అరబిందో శరత్‌చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్‌

దిల్లీ మద్యం కేసులో నిందితుడు అరబిందో డైరెక్టర్‌ పెనక శరత్‌చంద్రారెడ్డికి దిల్లీ రౌస్‌అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Updated : 28 Jan 2023 05:42 IST

నానమ్మ అంత్యక్రియల నేపథ్యంలో మంజూరు  
హైదరాబాద్‌ విడిచివెళ్లొద్దని కోర్టు ఆదేశం

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో నిందితుడు అరబిందో డైరెక్టర్‌ పెనక శరత్‌చంద్రారెడ్డికి దిల్లీ రౌస్‌అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన తిహాడ్‌ జైలులో ఉన్నారు. బెయిల్‌ మంజూరు కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై గత బుధవారం విచారణ ముగించిన ధర్మాసనం ఫిబ్రవరి 9న తీర్పును వెల్లడించనున్నట్లు తెలిపింది. అదే రోజు సాయంత్రం శరత్‌చంద్రారెడ్డి నానమ్మ మరణించారు. ఆమె అంత్యక్రియలు, కర్మకాండల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలంటూ శరత్‌చంద్రారెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కే.నాగ్‌పాల్‌ ఆ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టారు. ఆమె చివరి కోరిక మేరకు అంత్యక్రియలు, కర్మకాండల నిర్వహణకు రెండు వారాలు బెయిల్‌ మంజూరు చేయాలని శరత్‌చంద్రారెడ్డి తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనల అనంతరం ప్రత్యేక న్యాయమూర్తి శరత్‌చంద్రారెడ్డికి 14 రోజుల పాటు పలు షరతులతో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేశారు. రూ.2 లక్షలు విలువైన వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలన్నారు. అంత్యక్రియలు, కర్మకాండల విషయంలో తప్పనిసరైతే మినహా శరత్‌చంద్రారెడ్డి హైదరాబాద్‌ దాటి వెళ్లవద్దన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లరాదని ఉత్తర్వులో న్యాయమూర్తి పేర్కొన్నారు. తన మొబైల్‌ను ఆన్‌లో ఉంచడమే కాక పూర్తి సమయం లోకేషన్‌ ఆన్‌ చేసి ఉంచాలన్నారు. నానమ్మ అస్థికలను నిమజ్జనం చేసేందుకు హైదరాబాద్‌ విడిచి వెళ్లాల్సి వస్తే విచారణాధికారికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ‘‘ఎటువంటి నేరకార్యక్రమాల్లో భాగస్వామికాకూడదు. ఫిబ్రవరి 10వతేదీ సాయంత్రం ఆరులోపు తిహాడ్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎదుట లొంగిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యంతర బెయిల్‌ పొడిగింపు కోరకూడదు’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని