ఆ నిధులెందుకు మళ్లించారు?

ప్రభుత్వ కార్పొరేషన్లకు తాజాగా అప్పులు ఇచ్చిన రుణదాతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ మొత్తాలను రాష్ట్ర ఖజానాకు ఎందుకు మళ్లించారు? ఏ అవసరాల కోసం అప్పులు ఇచ్చాం? మీరు ఏం చెప్పి తీసుకున్నారు? వాటిని ఖజానాకు ఎందుకు మళ్లించారని నిలదీసినట్లు సమాచారం.

Published : 28 Jan 2023 05:07 IST

‘రుణదాతల’ ఆగ్రహం
అప్పు తీరుస్తామని డబ్బు తీసుకున్నారు
అవి ఎక్కడ ఉన్నాయో చెప్పండి
రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌ఈసీ పెద్దల తాఖీదు
పోర్టుల కోసం తెచ్చిన అప్పులూ ఖజానాకే..

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ కార్పొరేషన్లకు తాజాగా అప్పులు ఇచ్చిన రుణదాతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ మొత్తాలను రాష్ట్ర ఖజానాకు ఎందుకు మళ్లించారు? ఏ అవసరాల కోసం అప్పులు ఇచ్చాం? మీరు ఏం చెప్పి తీసుకున్నారు? వాటిని ఖజానాకు ఎందుకు మళ్లించారని నిలదీసినట్లు సమాచారం. తక్షణమే ఆ నిధుల నిల్వలు చూపాలని అడిగినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి చెందిన వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు ఈమధ్య పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ వంటి వాటి నుంచి రుణాలు తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మేరకు పోర్టుల నిర్మాణానికి, ఇతరత్రా అవసరాలకు ఈ రుణాలు తీసుకున్నాయి. నిజానికి కార్పొరేషన్లకు ఇచ్చిన రుణాలు ప్రభుత్వ ఖజానాకు మళ్లించడం నిబంధనలకు విరుద్ధమే. కార్పొరేషన్ల నిధులు ప్రభుత్వ అవసరాల కోసం మళ్లిస్తే కేంద్రం నిర్ణయించిన నికర రుణ పరిమితిలో వాటిని కూడా కలిపి లెక్కించాలని 15వ ఆర్థిక సంఘం నిర్దేశించింది. ఇలాంటి పరిస్థితుల్లో జనవరి మూడో వారంలో వివిధ కార్పొరేషన్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ. 5,000 కోట్ల వరకు మళ్లిపోయాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు, అప్పుల తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ వంటి సంస్థలకు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ కూడా ఈ అంశంపై దృష్టి సారించింది. తాజాగా ఆ కార్పొరేషన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ పేరిట రుణాలు ఇచ్చింది. తాము ఇచ్చిన మొత్తం నిల్వ ఉందో లేదో చూపాలని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అధికారులకు తాఖీదు పంపినట్లు సమాచారం.

అప్పు తీర్చేందుకు అప్పు..

ఈ విషయం లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎనర్జీ కార్పొరేషన్‌.. గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌కు ఎప్పటి నుంచో రూ. 2,200 కోట్ల బకాయిలు చెల్లించవలసి ఉంది. దాదాపు మూడు నాలుగు నెలలుగా ఈ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లించాలంటూ వారు ఎనర్జీ కార్పొరేషన్‌, ఆర్థికశాఖ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే తమ వద్ద నిధులు అందుబాటులో లేవంటూ అధికారులు సమాధానం చెబుతూ వస్తున్నారు. బకాయిలు చెల్లించకపోతే దివాలా తీసినట్లు ప్రకటించాల్సి వస్తుందని ఆర్‌ఈసీ పెద్దలు కొందరు పేర్కొంటూ మేమే మళ్లీ అప్పు ఇస్తాం. ఆ మొత్తంలో 2,200 కోట్లు మాకు తిరిగి చెల్లించేయండి అని షరతు పెట్టింది. అయితే అలా వచ్చిన మొత్తం కూడా ఖజానాకు మళ్లించారు. కార్పొరేషన్ల నుంచి రుణాలు ఖజానాకు మళ్లించిన విషయంపై ఫిర్యాదులు రావడంతో ఆర్‌ఈసీ ప్రతినిధులు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులను సంప్రదించారు. మా బకాయి చెల్లిస్తామంటూ రుణం తీసుకుని ఇంతవరకు ఎందుకు తీర్చలేదు అని ప్రశ్నించారు. నెలాఖరులోపు ఆ మొత్తం తీర్చేస్తామని వారు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

పోర్టుల నిర్మాణానికి గతంలో తీసుకున్న రూ. 2,700 కోట్లు, జనవరి మూడో వారంలో కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రూ. 5,000 కోట్లు ఖజానాకు చేరిపోయాయి. ఏయే కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన రుణాలు ఖజానాకు చేరాయన్న సమగ్ర సమాచారం లేకపోయినప్పటికీ, కార్పొరేషన్ల నిధులు ఖజానాకు మళ్లిస్తున్నారనే సమాచారం స్పష్టంగా ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన నిధులు పీడీ ఖాతాల్లో నిల్వ ఉన్నంత మాత్రాన ఆ నిధులు అక్కడే ఉన్నట్లు కాదన్న అంశమూ చర్చనీయాంశమవుతోంది. గతంలోనూ ప్రభుత్వం అప్పులు తెచ్చి అప్పుల నుంచి బయటపడ్డ ఉదంతాలు ఉన్నాయి. రిజర్వుబ్యాంకు వద్ద ఓవర్‌ డ్రాఫ్ట్‌ పరిమితికి మించి వినియోగించుకుని ఆ ఇబ్బంది నుంచి బయటపడేందుకూ కార్పొరేషన్లే ఆదుకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు