పుస్తకాలు కొంటేనే హాల్ టికెట్లు
ప్రభుత్వ డిగ్రీ, ఎయిడెడ్ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులతో కళాశాల విద్యాశాఖ వ్యాపారం చేస్తోంది.
పేద విద్యార్థులతో కమిషనరేట్ పుస్తకాల వ్యాపారం
13 నైపుణ్యాభివృద్ధి, 4 జీవన నైపుణ్య కోర్సులకు పుస్తకాల రూపకల్పన
ప్రైవేటులో ముద్రణ
ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల విద్యార్థులపై ఒత్తిడి
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ, ఎయిడెడ్ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులతో కళాశాల విద్యాశాఖ వ్యాపారం చేస్తోంది. కమిషనరేట్‌లో మొదటిసారిగా ఒక సొసైటీని ఏర్పాటు చేసి, దాని ద్వారా పాఠ్యపుస్తకాలు ముద్రించి విక్రయిస్తోంది. ఈ పుస్తకాలు కొనకపోతే హాల్‌టికెట్లు సైతం నిలిపివేస్తామంటూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పుస్తకాలు కొనిపించే బాధ్యతలను ఉన్నతాధికారులు ప్రిన్సిపాళ్లకు అప్పగించారు. దీంతో ప్రిన్సిపాళ్లు సతమతమవుతున్నారు. ఇప్పటి వరకు ఉన్నత విద్యామండలి సిలబస్‌ను రూపొందించి దాన్ని ఆన్‌లైన్‌లో పంపిస్తోంది. విద్యార్థులు వారికి అందుబాటులో ఉన్న మెటీరియల్ చదువుకొని పరీక్షలు రాస్తున్నారు. ఇప్పుడు కళాశాల విద్య కమిషనరేట్ ప్రత్యేకంగా జీవన నైపుణ్యాలు, నైపుణ్యాభివృద్ధి కోర్సులకు పాఠ్యపుస్తకాలను రూపొందించి వీటిని కొనాలంటూ ఒత్తిడి చేస్తోంది. ఇప్పటికే బదిలీలు, పోస్టింగ్‌ల వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కమిషనరేట్ ఇప్పుడు ఈ వ్యాపారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేటుగా ముద్రించి..
డిగ్రీలో మార్పు చేసిన సిలబస్ ప్రకారం విద్యార్థులు జీవన నైపుణ్యాలు, నైపుణ్యాభివృద్ధి కోర్సులను చదవాల్సి ఉంటుంది. విద్యార్థులు వారికి నచ్చిన వాటిని ఎంపిక చేసుకొని చదువుకోవచ్చు. దీనికి సంబంధించిన సిలబస్‌ను ఉన్నత విద్యామండలి రూపొందించింది. దీని ఆధారంగా కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ పాఠ్యపుస్తకాలను రూపొందించింది. 13 నైపుణ్యాభివృద్ధి, నాలుగు జీవన నైపుణ్యాలకు సంబంధించిన కోర్సులకు పుస్తకాలను తీసుకొచ్చారు. మొదటి, రెండు, మూడో సెమిస్టర్‌లో విద్యార్థులు వీటిని చదవాల్సి ఉంటుంది. వీటితో వ్యాపారం చేసే ఉద్దేశంతో ఈ పుస్తకాల ముద్రణ, అమ్మకాల కోసం కమిషనరేట్‌లో కొత్తగా సొసైటీని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రైవేటులో ముద్రించి, కళాశాలలకు పంపించారు. ప్రైవేటు కళాశాలలను సైతం ఎన్ని అవసరమో చెప్పాలని అడుగుతోంది. పాఠ్యపుస్తకాలపై ధరను ముద్రించలేదు. వాటి ధరలను పేర్కొంటూ ప్రిన్సిపాళ్లకు ప్రత్యేకంగా ఒక లేఖను పంపించారు. ఒక్కో పుస్తకం రూ.90 నుంచి రూ.140 వరకు ధర నిర్ణయించింది. ఇందులో 20%-25% వరకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొంది. కొన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో మూడో సెమిస్టర్ పరీక్షలు పూర్తయ్యాయి. చాలాచోట్ల విద్యార్థులు బహిరంగ మార్కెట్‌లో లభించే పుస్తకాలను కొనుక్కున్నారు. ఇప్పుడు ఒత్తిడి చేస్తే పుస్తకాలు ఎవరు తీసుకుంటారని ప్రిన్సిపాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.28కోట్లకు పైగా వ్యాపారం..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 80వేల మంది వరకు ఉన్నారు. నైపుణ్యాభివృద్ధి, జీవన నైపుణ్య కోర్సులకు కలిపి ఒక్కో పుస్తకం ధర సగటున రూ.82 పడుతోంది. ఈ లెక్కన పేద విద్యార్థుల నుంచే రూ.5.37కోట్లు వసూలు చేయనున్నారు. ప్రైవేటులో రెండు సంవత్సరాలకు కలిపి సుమారు 3.50లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు విద్యార్థులను కలిపితే రూ.28.33కోట్ల వ్యాపారం సాగనుంది.
కమిషనరేట్ అంటేనే హడల్..
కమిషనరేట్‌లో ముగ్గురు అధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. వారి పేరు చెబితే మామూళ్లు ఇచ్చుకోలేక అధ్యాపకులు హడలిపోతున్నారు. ఇక్కడ ఏ దస్త్రం కదలాలన్నా ఎంతో కొంత ఇచ్చుకుంటే తప్ప ముందుకు కదలడం లేదని ఆరోపిస్తున్నారు. ఎయిడెడ్ సిబ్బందికి పోస్టింగ్‌లు ఇవ్వడం, ఆ తర్వాత వారిని జోనల్ మార్పులు చేయడంలోనూ మామూళ్లు వసూలు చేసినట్లు ప్రచారం సాగుతోంది. బోధనేతర అధికారి ఒకరు ఇటీవల జోన్ మార్పునకు దరఖాస్తు చేసుకోగా.. ఆయనను కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. మామూళ్లను ఇళ్ల వద్ద వసూలు చేసే కొత్త సంస్కృతికి ఇక్కడ తెరతీసినట్లు విమర్శలున్నాయి. పాఠ్యపుస్తకాల వ్యాపారం, పదోన్నతులు, బదిలీలతో కమిషనరేట్‌ను వ్యాపార సంస్థగా మార్చేశారనే ఆరోపణలున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Lottery: రూ.2.9 కోట్ల లాటరీ గెలుచుకుని.. భర్తకు తెలియకుండా మరో పెళ్లి!
-
Movies News
Vishwak Sen: కాంట్రవర్సీకి కారణమదే.. సృష్టించాల్సిన అవసరం నాకు లేదు: విశ్వక్సేన్
-
World News
Ukraine: రష్యాలో జిన్‌పింగ్.. ఉక్రెయిన్‌లో ప్రత్యక్షమైన జపాన్ ప్రధాని
-
India News
Earthquake: దిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
-
Sports News
UPW vs DCW: యూపీని చిత్తు చేసి ఫైనల్స్‌కు దూసుకెళ్లిన దిల్లీ క్యాపిటల్స్
-
India News
Supreme Court: రద్దైన నోట్లపై కేంద్రాన్ని సంప్రదించండి.. పిటిషనర్లకు సుప్రీం సూచన