Taraka Ratna: తారకరత్నకు తీవ్ర గుండెపోటు

‘యువగళం’ పాదయాత్రలో తొలిరోజు పూజా కార్యక్రమాల్లో పాల్గొని పాదయాత్రకు సిద్ధమవుతున్న సమయంలో సినీ నటుడు నందమూరి తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చింది.

Updated : 28 Jan 2023 06:45 IST

బెంగళూరు ఆసుపత్రికి తరలింపు
ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న బాలకృష్ణ

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: ‘యువగళం’ పాదయాత్రలో తొలిరోజు పూజా కార్యక్రమాల్లో పాల్గొని పాదయాత్రకు సిద్ధమవుతున్న సమయంలో సినీ నటుడు నందమూరి తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చింది.  శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలించారు..తొలుత మధ్యాహ్నం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలోని పీఈఎస్‌ వైద్య కళాశాలకు తరలించారు. శుక్రవారం రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి, కుమార్తెలు ఆసుపత్రికి వచ్చారు. బెంగళూరుకు తీసుకెళ్లాలని వైద్యులు నిర్ణయించారు. ఉదయం లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయం వద్దకు తారకరత్న చేరుకున్నప్పటి నుంచి అభిమానులు చుట్టుముట్టి సెల్ఫీల కోసం పోటీపడ్డారు. దీనికితోడు ఎండ ప్రభావం కాస్త ఎక్కువగా ఉండటంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. లక్ష్మీపురంలోని మసీదు వద్ద కూడా ఇబ్బంది పడటంతో వ్యక్తిగత భద్రతా సిబ్బంది పక్కకు తీసుకెళ్లారు. 15 నిమిషాల తర్వాత పాదయాత్రకు సిద్ధమవుతుండగా మధ్యాహ్నం 12 గంటలకు గుండెపోటు వచ్చింది. కింద పడుతుండగా తెదేపా కార్యకర్తలు పట్టుకున్నారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయన్ని కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించి సీపీఆర్‌ చేయించారు. తర్వాత పీఈఎస్‌ వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. రాత్రి అక్కడే ఉన్నారు. తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణకు తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌ చేసి తెలుసుకున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా పరిస్థితిని తెలుసుకున్నారు. బెంగళూరు హృదయాలయ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స సాగుతోంది. పాదయాత్ర ముగిశాక రాత్రి 8.20 గంటలకు లోకేశ్‌ ఆసుపత్రి వద్దకెళ్లారు. పీఈఎస్‌ ఆసుపత్రి వైద్యులతో చర్చించాక బాలకృష్ణ విలేకరులతో మాట్లాడారు. తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిందని, ఎడమ కవాటం 90 శాతం మూసుకుపోయిందని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. రక్తపోటు సాధారణంగా ఉందని తెలిపారు. ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని