అహోబిల మఠం ఆలయ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు

కర్నూలు జిల్లాలోని అహోబిల మఠం ఆలయాన్ని చేజిక్కించుకోవాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

Updated : 28 Jan 2023 05:54 IST

ఈవోను నియమించాలన్న పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ఈనాడు, దిల్లీ: కర్నూలు జిల్లాలోని అహోబిల మఠం ఆలయాన్ని చేజిక్కించుకోవాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అక్కడ కార్యనిర్వహణ అధికారి (ఈవో)ని నియమించి, ఆలయ వ్యవహారాలను వారి ద్వారా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేస్తూ ఏపీ హైకోర్టు తీర్పిచ్చిన సంగతి తెలిసిందే. దాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శుక్రవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఏఎస్‌ ఓక్‌లతో కూడిన ధర్మాసనం ఆలయ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితుల గురించి న్యాయవాదులు చేసిన వాదనలతో సంతృప్తి చెందలేదు. ఆలయ వ్యవహారాల్లో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఆయన వాదనలను క్లుప్తంగా విన్న అనంతరం సంతృప్తి చెందని న్యాయమూర్తి ‘ఆలయాన్ని అక్కడి వారే చూసుకోనివ్వండి. ధార్మిక స్థలాల వ్యవహారాలను అక్కడి ధర్మకర్తలకే ఎందుకు వదిలిపెట్టరు’ అని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. కర్నూలు జిల్లాలోని ప్రఖ్యాత అహోబిలం మఠ ఆలయానికి కార్యనిర్వాహక అధికారిని నియమించి, అక్కడి వ్యవహారాలను పర్యవేక్షించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ భక్తులు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ఈ కేసులో ఏపీ హైకోర్టు నిరుడు అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. ఈవోను నియమించడం ఆర్టికల్‌ 26(డి) ఉల్లంఘన కిందికి వస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ ఛారిటబుల్‌ అండ్‌ హిందూ ధార్మిక సంస్థలు మరియు దేవాదాయ చట్టం కింద మఠానికి కానీ, ఆలయానికి కానీ ఈవోను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని.. ఆ చట్టంలోని 5వ అధ్యాయంలో మఠాలకు ప్రత్యేకహోదా కల్పించి వాటి వ్యవహారాలను నిర్వహించే అధికారాన్ని వాటికే అప్పగించినట్లు పిటిషనర్లు చేసిన వాదనలను హైకోర్టు సమర్థించింది. అహోబిల మఠాన్ని, ఆలయాన్ని మఠాధిపతులే నిర్మించి అనాదిగా నిర్వహిస్తున్నారని.. అందువల్ల ఎక్కడైనా అధికార దుర్వినియోగం ఉంటే తప్ప ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 4న సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం అహోబిల మఠం ఆలయానికి కార్యనిర్వహణాధికారిని నియమించే అధికారం కానీ, న్యాయపరిధి కానీ చట్ట ప్రకారం ఏపీ ప్రభుత్వానికి లేవని స్పష్టం చేసింది. ధర్మకర్తలే అక్కడి విషయాలు చూసుకోనివ్వాలని తేల్చిచెప్పింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు