అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి.

Updated : 28 Jan 2023 05:26 IST

శ్రీకాకుళం సాంస్కృతికం, అరసవల్లి, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయశాఖ కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మహాక్షీరాభిషేకాన్ని ఆరంభించారు. శనివారం ఉదయం 7 గంటల వరకు క్షీరాభిషేకం కొనసాగనుంది. స్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం రాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. భక్తులు రద్దీ దృష్ట్యా 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

  నేడు తిరుమలలో రథసప్తమి మహోత్సవం

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీ వేంకటేశ్వరస్వామివారి రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి తితిదే ఏర్పాట్లు చేసింది. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు శ్రీవారు సప్త వాహనాల్లో విహరిస్తూ భక్తకోటిని శనివారం అనుగ్రహించనున్నారు. ఈ క్రమంలోనే మహద్వారం నుంచి స్వామి సన్నిధి వరకు పుష్పాలంకరణ చేస్తున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు చేశారు. భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2 నుంచి నేరుగా అనుమతిస్తారు. వీఐపీ బ్రేక్‌, ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.

సర్వదర్శనానికి 30 గంటలు 

శ్రీవారి ధర్మదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు శుక్రవారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి నారాయణగిరిలోని 7 షెడ్లలో వేచిఉన్నారు. వీరికి దాదాపు 30 గంటల్లో దర్శనం లభించనుందని తితిదే తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు