‘సంక్రాంతి’ కష్టం ఉద్యోగులది.. నగదు ప్రోత్సాహకం ఉన్నతాధికారులకు

సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ పెద్దఎత్తున నడిపిన ప్రత్యేక బస్సులతో సంస్థకు భారీగా అదనపు ఆదాయం వచ్చింది.

Published : 28 Jan 2023 06:32 IST

ఆర్టీసీ యాజమాన్యం తీరుపై నిరసనలు

ఈనాడు, అమరావతి: సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ పెద్దఎత్తున నడిపిన ప్రత్యేక బస్సులతో సంస్థకు భారీగా అదనపు ఆదాయం వచ్చింది. ఈ నేపథ్యంలో యాజమాన్యం కేవలం ఉన్నత స్థాయి అధికారులకే నగదు ప్రోత్సాహకాన్ని ఇచ్చి క్షేత్రస్థాయి సిబ్బందిని పూర్తిగా విస్మరించింది. రాష్ట్ర, జోనల్‌ స్థాయి అధికారులకు రూ.30 వేలు, జిల్లాస్థాయి అధికారులకు రూ.15 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని మూడు రోజుల కిందట వారి ఖాతాల్లో యాజమాన్యం జమ చేసింది. ప్రయాణీకుల రద్దీకి తగినన్ని బస్సులను సిద్ధం చేసి గమ్యస్థానాలకు చేర్చిన డ్రైవర్‌, కండక్టర్లు, ఇతర సిబ్బంది, డిపో మేనేజర్లకు ఎలాంటి ప్రోత్సాహకాలను ఇవ్వలేదు. ఇప్పుడిప్పుడే ఈ విషయం ఉద్యోగులందరికీ తెలియడంతో యాజమాన్యం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో పండగల సమయంలో ప్రత్యేక బస్సులు నడిపినప్పుడు ఎక్కువ ఆదాయం వస్తే ఉద్యోగులందరికీ మిఠాయి బాక్సులు అందజేసి ప్రోత్సహించేవారు. ఇప్పుడు కనీసం అవి కూడా లేకుండా ఉన్నతాధికారులకు మాత్రం నగదు ఇవ్వడమేంటని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఐదు నెలలుగా ఉద్యోగులకు పీఆర్సీతో కూడిన జీతాలు ఇస్తున్నప్పటికీ భత్యాలు, ఓటీలను ప్రభుత్వం సమకూర్చడం లేదు. ఏ నెలకానెల జీతంతోపాటు వీటిని అందేలా చూస్తామన్న అధికారుల హామీలు అమలవడం లేదు. దీనిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో సంక్రాంతి నగదు ప్రోత్సాహకాన్ని ఉన్నతస్థాయి అధికారులకు పరిమితం చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు