సంక్షిప్త వార్తలు (17)
ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడింది.
31న వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
ఈనాడు, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 48 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 31వ తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి శ్రీలంకకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఈ నెల 30 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. సగటు ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
నేడు ఆర్‌ఎల్‌వీ ప్రయోగ పరీక్ష
శ్రీహరికోట, న్యూస్‌టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పునర్వినియోగ వాహకనౌక (ఆర్‌ఎల్‌వీ) మొదటి ల్యాండింగ్ ప్రయోగ పరీక్షను శనివారం నిర్వహించనున్నారు. చెక్కుచెదరకుండా భూమికి తిరిగి రప్పించడానికి, మళ్లీ వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రయోగం చేయనున్నారు.
బొందిలి డైరెక్టర్ పదవి నుంచి రజని తొలగింపు
ఈనాడు డిజిటల్, అమరావతి: వైయస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైకాపా నాయకురాలు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రాజపుత్ర రజనిని ఆ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపిన నకిలీ నోట్ల తయారీ కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. బెంగళూరులోని ఉత్తరాహళ్లి-కెంగేరీ ప్రధాన రహదారిపై వాహనంలో నకిలీ నోట్ల కట్టలు పెట్టుకొని వాటిని మార్చుతూ రెండు రోజుల క్రితం రజని అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. బెంగళూరులోని సుబ్రహ్మణ్యపుర ఠాణా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కేసు నమోదు దృష్ట్యా ఆమె బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్బీకే ఎఫ్‌టీఓ పత్రం ద్వారానే చెల్లింపులు
ఈనాడు, అమరావతి:ఆర్బీకేలు ఇచ్చే ఎఫ్‌టీఓ పత్రం ద్వారానే చెల్లింపులు చేస్తామని, ఈ పత్రం పొందిన రైతులు మిల్లుకు వెళ్లాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎక్స్‌అఫిషియో కార్యదర్శి అరుణ్‌కుమార్ తెలిపారు. మిల్లర్ల నుంచి సమస్య ఉంటే నంబరు 1967 ఫిర్యాదు చేయొచ్చన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 50 ముత్తూట్ మినీ శాఖలు
ఈనాడు, హైదరాబాద్: ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్తగా 11 శాఖలను తెరిచింది. రెండో దశ విస్తరణలో భాగంగా వీటిని సంస్థ ఎండీ మాథ్యూ ముత్తూట్ ఇటీవల ప్రారంభించారు. ఈ నెలాఖరుకు మరో 19 శాఖలను తెరవనున్నట్లు ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల్లో నూతనంగా 50 శాఖలను రెండు దశల్లో ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. తొలి దశలో భాగంగా గత నెలలో కొన్ని శాఖలను ప్రారంభించారు. వీటితో రెండు రాష్ట్రాల్లో కలిపి ఆ సంస్థ శాఖలు 250కి చేరనున్నాయని, దేశవ్యాప్తంగా శాఖల సంఖ్య 900 దాటనున్నట్లు సంస్థ ఎండీ పేర్కొన్నారు. కొత్త శాఖల్లో బంగారు తనఖాపై రుణాలు, బీమా, నగదు బదిలీ, మైక్రో ఫైనాన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలు అందించనున్నామని ఆయన తెలిపారు.
ముఖ ఆధారిత హాజరు నుంచి మినహాయింపునివ్వాలి
ఏపీ అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం డిమాండ్
ఈనాడు డిజిటల్, అమరావతి: ముఖఆధారిత హాజరు విధానం నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలకు మినహాయింపునివ్వాలని ప్రభుత్వాన్ని ఏపీ అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు బేబీరాణి, సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలన్నారు. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలపై మహిళా సంక్షేమ కార్యదర్శి, తహసీల్దారు, ఎంపీడీవోలకు తనిఖీ బాధ్యతలు అప్పగించారని, ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాలు కూడా పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడం వేధింపులకు గురి చేసేందుకేనని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణకు సంబంధించి గత 6 నెలల నుంచి కొన్ని కేంద్రాల్లో బిల్లులు చెల్లించలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లుల్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం వచ్చే నెల 6వ తేదీన జిల్లా కలెక్టర్/ పీడీ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు.
విశాఖ-చెన్నై నడవా వెంట వందేభారత్ ప్రారంభించాలని వినతి
ఈనాడు, దిల్లీ: తయారీ, సేవా రంగానికి ప్రోత్సాహం, మేక్‌ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేర్చేందుకుగానూ విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవా వెంట వందేభారత్ రైలును ప్రారంభించాలని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఆయన లేఖ రాశారు. 800 కిలోమీటర్ల పొడవైన నడవాలో వందేభారత్ రైలు ప్రవేశపెడితే అనుసంధానం పెరిగి వ్యాపారుల ప్రయాణం వేగవంతమవుతుందన్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య పిడుగురాళ్ల-గుంటూరు మీదుగా మరో వందే భారత్ రైలును ప్రారంభించాలని ఆయన కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున వెంటనే ఈ మార్గంలో వందే భారత్ రైలు ప్రారంభించాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఉప తహసీల్దార్లకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని డిప్యూటీ తహసీల్దార్ (రీసర్వే)లకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్‌ఆర్ జగన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా వీరికి రీ సర్వేకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు అప్పగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
హమాలీ ఛార్జీలు పెంపు
ఈనాడు, అమరావతి: మండల స్థాయి గోదాముల్లో పని చేసే హమాలీలకు హమాలీ ఛార్జీలను రూ.22 నుంచి రూ.25కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో లోడింగ్, అన్‌లోడింగ్‌కు క్వింటాకు రూ.22 ఉండగా.. హమాలీల వినతి మేరకు రూ.25కు పెంచినట్లు వెల్లడించింది. దీంతో ఏడాదికి అదనంగా రూ.9.34కోట్లు భారం పడనున్నట్లు తెలిపింది.
సమర్థత, నిజాయతీ, ప్రజల్లో విశ్వాసంలో.. ఏపీ పోలీసుకు మొదటి స్థానం: డీజీపీ
ఈనాడు, అమరావతి: ప్రజల్లో విశ్వాసం, సమర్థత, నిజాయతీ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వివిధ ఏజెన్సీలతో నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకూ మూడు రోజుల పాటు దిల్లీలో డీజీపీలతో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే ఫలితాలు విడుదల చేసిందని వివరించారు. దిశ మొబైల్‌యాప్‌ను 1.70 కోట్ల సెల్‌ఫోన్లలో రిజిస్ట్రేషన్ చేయించటం, ప్రజాహిత పోలీసింగ్, సాంకేతికత వినియోగం, పోలీసుల్లో క్రమశిక్షణ పెంపు తదితర అంశాల్లో కృషి వల్ల ఈ ఫలితాలు సాధ్యపడ్డాయని అన్నారు.
లాభాపేక్ష లేకుండా పాఠ్యపుస్తకాలు అందిస్తున్నాం
కళాశాల విద్యాశాఖ కమిషనర్
ఈనాడు, అమరావతి: విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా జీవన నైపుణ్యాలు, నైపుణ్యాభివృద్ధి పుస్తకాలను అందిస్తున్నామని కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. పుస్తకాల ముద్రణ, కళాశాలకు చేరవేసేందుకు అయ్యే రవాణా ఖర్చులను పరిగణనలోకి తీసుకొని రూ.70 నుంచి రూ.100 వరకు పుస్తక ధరగా నిర్ణయించామని వెల్లడించారు. ‘పుస్తకాలు కొంటేనే హాల్‌టికెట్లు’ శీర్షికతో ఈనాడులో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. పాఠ్యపుస్తకాలు కొనకపోతే హాల్‌టిక్కెట్లు నిలిపివేయమని కమిషరేట్ నుంచి ఎలాంటి ఆదేశాలివ్వలేదని వెల్లడించారు. పుస్తక ముద్రణ విషయంలో అత్యంత పారదర్శకంగా, నిబంధనలు పాటించి టెండర్లు నిర్వహించామని తెలిపారు. పేజీకి 0.21 పైసలు మాత్రమే నిర్ణయించి ముద్రణ సంస్థకు అప్పగించామని వివరించారు. నిష్ణాతులైన అధ్యాపకులతో పాఠ్యపుస్తకాలను రూపొందించామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే ఎయిడెడ్ సిబ్బందికి పోస్టింగులు, జోనల్ మార్పు చేశామని.. ఇందులో మామూళ్లు ఇవ్వడం, అధికారుల వసూలు ఆరోపణలు అవాస్తవమని వెల్లడించారు.
ఏపీ వైద్యఆరోగ్యశాఖకు రెండు జాతీయ పురస్కారాలు
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో రాష్ట్రీయ కిషోర్ స్వాస్త్య కార్యక్రమం, స్కూల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్రోగ్రాంలను సమర్థంగా అమలు చేస్తున్నందుకు జాతీయ స్థాయిలో రెండు పురస్కారాలు వచ్చినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆరోగ్యం, యుక్తవయసు బాలికల ఆరోగ్య పరిరక్షణకు చేసిన కృషి వల్ల ఈ పురస్కారాలు దక్కినట్లు పేర్కొంది. రక్తహీనత నివారణకు ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న బాలికలకు ఐఎఫ్‌ఏబ్లూ మాత్రల పంపిణీ చేసినట్లు, యుక్తవయసులో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి పది వేల మంది ప్రిన్సిపాళ్లు, 20,200 ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది.
పాలిటెక్నిక్‌ల రాష్ట్రస్థాయి క్రీడలు
ఈనాడు, అమరావతి: విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఫిబ్రవరి ఒకటి నుంచి మూడో తేదీ వరకు పాలిటెక్నిక్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. క్రీడలకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు.
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు
ఈనాడు, అమరావతి: జేఈఈ మెయిన్-23 ఆడ్మిట్ కార్డులను జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) విడుదల చేసింది. ఈనెల 28, 29, 30 తేదీల్లో జరిగే పరీక్షలకు ఆడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచింది. బీఆర్క్, బీప్లానింగ్ 28న 285 నగరాల్లో 343 కేంద్రాల్లో సుమారు 46లక్షల మంది పరీక్ష రాయనున్నారు. బీఈ, బీటెక్ పేపర్-1కు పరీక్షకు 278 నగరాల్లోని 507 కేంద్రాల్లో 2.87లక్షల మంది విద్యార్థులు 29, 30న పరీక్ష రాయనున్నారు.
ఏప్రిల్ 4న ప్రధాన పరీక్ష
ఈనాడు, అమరావతి: రెవెన్యూ శాఖకు చెందిన జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూపు-4) ఉద్యోగ నియామక ప్రధాన పరీక్ష ఏప్రిల్ 4న జరగనుంది. పేపర్-1 ఉదయం 9.30-12.00, పేపరు-2 మధ్యాహ్నం 2.30-5.00 గంటల మధ్య జరుగుతుందని ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు ‘ఆయుష్’ పరీక్షలు ఆయుర్వేద, హోమియోపతి, యునాని లెక్చరర్స్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో భాగంగా రాత పరీక్షలు (కంప్యూటర్ ఆధారిత) ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది.
దరఖాస్తుదారులు కోరుకుంటే స్లాట్ల మార్పు
ఈనాడు’ కథనానికి స్పందన
పర్చూరు, న్యూస్‌టుడే: దివ్యాంగ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తుదారులు కోరుకుంటే స్లాట్లు మారుస్తామని వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘ఇతర జిల్లాలో స్లాట్లు.. దివ్యాంగులకు పాట్లు’ శీర్షికతో వచ్చిన కథనంపై కమిషనర్ స్పందించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రాష్ట్రం మొత్తం ఒక యూనిట్‌గా ఏర్పాటుచేశామని, దరఖాస్తుదారుల విజ్ఞపి మేరకే స్లాట్ల కేటాయింపు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లలేని వారు స్పందన లేక మెయిల్ ద్వారా తమకు తెలియజేస్తే దగ్గరగా ఉన్న ఆసుపత్రులలో స్లాట్‌లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టంచేశారు.
పోలవరంలో నాణ్యత పరీక్షలు
పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రంవాల్ నాణ్యతను తెలుసుకునే ప్రక్రియలో భాగంగా స్వీడన్ నుంచి తీసుకొచ్చిన పరికరంతో హరియాణాకు చెందిన జాతీయ జలవిద్యుత్తు బోర్డు నిపుణులు పరీక్షలు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం అంగళూరు సమీపంలో నిర్మించిన గ్యాప్-1, గ్యాప్-2లో శుక్రవారం ఈ పరికరం ద్వారా వివరాలు నమోదు చేసుకున్నారు. పరీక్షల విధానాన్ని ప్రాజెక్టు సీఈ బి.సుధాకరబాబు పరిశీలించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Legacy Contact: వారసత్వ నంబరు ఎలా?
-
Movies News
Mrunal Thakur: ‘నా కథను అందరితో పంచుకుంటా..’ కన్నీళ్లతో ఉన్న ఫొటో షేర్ చేసిన మృణాల్
-
World News
Earthquake: పాక్, అఫ్గాన్‌లో భూకంపం.. 11 మంది మృతి..!
-
Ts-top-news News
RTC Cargo: తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Movies News
Anasuya: ప్రెస్మీట్లో కన్నీరు పెట్టుకున్న అనసూయ
-
World News
నీటి లోపల వంద రోజులు జీవిస్తే.. ప్రొఫెసర్ ఆసక్తికర ప్రయోగం!