అనర్హులతో మందుల విక్రయాలు!

ప్రాణాధార మందుల విక్రయాలు తప్పనిసరిగా ఫార్మసిస్టుల ద్వారానే జరగాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలు రాష్ట్రంలో చాలాచోట్ల అమలు కావడంలేదు.

Updated : 27 Jan 2023 05:55 IST

చేష్టలుడిగిన ఔషధ నియంత్రణశాఖ
అస్తవ్యస్తంగా ఫార్మసీ మండలి

ఈనాడు, అమరావతి: ప్రాణాధార మందుల విక్రయాలు తప్పనిసరిగా ఫార్మసిస్టుల ద్వారానే జరగాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలు రాష్ట్రంలో చాలాచోట్ల అమలు కావడంలేదు. కాగితాల్లోనే ఫార్మసిస్ట్‌ పేరును చూపిస్తూ... అనర్హుల ద్వారా మందుల దుకాణాలను నడిపిస్తున్నారు. ఫార్మసీ కోర్సు పూర్తి చేసినవారు తమ డిగ్రీ ధ్రువపత్రాలను మందుల దుకాణాల్లో ఇస్తే, వాటి యజమానులు ఏడాదికి రూ.20 వేల వరకు అందజేస్తున్నారు. దుకాణాల్లో వారి పేర్లతో అనుమతులు పొందినట్లు బోర్డులు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 45,000 మందుల దుకాణాలు ఉన్నాయి. వాటిలో 10% దుకాణాలు మాత్రమే ఫార్మసిస్టుల ద్వారా నడుస్తున్నట్లు ప్రాథమిక అంచనా. లోతుగా విచారణ జరిపితే అసలు సంఖ్య తేలే అవకాశముంది.

పేరు నమోదైతేనే ఫార్మసిస్టులు

డి-ఫార్మసీ, బీ-పార్మసీ, ఫార్మా-డి కోర్సులు పూర్తిచేసిన వారు ఫార్మసీ మండలిలో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇందులో ఇప్పటివరకు 60,000 మంది నమోదు చేయించుకున్నారు. ఏటా కొత్తగా 10,000 మంది నమోదవుతున్నారు. ఆ తర్వాతనే వారు ఫార్మసిస్టులుగా వ్యవహరించాలి. ఐదేళ్లకోసారి పునరుద్ధరణ (రెన్యువల్‌) తప్పనిసరిగా చేయించుకోవాలి.

కార్యాలయం ఉంది... ‘మండలి’ లేదు!

ఫార్మసీ చట్టం-1948 ప్రకారం 14 మంది సభ్యులతో ఫార్మసీ మండలి ఉండాలి. ఇందులో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ముగ్గురు అధికారులు ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం ఐదుగురిని నామినేట్‌ చేసింది. ఆరుగురు సభ్యులను రిజిస్టర్డ్‌ ఫార్మసిస్టులు ఎన్నుకోవాలి. వీరంతా కలిసి ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ కమిటీ ఐదుగురితో ఎగ్జిక్యూటివ్‌ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండలికి చివరిగా 2010లో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికలు జరగలేదు. తదుపరి ఎన్నికలు జరిగే వరకు సభ్యులు కొనసాగవచ్చనే వెసులుబాటు ఉంది. దాంతో ఇలాంటి మండలి ఉన్నట్లే చాలామందికి తెలియని పరిస్థితి నెలకొంది. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఉంటే... ఫార్మసిస్టులు వృత్తిపరంగా చేసే తప్పిదాలను గుర్తించి, చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. ప్రస్తుతం ఇదేమీ జరగడంలేదు. కొందరిపై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అలాగే... రెన్యువల్‌ కోసం గుంటూరులోని కార్యాలయానికి వచ్చే దరఖాస్తులు చాలావరకు తిరస్కారానికి గురవుతున్నాయి. ఎందుకు తిరస్కరిస్తున్నారో తెలియజేయడం లేదు. కార్యాలయంలో ఉద్యోగుల కొరత ఎక్కువగా ఉంది. అలాగే... పేర్ల నమోదు కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ ఓ ప్రహసనంగా మారింది. ఈ కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు