సుందరీకరణ పేరుతో ఇష్టారాజ్యం

ప్రముఖులు వస్తున్నారంటే చాలు విశాఖ నగరంలో పచ్చదనంపై వేటు పడుతోంది. శారదా పీఠానికి వెళ్లే రహదారి మధ్యలో మొక్కలను ఇటీవల పూర్తిగా కొట్టేసిన తీరు విమర్శలకు తావిచ్చింది.

Published : 28 Jan 2023 04:01 IST

విశాఖలో పచ్చదనంపై వేటు
ప్రముఖుల రాక పేరుతో విధ్వంసం
చివరి నిమిషంలో సీఎం పర్యటన రద్దు

ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, పెందుర్తి: ప్రముఖులు వస్తున్నారంటే చాలు విశాఖ నగరంలో పచ్చదనంపై వేటు పడుతోంది. శారదా పీఠానికి వెళ్లే రహదారి మధ్యలో మొక్కలను ఇటీవల పూర్తిగా కొట్టేసిన తీరు విమర్శలకు తావిచ్చింది. ఇది మరువకముందే బీచ్‌ రోడ్డులో మొక్కల కొమ్మలను కొట్టేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం విశాఖకు రావాల్సి ఉంది. ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు శుక్రవారం జిల్లా అధికారులకు సమాచారం వచ్చింది. అప్పటికే పలు ప్రాంతాల్లో అధికారుల చర్యల వల్ల పచ్చదనంపై వేటు పడింది. సుందరీకరణ పేరుతో భారీ వ్యయంతో జీవీఎంసీ ఏకంగా హరిత విధ్వంసానికి పాల్పడింది. రూ.కోట్ల వ్యయంతో చేపట్టిన సుందరీకరణ పనులపై విస్మయం వ్యక్తమవుతోంది. పనుల్లో భాగంగా సాగర తీరానికి సమీప రహదారిపై ఏపుగా, పచ్చగా పెరిగిన మొక్కలను ట్రిమ్మింగ్‌ పేరుతో కొట్టేసి కాండం తాలూకు మొద్దులనే మిగిల్చారు. వాటిపై రంగులతో అందమైన చిత్రాలను వేస్తున్నారు. బొమ్మలను గోడలపై వేయాలిగానీ.. ఇందుకోసం పచ్చని మొక్కలను కొట్టేయడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

చిరువ్యాపారుల అష్టకష్టాలు

చినముషిడివాడ కూడలి నుంచి శారదాపీఠం రోడ్డులో డివైడర్‌పై మట్టి పోసి పచ్చిక పరిచారు. చెట్ల స్థానంలో అలంకరణ మొక్కలను నాటారు. చినముషిడివాడ స్వాగత ద్వారం నుంచి శారదాపీఠం రోడ్డులోని తమ దుకాణాలను శుక్ర, శనివారం మూసేయాలని జీవీఎంసీ అధికారులు హెచ్చరించారని చిరు వ్యాపారులు వాపోయారు. శుక్రవారం ఈ మార్గంలో జరగాల్సిన సంతనూ రద్దు చేశారు.


స్థానికుల ఫిర్యాదు మేరకే

- రాజాబాబు, జీవీఎంసీ కమిషనర్‌

డివైడర్లపై మొక్కలు దట్టంగా పెరిగి ఇబ్బందికరంగా మారాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. కొమ్మలు దట్టంగా పెరగడంతో వీధి దీపాల తాలూకూ వెలుగులూ ప్రసరించడం లేదు. ‘కోనే కార్పస్‌’ అనే రకం మొక్కలను డివైడర్లపై గతంలో నాటారు. వీటి కొమ్మలను కొట్టేసినా రెండు నెలల్లోనే పెరుగుతాయి. కొమ్మలను కొట్టకుండా వదిలేస్తే భారం పెరిగి మొక్క మొత్తం విరిగే ముప్పుంది. విజయవాడ-గన్నవరం మధ్య కొన్ని మొక్కల కాండాలకు రంగులేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అలాగే విశాఖలోనూ చేస్తున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు