వరుసగా రెండోరోజూ ముఖ్యమంత్రి పర్యటన రద్దు

ముఖ్యమంత్రి జగన్‌ వరుసగా రెండోరోజు కూడా తన పర్యటనలను రద్దు చేసుకున్నారు. శనివారం విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉండగా శుక్రవారం రాత్రి ఆ పర్యటన రద్దయింది.

Updated : 28 Jan 2023 11:06 IST

హైదరాబాద్‌, విశాఖ వెళ్తారంటూ షెడ్యూల్‌.. చివరి నిమిషంలో క్యాన్సిల్‌

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ వరుసగా రెండోరోజు కూడా తన పర్యటనలను రద్దు చేసుకున్నారు. శనివారం విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉండగా శుక్రవారం రాత్రి ఆ పర్యటన రద్దయింది. సీఎం పర్యటన షెడ్యూల్‌ను ఆయన కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. తీరా రాత్రయ్యేసరికి అది రద్దయింది. శుక్రవారం కూడా ముఖ్యమంత్రి హైదరాబాద్‌, గుంటూరు జిల్లా పొన్నూరులో పర్యటించాల్సి ఉంది. గురువారం రాత్రి ఆ పర్యటననూ రద్దు చేసుకున్నారు. ముందుగా ఖరారైన పర్యటనలు చివరి నిమిషంలో.. అదీ వరుసగా రెండురోజులూ రద్దు కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు ఆయన కార్యాలయవర్గాల సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రికి సోదరుడి వరసయ్యే కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ఇటీవల సీబీఐ నోటీసులు ఇచ్చింది. సీఎం జగన్‌ బాబాయ్‌, మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ నిమిత్తం హాజరుకావాలని సీబీఐ ఆయనను పిలిచింది. ఇదే సమయంలో సీఎం దిల్లీ పర్యటన ప్రయత్నాల్లో ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దిల్లీ పిలుపు కోసమా!: ముఖ్యమంత్రి జగన్‌ గత నెలాఖరులో దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రిని కలిసి వచ్చారు. ఇప్పుడు మళ్లీ దిల్లీకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని అంటున్నారు. నేడో రేపో ప్రధాని, కేంద్ర హోంమంత్రి అపాయింట్‌ ఖరారవ్వచ్చన్న సమాచారం ఉన్న నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌, పొన్నూరు, శనివారం విశాఖ వెళ్లాల్సి ఉన్నా ఆగిపోయారని సమాచారం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని