చెబుతాం... చేయం

‘రుణంగా విడుదల చేసిన మొత్తాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాలో ఉంచుతాం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా జమ చేస్తాం.

Updated : 27 Jan 2023 10:31 IST

ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కిన ప్రభుత్వం
ప్రత్యేక ఖాతాలో ఒక్క పైసా జమ చేయలేదు
రహదారి విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం

ఈనాడు, అమరావతి: ‘రుణంగా విడుదల చేసిన మొత్తాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాలో ఉంచుతాం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా జమ చేస్తాం. దీని వల్ల గుత్తేదారులకు చెల్లింపుల్లో ఇబ్బందులు ఉండవు..’ అని న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ)కి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికనుగుణంగా కొంత రుణాన్ని బ్యాంకు విడుదల చేసింది. అది ప్రత్యేక బ్యాంకు ఖాతాలోకి మాత్రం చేరలేదు. ఆ మొత్తంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకొంది. పనులు చేసిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో చుక్కలు చూపిస్తోంది. అత్యధిక జిల్లాల్లో వారు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇదీ రాష్ట్రంలో ఎన్‌డీబీ ప్రాజెక్టు కింద చేపడుతున్న రహదారుల విస్తరణ పనుల దుస్థితి. రూ.6,400 కోట్ల ఈ ప్రాజెక్టులో ఎన్‌డీబీ 70 శాతం రుణం సమకూరుస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వెచ్చించాల్సి ఉంది. మొదటి దశ కింద రూ.1,244 కి.మీ. ఏక వరుస రహదారులను... రూ.1,855 కోట్లతో రెండు వరుసలుగా విస్తరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ఓ ప్యాకేజీగా గుత్తేదారులు పనులు చేస్తున్నారు. రుణం విడుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ సూచనతో ఎన్‌డీబీ పలు షరతులను ముందే చెప్పింది. ఈ నిధుల వినియోగానికి ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలని, తాము రుణం విడుదల చేసిన ప్రతిసారి రాష్ట్ర వాటా కూడా అందులో జమ చేయాలని, ఇందులో 70 శాతం చెల్లింపులు జరిపితేనే తదుపరి రుణ వాటా విడుదల చేస్తామని స్పష్టంగా చెప్పింది.

ఖాతా తెరిచారు అంతే..

ఎన్‌డీబీ షరతుల నేపథ్యంలో.. ఆర్థికశాఖ అనుమతితో గత ఏడాది ఆరంభంలో ఎన్‌డీబీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ (చీఫ్‌ ఇంజినీర్‌) పేరిట ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరిచారు. గత మేలో ఎన్‌డీబీ తొలి విడతగా రూ.230 కోట్ల రుణాన్ని విడుదల చేసింది. వెంటనే దీనిని ప్రత్యేక బ్యాంకు ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది. ప్రభుత్వ వాటా 30 శాతంలో భాగంగా రూ.100 కోట్లను కూడా వీటికి జత చేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఆ బ్యాంకు ఖాతాలోకి రూపాయి కూడా జమ చేయలేదు. మరోవైపు గుత్తేదారులకు ప్రతినెలా 20వ తేదీన బిల్లులు చెల్లిస్తామని, పనులు వేగంగా చేయాలని ఇంజినీర్లు ఒత్తిడి చేస్తూ వచ్చారు. సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు చేసేందుకు వారు ససేమిరా అనడంతో జులైలో రూ.65 కోట్లు, అక్టోబరులో రూ.35 కోట్లు కలిపి మొత్తం రూ.100 కోట్లు చెల్లించింది. ఇప్పుడు మరో రూ.30 కోట్లకుపైగా బిల్లుల కోసం గుత్తేదారులు ఎదురుచూస్తున్నారు. మరికొన్ని బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు అవకాశం కూడా ఇవ్వడం లేదని గుత్తేదారులు పేర్కొంటున్నారు. ఎన్‌డీబీ నుంచి వచ్చిన రుణంలో మిగిలిన రూ.130 కోట్లు ప్రభుత్వం వాడేసుకొని, గుత్తేదారులకు చెల్లింపులు చేయకుండా జాప్యం చేస్తోంది.


22 నెలల్లో కేవలం 15 శాతం పనులు

మొదటి దశ పనులకు అన్ని జిల్లాల్లో గుత్తేదారులు 2021, మార్చిలో ఒప్పందాలు చేసుకున్నారు. 24 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికి 22 నెలలు కాగా, అన్ని జిల్లాల్లో కలిపి సగటున 15 శాతం పనులు మాత్రమే జరిగాయి. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం తదితర జిల్లాల్లో 5 శాతం లోపే పనులు చేశారు. ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందనే నమ్మకం లేకపోవడంతో పనులు చేసేందుకు మొగ్గు చూపడం లేదు. ఒప్పంద గడువు ముగియనుండటంతో.. మరో 9 నెలల గడువు పెంచాలని భావిస్తున్నారు. ప్రభుత్వ తీరు కారణంగా గడువు పెంచినా, అప్పటికి కూడా పనులు పూర్తి చేయడం కష్టమేనని గుత్తేదారులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు