Andhra News: కల్యాణ మండపంలో కలకలం.. ఉన్నట్లుండి ఊడిపోయి పైకి లేచిన ఫ్లోరింగ్ టైల్స్

పెళ్లికొచ్చిన బంధువులు, కుటుంబసభ్యులు భోజనాలు చేస్తున్న హాలులో ఫ్లోరింగ్‌పై టైల్స్‌ ఒక్కసారిగా పగిలిపోయి పైకిలేవడంతో వారంతా భీతావహులై కల్యాణ మండపం నుంచి బయటకు పరుగులు తీశారు.

Updated : 27 Jan 2023 08:09 IST

పెందుర్తి, న్యూస్‌టుడే: పెళ్లికొచ్చిన బంధువులు, కుటుంబసభ్యులు భోజనాలు చేస్తున్న హాలులో ఫ్లోరింగ్‌పై టైల్స్‌ ఒక్కసారిగా పగిలిపోయి పైకిలేవడంతో వారంతా భీతావహులై కల్యాణ మండపం నుంచి బయటకు పరుగులు తీశారు. పెళ్లి బృందం సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా చినముషిడివాడకు చెందిన చిరంజీవి, మౌనిక వివాహ వేడుక స్థానిక దాట్ల మేన్షన్‌లో జరుగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున 5.15 గంటలకు ముహూర్తం. గురువారం రాత్రి 9 గంటల సమయంలో కల్యాణ మండపం మొదటి అంతస్తులోని హాలులో బంధువులంతా భోజనాలు చేస్తుండగా ఒక్కసారిపై నేలపై ఉన్న టైల్స్‌ పగిలిపోవడం ప్రారంభించాయి. పలుచోట్ల టైల్స్‌ ఎగిరిపడ్డాయి. ఈ హఠాత్పరిణామానికి భీతావహులైన వధూవరులు, కుటుంబసభ్యులు, బంధువులు కల్యాణ మండపం నుంచి బయటకు పరుగులు తీశారు. తక్షణమే పెందుర్తి పోలీసులకు, మండపం యాజమాన్యానికి సమాచారం అందించడంతో ఎస్‌ఐ సురేశ్‌, సిబ్బందికి అక్కడకు చేరుకున్నారు. నాలుగు అంతస్తుల భవనంలో మొదటి అంతస్తు మినహా మిగిలిన చోట్ల ఎలాంటి పగుళ్లు లేకపోవడం విస్మయానికి గురయ్యారు. పెళ్లి బృందం ఆందోళన నేపథ్యంలో కల్యాణ మండపం యాజమాన్యం వారికి కృష్ణరాయపురంలోని మరో కల్యాణ మండపాన్ని సమకూర్చారు.

జగన్‌ రాకతో వేదిక మార్పు

చినముషిడివాడ శారదాపీఠం పక్కనున్న పోర్టు కల్యాణ మండపంలో వివాహం చేయడానికి నెలన్నర క్రితమే బుక్‌ చేశామని పెళ్లి కుమార్తె సోదరి బిందు తెలిపారు. పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా సీఎం జగన్‌, గవర్నర్లు వస్తున్నారన్న కారణంగా హఠాత్తుగా కల్యాణ మండపం ఇవ్వలేమని నిర్వాహకులు తెలపడంతో అప్పటికప్పుడు దాట్ల కల్యాణ మండపానికి వెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని