్టు ఉపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించడంతో కొన్నిచోట్ల ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడిందని ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం (అప్టా) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గణపతిరావు, ప్రసాదరావు వెల్లడించారు. ‘కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న ఎస్జీటీలంతా ఉన్నత పాఠశాలలకు వెళ్లిపోతున్నారు. ఇలాంటిచోట్ల బోధన కుంటుపడకుండా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి. అవసరమైతే ప్రత్యేక డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టాలి. పునాదిలాంటి ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి. డీఎస్సీ-98 వారికి వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలి. తెలుగు, హిందీ భాషల ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి’ అని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని