హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణం

రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ప్రతాప వెంకట జ్యోతిర్మయి, వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ప్రమాణం చేశారు.

Published : 28 Jan 2023 05:07 IST

వెంకట జ్యోతిర్మయి, గోపాల కృష్ణారావులతో ప్రమాణం చేయించిన సీజే

ఈనాడు, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ప్రతాప వెంకట జ్యోతిర్మయి, వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర వారితో ప్రమాణం చేయించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ) లక్ష్మణరావు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీచేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అనంతరం సీజే నేతృత్వంలోని ధర్మాసనంతో జస్టిస్‌ వెంకటజ్యోతిర్మయి పాల్గొని కేసుల్ని విచారించారు. జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీతో బెంచ్‌ పంచుకుని జస్టిస్‌ గోపాలకృష్ణారావు కేసులు విన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, నూతన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, ఏజీ శ్రీరామ్‌, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకి రామిరెడ్డి, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ హరినాథ్‌ హాజరయ్యారు.

* న్యాయాధికారులుగా పనిచేస్తున్న పి.వెంకట జ్యోతిర్మయి, వి.గోపాలకృష్ణారావులకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో కొలీజియం ఈనెల 10న కేంద్రానికి సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ నియామక నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే. 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఏపీ హైకోర్టులో 30 మంది సేవలు అందిస్తున్నారు. తాజాగా ఇద్దరి రాకతో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది. న్యాయవాదుల కోటా నుంచి మిగిలిన ఐదు పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.


జస్టిస్‌ పి.వెంకట జ్యోతిర్మయి

జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. బాలా త్రిపురసుందరి, పీవీకే శాస్త్రి దంపతులకు జన్మించారు. డిగ్రీ వరకు తెనాలిలో చదివారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 2008లో నేరుగా జిల్లా జడ్జి కేడర్లో ఎంపికయ్యారు. ఫ్యామిలీ కోర్టు, ఎస్సీఎస్టీ కోర్టు, సీబీఐ కోర్టు, వ్యాట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తి(పీడీజే)గా న్యాయ సేవలు అందించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పీడీజేగా పనిచేస్తూ హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.


జస్టిస్‌ వి.గోపాలకృష్ణారావు

జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు స్వస్థలం కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామం. తల్లిదండ్రులు కోటేశ్వరమ్మ, సోమయ్య. తండ్రి విశ్రాంత సబ్‌ రిజిస్ట్రార్‌. గోపాలకృష్ణారావు అవనిగడ్డ బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 1994లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. 2007లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పదోన్నతి పొందారు. మరోసారి పదోన్నతి పొంది 2016 నుంచి అదనపు జిల్లా జడ్జిగా శ్రీకాకుళం, తిరుపతిలో న్యాయసేవలు అందించారు. గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తూ ఏపీ హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. కుమారుడు వి.రఘునాథ్‌ ఇటీవల జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై కర్నూలు జిల్లా ఆత్మకూరు కోర్టులో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు