పంచాయతీలకు సర్‌ఛార్జీల మోత

ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు తదితర కారణాలతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న గ్రామ పంచాయతీలకు విద్యుత్తు ఛార్జీలపై విధించిన సర్‌ఛార్జీలు గుదిబండలా తయారయ్యాయి.

Published : 28 Jan 2023 05:07 IST

రూ.2,208 కోట్ల బకాయిలపై రూ.1,434 కోట్ల బాదుడు

ఈనాడు, అమరావతి: ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు తదితర కారణాలతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న గ్రామ పంచాయతీలకు విద్యుత్తు ఛార్జీలపై విధించిన సర్‌ఛార్జీలు గుదిబండలా తయారయ్యాయి. రూ.2,208 కోట్ల విద్యుత్తు బకాయిలపై రూ.1,434 కోట్ల సర్‌ఛార్జీలను విద్యుత్తు పంపిణీ సంస్థలు విధించాయి. కేంద్రం కేటాయించిన 14, 15 ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి విద్యుత్తు ఛార్జీల బకాయిల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో రూ.1,351 కోట్లు మళ్లించింది. 2021-22లో రెండో విడతగా విడుదల చేసిన మరో రూ.948 కోట్లను (15వ ఆర్థిక సంఘం) రాష్ట్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని సీఎఫ్‌ఎంఎస్‌కి అనుసంధానించిన పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ పీడీ ఖాతాల్లో జమ చేసింది. వీటిని కూడా చెల్లించాలని పంచాయతీలకు విద్యుత్తు పంపిణీ సంస్థలు నోటీసులిస్తున్నాయి. 

విద్యుత్తు ఛార్జీలు రూ.3,750.. సర్‌ఛార్జీ రూ.2,341

వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి అవసరాల కోసం పంచాయతీలు వినియోగిస్తున్న విద్యుత్తుకు చెల్లించాల్సిన ఛార్జీలపై పంపిణీ సంస్థలు భారీగా సర్‌ఛార్జీలు విధిస్తున్నాయి. సకాలంలో బిల్లులు చెల్లించలేదన్న కారణంగా భారీగా సర్‌ఛార్జీల భారం మోపుతున్నాయి. ఉదాహరణకు రాయలసీమలోని నంద్యాల మండలం పోలూరు పంచాయతీలో ఒక సర్వీస్‌కి సంబంధించి నెలలో వినియోగించిన విద్యుత్తుపై ఛార్జీల కింద రూ.3,780గా బిల్లులో చూపించిన పంపిణీ సంస్థ.. సర్‌ఛార్జీ కింద మరో రూ.2,341 విధించింది. ట్రూఅప్‌ ఛార్జీలు, ఫిక్స్‌డ్‌ ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ఇతర ఛార్జీలతో కలిపి పంచాయతీ చెల్లించాల్సిన బిల్లు మొత్తం రూ.7,068గా చూపించారు. ఇందులో సర్‌ఛార్జీ 33.14శాతంగా ఉంది.

గ్రామాల్లో అభివృద్ధి పనులెలా?

పాత బకాయిలతో సహా విద్యుత్తు ఛార్జీలకే ఆర్థిక సంఘం నిధులన్నీ చెల్లిస్తే గ్రామాల్లో ప్రజలకు అవసరమైన పనులెలా చేస్తామని సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడమే తడవుగా ఏదో ఒక రూపంలో పంచాయతీలపై ఒత్తిడి తెచ్చి విద్యుత్తు బకాయిలు వసూలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు